ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కథానాయికగా దీపిక పదుకొణెని తీసుకొచ్చింది. ఓ కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ ని రంగంలోకి దింపుతోంది. దీపిక పదుకొణెని ఎంచుకున్నప్పుడు తన పారితోషికం గురించి చాలా వార్తలొచ్చాయి. ఇప్పటివరకూ ఏ కథానాయికకీ ఇవ్వనంత పారితోషికం దీపికకు ఇచ్చారని చెప్పుకున్నారు. ఇప్పుడు అమితాబ్ విషయంలోనూ అదే జరిగింది.
ఇటీవల నాగ అశ్విన్ అమితాబ్ కి కథ చెప్పి, పాత్ర తీరుతెన్నుల గురించి సవివరంగా వివరిస్తూ ఓ మెయిల్ పంపారని తెలుస్తోంది. తన పాత్ర పట్ల అమితాబ్ సంతృప్తి వ్యక్తం చేసిన తరవాతే… ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. పారితోషికం ఎంతన్నది అప్పుడే క్లియర్ అయిపోయింది. ఈ సినిమాలో అమితాబ్ పాత్ర దాదాపు 25 నిమిషాలు ఉంటుందని టాక్. అందుకోసం 25 కోట్లు ఆఫర్ చేశారని సమాచారం. అమితాబ్ ఉంటే… హిందీనాట మార్కెట్ బాగుంటుంది. అక్కడ శాటిలైట్, డిజిటల్ రూపంలో మంచి రేట్లు వస్తాయి. ప్రభాస్ సినిమాకి ఆల్రెడీ అక్కడ డిమాండ్ ఉంది. అమితాబ్ మరింత ప్లస్ అవుతారు. పైగా.. ఈ పాత్రకు అమితాబ్ లాంటి నటుడు అవసరం. అందుకే ఆయన్ని ఎంచుకున్నారు. అమితాబ్ అడిగిన పారితోషికం ఏమాత్రం బేరసారాలు చేయకుండా వైజయంతీ మూవీస్ ఒప్పేసుకుందని తెలుస్తోంది. వీలైనంత వరకూ.. ఆయనకు సంబంధించిన షూటింగ్ అంతా సెట్లోనే, అందునా… ముంబైలోనే జరుపుతామని చిత్రబృందం హామీ ఇచ్చిందని తెలుస్తోంది. కుదరని పక్షంలో.. ఆయన హైదరాబాద్ రావాల్సివుంటుంది. ఈ షరతులమీద లోబడే.. అమితాబ్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్టు టాక్.