హైదరాబాద్: రాజధాని ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంప్రోక్షణ చేశారు. హిమాలయాలలోని మానస సరోవరం నుంచి రామేశ్వరంవరకు ఉన్న అనేక హిందూ పుణ్యక్షేత్రాలు, ముస్లిమ్‌ల పుణ్యక్షేత్రం మక్కా, క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరూసలెంనుంచి తీసుకొచ్చిన పవిత్ర మట్టి, పవిత్ర జలాలను మిశ్రమంగా చేశారు. దానిని రెండు కలశాలలో సేకరించి ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఆకాశంనుంచి చల్లారు. హెలికాప్టర్లో మంత్రి నారాయణ, పురోహితుడుకూడా ఉన్నారు. పురోహితుడు వేదమంత్రాలు పఠనం చేస్తుండగా బాబు మట్టిని, నీటిని చల్లారు. ఈ కార్యక్రమం ఇవాళ సాయంత్రానికి ముగుస్తుందని బాబు చెప్పారు. ఈ కార్యక్రమంతో రాజధాని ప్రాంతం అత్యంత శక్తిమంతం, పవిత్రవంతం అవుతుందని, ఇక పనులు ఆగకుండా ముందుకు సాగిపోతాయని అన్నారు.
మరోవైపు శంకుస్థాపన ప్రాంగణాలను భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసేసుకున్నారు. సామాన్య ప్రజలను ఎవరినీ లోపలికి అనుమతించటంలేదు. చివరికి మీడియావారిపైకూడా పోలీసులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. వేదికవద్ద ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) ట్రయల్ రన్ నిర్వహించింది. అటు హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ హెలిప్యాడ్‌పై దిగింది. ప్రధానమంత్రి రేపు ఉదయం 11.45 గంటలకు గన్నవరంలో దిగుతారు. అక్కడనుంచి హెలికాప్టర్ ద్వారా శంకుస్థాపన వేదిక వద్దకు 12.30 గంటలకు చేరుకుంటారు.
కార్యక్రమానికి చేరుకోవటానికి 9 రహదారులు ఏర్పాటు చేశారు. క్యాటగిరీలవారీగా ఏ పాస్‌లవారికి ఒకటి, ఏఏ పాస్‌లవారికి మరొకటి, ఏఏఏ పాస్‌లవారికి ఇంకొకటి… విభజించి ఈ రహదారులు వాడుకునేలా చూస్తున్నారు. కార్యక్రమ ప్రాంగణంలో 25 సీసీ కెమేరాలు, పార్కింగ్ వద్ద 25 సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు.
తరలివచ్చే వీఐపీ ప్రముఖులను కార్యక్రమానికి తీసుకెళ్ళటానికి బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, వోల్వో, జాగ్వర్ కంపెనీల 30 లగ్జరీ కార్లను విజయవాడలో సిద్ధం చేశారు. ఈ కార్లన్నీ విజయవాడలోని ప్రముఖులకు చెందినవి. ఎంపీ నాని అభ్యర్థన మేరకు ఈ కార్లను వారు కార్యక్రమంకోసం ఇచ్చారు. మరోవైపు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంకోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ తనవంతుగా సాయాన్ని అందించారు. వీఐపీలను శంకుస్థాపనకు తరలించటంకోసం రెండు స్పెషల్ బస్సులను పంపారు. ఈ బస్సులను ప్రస్తుతం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో ఉంచారు.