హైదరాబాద్: భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ ప్రచార కార్యక్రమం ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమిర్ ఖాన్‌ను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు. గతంలో టూరిజం శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న యాడ్ ఏజెన్సీ బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకుంటుండగా, తాజాగా మాత్రం కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఈ నియామకం జరపటం విశేషం. వీరిద్దరికీ ఈ కాంట్రాక్ట్ మూడేళ్ళపాటు అమలులో ఉంటుంది. అయితే వీరికి ఈ కాంట్రాక్టుకాగానూ కేంద్ర ప్రభుత్వం పారితోషికంగా ఏమీ చెల్లించబోదు.
ఆమిర్ ఖాన్ ఇటీవల మతసహనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, దానిపై దేశ వ్యాప్తంగా ఆమిర్‌పై నిరసనలు వెల్లువెత్తటం తెలిసిందే. ఆ నేపథ్యంలో అతనిని బ్రాండ్ అంబాసిడర్ హోదానుంచి తొలగించారు. దానిపై స్పందిస్తూ, తన సేవలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని ఆమిర్ చెప్పారు. బ్రాండ్ అంబాసిడర్‌గా తాను పారితోషికమేమీ తీసుకోలేదని ఆమిర్ తెలిపారు.