హైదరాబాద్: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యం గురించి సంచలన వాస్తవాన్ని బయటపెట్టారు. ఆయన కాలేయం 75 శాతం పాడైపోయిఉందట. కేవలం 25 శాతం ఆరోగ్యంగా ఉన్న కాలేయంతోనే బండి లాగుతున్నట్లు అమితాబ్ స్వయంగా చెప్పారు. హెపటైటిస్ బీ వ్యాధిపై మీడియా ఎవేర్నెస్ క్యాంపెయిన్ సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. 32 ఏళ్ళక్రితం ‘కూలి’ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదం జరిగినపుడు తనకు దాదాపు 40 బాటిళ్ళ రక్తం ఎక్కించారని, వాటిలో ఒకదానిలో ఉన్న హెపటైటిస్ బీ వైరస్ తన శరీరంలో చేరి నిశ్శబ్దంగా చేరి కాలేయాన్ని తినేసిందని వెల్లడించారు. 2004 దాకా ఆ సంగతి తనకు తెలియదని చెప్పారు. అప్పటినుంచి మందులు స్థిరంగా తీసుకోవటంతో తాను ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నానని తెలిపారు. కాలేయం ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం అవసరమని అన్నారు.
కాలేయ ఆరోగ్యరీత్యా అమితాబ్ కాఫీ, టీ, ఏరేటెడ్ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, నాన్ వెజ్, చాకొలేట్స్, పేస్ట్రీస్, ఇండియన్ స్వీట్స్, పాన్, అన్నం మొదలైన పదార్థాలను వేటినీ తీసుకోరు. ఆల్కహాల్‌ను 35 సంవత్సరాల క్రితమే వదిలేశారు. స్మోకింగ్ కూడా ఆపేశారు. అంత డబ్బు ఉండీ అనుభవించే అదృష్టం లేకపోవటం నిజంగా ఎంత దురదృష్టం! అందుకే, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.