నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన వందో సినిమా…. గౌతమి పుత్ర శాతకర్ణితో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని ఎలాగైనా సరే.. సంక్రాంతి బరిలో నిలపాలన్న దీక్షతో.. శ్రమిస్తున్నారు. బాలయ్య వందో సినిమా గురించి కొత్త కొత్త కబుర్లు వినిపిస్తున్నాయి. ఈ సందడిని రెట్టింపు చేయడానికి బాలయ్య 101వ సినిమా ‘రైతు’ కబుర్లు కూడా బయర్దేరాయి. 2017 ఫిబ్రవరిలో ‘రైతు’ సెట్స్‌పైకి వెళ్తుంది. ఈలోగా… అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్ని ముగించాలని బాలయ్య, కృష్ణవంశీ భావిస్తున్నారు. అందుకే ఇటు బాలయ్య గౌతమిపుత్రతో, అటు కృష్ణవంశీ నక్షత్రంతోనూ బిజీగా ఉన్నా… ‘రైతు’ కోసం కూడా కొంత సమయం కేటాయిస్తున్నారు. ఇటీవలే బాలయ్య, కృష్ణవంశీ కలసి బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ని కలుసుకొని, ‘రైతు’ సినిమాలో ఓ పాత్ర కోసం రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కథ గురించి చూచాయిగా తెలుసుకొన్న బిగ్ బీ… ఈసినిమాలో అతి ముఖ్యమైన ఓ పాత్రని పోషించడానికి అంగీకరించారు. ఆ పాత్ర ఏమిటన్న విషయంలో రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు 360.కామ్‌కి తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఇందులో బిగ్ బీ ‘రాష్ట్రపతి’ గా కనిపించబోతున్నార్ట. రైతు ఉద్యమ నాయకుడిగా కథానాయకుడు రాష్ట్రపతిని కలుసుకొనే సందర్భం ఈ చిత్రంలో ఉందట. ఆ పాత్రకి అమితాబ్ అయితేనే బాగుంటుందని భావించిన కృష్ణవంశీ.. వర్మ ద్వారా రికమెండ్ చేయించాడని తెలుస్తోంది. కథ, అందులో తన పాత్ర నచ్చడంతో బిగ్ బీ మరో ఆలోచన లేకుండా ఈసినిమా చేయడానికి ఒప్పుకొన్నారని తెలుస్తోంది.