యావత్ ప్రపంచ దేశాలలో అలజడి సృష్టిస్తున్న ‘పనామా పేపర్స్ లీక్’ వ్యవహరంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యా బచ్చన్ ల పేర్లను ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ మొట్ట మొదటి జాబితాలోనే బయటపెట్టింది. దానిపై ఐశ్వర్యా బచ్చన్ ముందుగా స్పందిస్తూ తనకు విదేశాలలో ఎటువంటి సంస్థలతో లావాదేవీలు లేవని, తనపై వచ్చిన ఆ వార్తలన్నీ నిరాధారమయినవని ఖండించారు. ఆ తరువాత ఆమె మావగారు అమితాబ్ బచ్చన్ కూడా ఇంచుమించు అదేవిధంగా స్పందించారు.
ఆయన మంగళవారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ, “ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పేర్కొన్న సి బల్క్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్, లేడీ షిప్పింగ్ లిమిటెడ్, ట్రెజర్ షిప్పింగ్ లిమిటెడ్ మరియు ట్రాంప్ షిప్పింగ్ లిమిటెడ్ అనే ఆ కంపెనీల పేర్లను కూడా నేను ఎప్పుడూ వినలేదు. కనుక వాటిలో నేను డైరెక్టరుగా ఉండటం అసంభవం. బహుశః నా పేరును ఎవరో దుర్వినియోగం చేసి ఉండవచ్చునని భావిస్తున్నాను. నేను విదేశాలకు ఎప్పుడయినా డబ్బు పంపవలసి వస్తే, భారత ప్రభుత్వం ప్రకటించిన “లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం” ని ఉపయోగించుకొని నేను విదేశాలకు డబ్బు పంపుతుంటాను. దానికి పన్నులు చెల్లిస్తుంటాను. దాని గురించి నా ఐటి రిటర్న్స్ లో కూడా స్పష్టంగా పేర్కొంటాను. పనామా పేపర్స్ జాబితాలో నాపేరు ఎలాగ వచ్చిందో నాకు తెలియదు,” అని అమితాబ్ బచ్చన్ చెప్పారు.
అమితాబ్ బచ్చన్ ఒక్కరే కాదు..ఆ జాబితాలో పేర్లు కనబడిన వారు అందరూ ఇంచుమించు ఇదేవిధంగా చెపుతున్నారు. అందరూ కూడా తమకు విదేశాలలో ఎటువంటి కంపెనీలు లేవని, వాటిలో తాము పెట్టుబడులు పెట్టలేదని, ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేదని చెపుతున్నారు. మరి అందరూ నిజాయితీపరులే అయితే ఈ ‘పనామా పొగ’ ఎందుకు వస్తోందో ప్రభుత్వం స్వయంగా దర్యాప్తు చేయిస్తే తప్ప తెలియదు.