దక్షిణాదిలో పాగా వేసేందుకు తెలంగాణ గేట్ వే అవుతుందని భావిస్తోన్న బీజేపీ… లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి గణనీయమైన స్థానాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అమిత్ షా ప్రత్యేకంగా బృందాలను రంగంలోకి దింపారు. ఈ టీమ్స్ రాష్ట్రంలోని బీజేపీ పరిస్థితి, అభ్యర్థుల గెలుపు అవకాశాలు, ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలుపై ఎప్పటికప్పుడు షాకు నివేదికలు చేరవేస్తున్నాయి.
నాంపల్లిలోని పార్టీ హెడ్ ఆఫీసులో ఓ టీం ఉండగా… ఫీల్డ్ లో మరో టీం ను మొహరించారు. ఫీల్డ్ టీం అందించే నివేదిక ఆధారంగా హెడ్ ఆఫీసులోని బృందం రిపోర్ట్ రూపొందించి షాకు చేరవేస్తోంది. ఈ రెండు బృందాలు పని చేస్తున్నట్లు అభ్యర్థులకు కూడా తెలియవు. అంతా సీక్రెట్ గా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నివేదికను పరిశీలించి అభ్యర్థులకు షా ఫోన్ చేసి పలు ఇన్ పుట్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలంటే ఎం చేయాలి..? స్థానిక నేతల నుంచి సహాయం కొరవడితే ఎలా ముందుకు వెళ్ళాలి..? ప్రచారంలో భాగంగా ప్రజలతో ఎలా మమేకం కావాలి..? ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ ప్రత్యర్ధి ముందంజలో ఉంటే ఆ అభ్యర్థిని బలహీనపరచాలంటే ఎలాంటి వ్యూహం అనుసరించాలి..? అనే అంశాలపై షా ఢిల్లీ నుంచి సూచనలు చేస్తున్నట్లుగా సమాచారం.
తెలంగాణలో రోజురోజుకు పార్టీ మరింత బలపడుతుందని షా ఏర్పాటు చేసిన బృందాల నుంచే కాకుండా ఇంటలిజెన్స్ వర్గాలు కూడా నివేదించినట్లుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణలో మెజార్టీ సీట్లు దక్కేలా కృషి చేయాలని.. ఈమేరకు అగ్రనాయకత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా చెప్పినట్లుగా సమాచారం.ఇందులో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణలో పర్యటిస్తామని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.