సినిమా స్టార్లు తమకు ఉన్న పాపులారిటీని ప్రజలకు అనారోగ్యం కల్పించే ఉత్పత్తుల ప్రకటనలకు ఉపయోగించడం ఇటీవలి కాలంలో వివాదాస్పదమవుతోంది. కొంతమంది స్టార్లు ఎవరేమనుకుంటే మాకేంటి.. అనుకుంటూ యాడ్స్ కొనసాగిస్తూండగా కొంత మంది మాత్రం తప్పు చేసిన తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల ఓ పాన్ మసాలా యాడ్లో నటించారు. అయితే అది పాన్ మసాలా తరహాలో కనిపించే యాడ్.
కానీ కాన్సర్ కారకమైన పాన్ మసాలా ఉత్పత్తిని గుర్తు చేస్తుంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ పొగాకు నిర్ములనా సంస్థ కూడా అలాంటి ప్రకటనల్లో నటించవద్దని కోరింది. దీనిపై విస్తృతమైన చర్చ జరగడంతో అమితాబ్ బచ్చన్ కూడా ఆ ప్రకటలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్లో ప్రకటించారు. ఇటీవల మహేష్ బాబు, టైగర్ ష్రాఫ్ కూడా ఓ పాన్ మసాలా ప్రకటనలో నటించారు.
అది కూడా సరోగేట్ ఎడ్వర్టైజింగ్నే. పాన్ మసాలాను మౌత్ ఫ్రెషనర్ పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై మహేష్ బాబుతో పాటు టైగర్ ష్రాఫ్ పైనా విమర్శలు వచ్చినా వారు పట్టించుకోలేదు. ఆ సంస్థ విస్తృతంగా ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది. క్యాన్సర్ కారకమైన పాన్ మసాలాలను ప్రోత్సహిస్తూనే ఉంది.