భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవ్వాళ్ళ చాలా ముఖ్యమైన ప్రకటన చేశారు. డిల్లీ భాజపా ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “జూన్ మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది,” అని ప్రకటించారు. మోడీ మంత్రివర్గంలో మార్పుల గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని అమిత్ షా దృవీకరించినట్లయింది.
ఇటీవల ఒక సర్వేలో మోడీ మంత్రివర్గంలో నితిన్ గడ్కారీ, పీయూష్ గోయల్, మనోహర్ పారిక్కర్, సురేష్ ప్రభుల పనితీరు పట్ల దేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. వారు ముగ్గురూ రాజకీయాలు చేయకుండా తమకు కేటాయించిన శాఖలను సమర్ధంగా నిర్వహించడంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నందున ప్రధాని నరేంద్ర మోడీ కూడా వారిపట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
మనోహర్ పారిక్కర్ గోవా ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, రక్షణ రంగంలో అనేక సంస్కరణలు అమలు చేసి చాలా మంచి పేరు తెచ్చుకొన్నారు. కానీ అయన గోవాని విడిచిపెట్టి వచ్చిన తరువాత గోవాలో భాజపా ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలలో అసంతృప్తి పెరుగుతున్నట్లు కేంద్రం గుర్తించడంతో, మళ్ళీ ఆయనని గోవాకి ముఖ్యమంత్రిగా పంపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆయన గోవా వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ తను మళ్ళీ త్వరలో గోవా తిరిగివచ్చేయబోతున్నట్లు ప్రకటించారు. కనుక ఆయన గోవా వెళ్ళిపోవడం ఖాయమనే భావించవచ్చు. ఆయన స్థానంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఇంకా దృవీకరించవలసి ఉంది.