ఆంధ్రప్రదేశ్ రాజధానుల వివాదంలో రాజ్యాంగ పరమైన అంశాలున్నాయని జస్టిస్ కేఎం జోసెఫ్ చేసిన వ్యాఖ్యలతో ఈ పిటిషన్ రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. రాజ్యాంగ ధర్మాసనం విచారణ కోరుతామని అమరావతి జేఏసీ ప్రకటించింది. వారం రోజుల్లో సుప్రీంకోర్టులో తాము స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని జేఏసీ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి ప్రకటించారు.
రాజ్యాంగ పరమైన వివాదాలుంటే… సీజేఐ ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఐదుగురు లేదా ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటవుతుంది.ఏపీ రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో త్వరగా విచారణ జరిపాలని ఏపీ ప్రభుత్వం పదే పదే సుప్రంకోర్టు వద్ద ప్రస్తావిస్తోంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం తొందరపడటం లేదు. సీజేఐ బెంచ్ ముందు ప్రస్తావించాలని తాజాగా ఏపీ ప్రభుత్వ లాయర్లు నిర్ణయించారు. సోమవారం ప్రస్తావించవచ్చు.
అయితే ఈ కేసులో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని జస్టిస్ కేఏం జోసెఫ్ వ్యాఖ్యానించడంతో ఈ విషయం రాజ్యాంగ ధర్మాసనం వద్దకు వెళ్తుందా అన్న చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది. అమరావతి కేసు క్లిష్టమైనదే. న్యాయవ్యవస్థ అత్యంత అరుదుగా ప్రకటించే రిట్ ఆఫ్ మాండమస్ను తీర్పులో హైకోర్టు ప్రకటించింది. అయితే మూడు రాజధానులపై తమకు చట్టం చేసుకునే అధికారం ఉందని.. అది న్యాయవ్యవస్థ కాదనొలేని ప్రభుత్వం వాదిస్తోంది. రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపితే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.