హైదరాబాద్: మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎక్కడకెళ్ళినా అభిమానులు ఫాలో అవటం సహజమే. అయితే నిన్న ఒక అనూహ్యమైన అభిమాని అమితాబ్‌ను ఫాలో అవటం సంచలనం సృష్టించింది. ఆ అభిమాని ఒక పెద్దపులి. ఈ ఘటన ముంబాయి నగర నడిబొడ్డునే జరగటం విశేషం.
అంతరించిపోతున్న వన్యప్రాణుల కోవలోకి చేరుకుంటున్న పెద్ద పులుల సంరక్షణకోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా అమితాబ్‌ను ఆ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంది. నిన్న ముంబాయి నగరంలో ఉన్న సంజయ్ గాంధి నేషనల్ పార్క్ అడవిలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతోపాటు బ్రాండ్ అంబాసిడర్ హోదాలో అమితాబ్ కూడా దానికి హాజరయ్యారు. తర్వాత వారంతా కలిసి అడవిలోని టైగర్ రిజర్వ్‌లో సఫారీ వాహనంలో కలియతిరిగారు. సఫారీలో పులులు ఉండటం సహజమే. అయితే ఆ సఫారీ యాత్ర ముగిసిపోయినా అమితాబ్ తదితరులు ఉన్న వాహనాన్ని ఒక పెద్దపులి నాలుగు కిలోమీటర్లపాటు అనుసరించింది. వాహనం వెనక కూర్చునిఉన్న అమితాబ్ ఆ ఫోటోలు తీసి తన సోషల్ మీడియాలో పెట్టారు. ముంబై నగర నడిబొడ్డున ఇంత పెద్ద అడవి ఉందని తనకు తెలియదని, ఇది అద్భుతమని అన్నారు. దీనిని కాపాడుకోవాలని పేర్కొన్నారు.