అమ్మ క్యాంటీన్లు ఢిల్లీలోనూ మొదలవుతాయి. అయితే ఇవి అన్నాడీఎంకేవి కావు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు చేసేవి. 5 నుంచి 10 రూపాయల ఖర్చుతో కూలీలు, పేదలు భోజనం చేయడానికి ఉద్దేశించిన ఈ క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తారు. టిఫిన్, లంచ్, డిన్నర్ వీటిలో లభిస్తాయి.
ఢిల్లీలో 225 ఆమ్ ఆద్మీ క్యాంటీన్లు నడపాలంటే ఏడాదికి 65 కోట్లు ఖర్చవుతాయని ఈ క్యాంటిన్ ఆలోచనకు రూపమచ్చిన ఆశిష్ ఖేతాన్ తెలిపారు. రోజూవారీ క్యాంటిన్ నిర్వహణ బాధ్యతను ఏదైనా స్వచ్ఛంద సంస్థకు గానీ ప్రయివేటు సంస్థకు గానీ అప్పగించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. కాబట్టి రోజూ కూరగాయల కొనుగోలు నుంచి వంటల దాకా ప్రతిదీ ప్రభుత్వమే చూడాల్సిన అవసరం ఉండదు. అయితే నిఘా ఉంటుంది.
ఢిల్లీలో ఒకప్పుడు నాటి సీఎం షీలా దీక్షిత్ ఒక ప్రయోగం చేశారు. జన్ ఆహార్ క్యాంటీన్లను ప్రారంభించారు. అయితే సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకం ఆహారం వడ్డించడం, పరిశుభ్రత లేకపోవడం వంటి సమస్యలను గుర్తించారు. 20 రూపాయల భో జనం కూడా సరిగా ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు 5 నుంచి 10 రూపాయలకు పుష్టికరమైన ఆహారాన్ని అందించాలని ఆప్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఢిల్లీ వంటి మహా నగరంలో ఆకలితో ఉన్నవారికి పూట గడవాలంటే వంద రూపాయలకు పైనే వెచ్చించాలి. రోజూవారీ కూలీలు, తక్కువ ఆదాయం గల వారికి ఇది భారమే. ఆమ్ ఆద్మీ క్యాంటీన్లు అమ్మ క్యాంటీన్ల వలె సరిగ్గా పనిచేస్తే సామాన్యులకు చాలా మేలు కలుగుతుంది.