ఆయన బాలీవుడ్‌కు సూపర్‌స్టార్. ఈదేశానికంతటికీ కూడా సూపర్‌స్టార్ అనేంత గొప్ప నటుడిగా ఆయన కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆయనకు ఉన్న సినిమా సూపర్ ఇమేజి.. సాధించి పెట్టగల ఇతర అవకాశాలు ఇప్పుడు మట్టిగొట్టుకుపోతున్నాయి. పనామా కుంభకోణంలో తన పేరు బయటకు రావడం.. ఆయనకు ఎంత మచ్చ తెచ్చిపెట్టిందంటే.. నిన్నటిదాకా ఆయన్ను నెత్తిన పెట్టుకోవాలని అనుకుంటూ వచ్చిన మోడీ సర్కారు ఇప్పుడు క్రమంగా ఆయన పేరు తలవడానికే ఆలోచించే స్థితికి వచ్చింది.. అంటే అతిశయోక్తి కాదు.
అమితాబ్ బచ్చన్.. గ్రహాలు అన్నీ పద్ధతిగా అనుకూలిస్తే నెక్ట్స్ టర్మ్ కు ఈ దేశానికి ప్రథమపౌరుడిగా, రాష్ట్రపతిగా వెలుగొందుతాడని కూడా అంతా అనుకున్నారు. ప్రణబ్ దాదా పదవీకాలం పూర్తయిన తర్వాత అమితాబ్‌ను భాజపా మద్దతు ఇచ్చే అభ్యర్థిగా రాష్ట్రపతి బరిలో నిలిపేందుకు ప్రధాని మోడీ కూడా సానుకూలంగా ఉన్నట్లుగా కొన్ని వారాల కిందట వార్తలు వచ్చాయి.
అయితే ఈ కొద్ది వ్యవధిలో సమీకారణాలు పూర్తిగా మారిపోయాయి. పనామా కుంభకోణం వెలుగులోకి రావడం.. అందులో అమితాబ్ పేరు కూడా ఉండడం ఇప్పుడు ఆయన అవకాశాలకు గండికొడుతోంది. భయంకరమైన నేరాల్లో జైలుశిక్ష అనుభవించిన వారిని కూడా ఆదరించే మన బాలీవుడ్లో సినీ అవకాశాలకు డోకా ఉండదు గానీ.. ఇతరత్రా గౌరవప్రదమైన అవకాశాలు చేజారిపోతున్నాయి. మోడీ చాలా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ అనే ప్రచారానికి అమితాబ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ ఆలోచన మానుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అమితాబ్ మాత్రం తన గౌరవానికి భంగం కలగకుండా, ఆ విషయమై నన్ను ఎవరూ సంప్రదించనే లేదు అని చెప్పుకుంటున్నారు. ఆయన పైకి ఏం చెప్పుకున్నప్పటికీ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు, ముందు ముందు ఆయన కలగన్న ఇతర అవకాశాలు అన్నీ.. ఈ పనామా మంటల్లో సాంతం దహనం అయిపోయినట్లే అని పలువురు విశ్లేషిస్తున్నారు.