కాస్త జుట్టు తెల్లబడగానే కాదంటే నాలుగో పడిలో ప్రవేశించగానే ప్రతివారూ మా రోజుల్లో అంటూ మొదలెడతారు. ఇప్పటి కుర్రాళ్లు అంటూ తీసిపారేస్తారు. సినిమాల్లోకి మా ముందే వచ్చి అన్ని రకాల వేషాల వేసిన వారంతా అప్పుడు స్వర్ణయుగమేనంటుంటారు. మిగిలిన రంగాల్లో వచ్చిన క్షీణత సినిమాల్లోనూ వచ్చి వుండొచ్చు. కాని అంతమాత్రాన ఇప్పటి చిత్రాలను నటులను దర్శకులను తక్కువ చేయడం ఎలా సమంజసం? ఈ మాటలనేవారు కూడా ఒకప్పుడు కొత్తవారే కదా!ఇలాటి వాతావరణంలో మిలీనియం సూపర్ స్టార్ అమితాబ్ బచన్ కొత్తతరం నటీనటులను ప్రశంసించడం గొప్ప విషయమే. ఆ యువతారల మధ్య తనకు కాస్త నెర్వస్‌గా వుంటుందని కూడా అంతటి మహానటుడు చెప్పడం విశేషం. వారిలో వున్నఈజ్ తాను 48 ఏళ్ల నటజీవితంలో ఎరగనని ఆయన అన్నది అవాస్తవం కాకపోవచ్చు. నిజంగానే నావరకు నాకైతే ఎన్టీఆర్ ఎఎన్నార్ ఎస్వీఆర్ సావిత్రి వంటి వారి నటనపై ప్రతిభపై ఎంత గౌరవం వుందో రంగస్థల ప్రభావం కూడా అంతే కనిపిస్తుంది. అది అప్పటి తరహా. వారితో పోలిస్తే ఇప్పటి యువతీ యువకులు చేయగలిగిన వారు అవలీలగా అలవోకగా నటించడం చూస్తాం. ఉదాహరణకు అల్లు అర్జున్, అతనిలో ఎనర్జీని ఈజీని అందరూ చెబుతుంటారు. అగ్రనటులను అలావుంచి నానీ, శర్వానంద్, నిత్యామీనన్, లావణ్య త్రిపాఠి వంటి వారు కూడా. మీరు నటించేప్పుడు అంత హాయిగా ఎలా వుంటారని ఆయన వారిని అడుగుతుంటారట. అమితాబ్ ఈ సందర్భంలో బాజీరావ్ మస్తానీ హీరో రణవీర్‌సింగ్ పేరు ప్రస్తావించారు. రామ్‌గోపాల్‌వర్మ సర్కార్3 విడుదల సందర్బంగా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆయన తన దర్శకుణ్ని కూడా బాగానే పొగిడేశారు.