ప్రభాస్ ప్రాజెక్ట్ కె సెట్స్ లో అమితాబ్ బచ్చన్ గాయపడ్డారనే వార్త బయటికి వచ్చింది. ఈ వార్త ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. ప్రాజెక్ట్ కె’ షూట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన షెడ్యూల్లో తాను గాయపడ్డానని స్వయంగా అమితాబ్ తన బ్లాగ్ లో రాశారు. ఈ వార్త ఒక్కసారిగా ప్రాజెక్ట్ కె యూనిట్ ని కంగారు పెట్టింది. నిర్మాత అశ్వనీదత్ మాత్రం.. అమితాబ్ ప్రాజెక్ట్ కె సెట్ లో గాయపడలేదని, శుక్రవారం సెట్ లో షూటింగ్ పూర్తి చేసుకొని, ఎలాంటి ఇబ్బంది లేకుండానే అమితాబ్ వెళ్ళారని తనకు పరిచయం వున్న మీడియా వర్గాలకు చెబుతున్నారు.
అయితే అమితాబ్ మాత్రం చాలా క్లియర్ గా యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు కుడివైపు పక్కటెముకలకు దెబ్బ తగిలిందని, షూట్ రద్దు చేసుకుని వైద్యులను సంప్రదించాని, హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో తగిన చికిత్స తీసుకున్నాని, ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఇబ్బందిగా ఉండటంతో వైద్యులు కొన్ని వారాల పాటు విశ్రాంతి సూచించారని, అందువల్ల పనులన్నింటినీ కొంతకాలంపాటు వాయిదా వేసి.. ముంబయిలోని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాని రాసుకొచ్చారు.
అమితాబ్ మాటలు చూస్తుంటే.. గాయం తీవ్రత కాస్త ఎక్కువగానే వుందని అర్ధమౌతుంది. ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందని రాశారు బిగ్ బి. ఈ మాటలు ప్రాజెక్ట్ కే టీంకు కలవర పెడుతున్నాయి. అమితాబ్ ముంబాయిలో తప్పా మరో చోటుకి ఎక్కువగా షూటింగులకు వెళ్లరు. ఫిల్మ్ సిటీలో షూటింగ్ వుంటే మాత్రం వస్తారు. ప్రాజెక్ట్ కే కోసం ఆర్ఎఫ్సీ స్పెషల్ గా కొన్ని సెట్లు వేశారు. అందులోనే చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పుడు బిగ్ బి గాయపడటంతో ఆయన మళ్ళీ ఎప్పుడు సెట్ కి వస్తారా అనే టెన్షన్ అశ్వినీదత్ లో మొదలైయింది.
ఇప్పటికే ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ఇచ్చేశారు. 2024 సంక్రాంతికి వస్తామని చెప్పారు. దాని ప్రకారమే షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో చాలా కీలకమైన సీన్లు వున్నాయి, ఈ షెడ్యుల్ పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు. ఇప్పుడు అమితాబ్ గాయంతో మొత్తం తారుమారైయింది. అమితాబ్ షూట్ కి రావడం ఆలస్యమైతే మాత్రం ప్రాజెక్ట్ కూడా ఆలస్యమయ్యే అవకాశం వుంది. ఒకవేళ అమితాబ్ అందుబాటులోకి వస్తే.. ఇక్కడికి వస్తారా లేదా ముంబాయి లోనే షూట్ ప్లాన్ చేయమని చెబుతారా అన్నది కూడా క్లారిటీ లేదు. ఏదైనా అనుకోని ఈ అవాంతరం మొత్తం ప్రాజెక్ట్ కె ప్లాన్ పైనే దెబ్బకొట్టింది.