బాలివుడ్ హీరో అమీర్ ఖాన్ ముందు తన భార్యకు దేశభక్తి బోధించాలంటూ బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ వివాదాన్ని రగిలించేందుకు దారి తీస్తున్నాయి. దేశంలో అసహనం గురించిన ప్రశ్నపై అమీర్‌ఖాన్ స్పందిస్తూ అభద్రత పెరిగిపోతున్నదనీ, తన భార్య కిరణ్ రావు దేశం వదలివెళ్లిపోదామని అప్పుడప్పుడూ అంటుంటుందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో దేశమంతటా అవార్డుల వాపసీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత బిజెపి ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు అమీర్ ఖాన్‌పై విరుచుకుపడ్డాయి. ఆయన దేశభక్తిని శంకించే వ్యాఖ్యలు చేశాయి. మీడియాలోనూ ఒక భాగం అలాగే వ్యవహరించింది. నేను కూడా అలాటి ఆగ్రహ పూరిత చర్చల్లో పాల్గొన్నాను. అమీర్ ఖాన్ వ్యాఖ్యలనుబట్టి అసహన వాతావరణం తీవ్రతను గుర్తించాలి తప్ప ఆయనపై దాడిచేయడమెందుకని అన్నందుకు ఫేస్‌బుక్‌లోనూ నాపై చాలామంది దాడి చేశారు. అమీర్‌ఖాన్ ట్విట్టర్లో వివరణ ఇస్తూ తాను దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నానని తను గాని కిరణ్ గాని దేశం వదలివెళ్లాలనుకోవడం లేదని స్పష్టంగా ప్రకటించారు. అదే సమయంలో తమ దేశభక్తికి ఎవరి కితాబూ అవసరం లేదని కూడా చెప్పారు. తర్వాత కొంత కాలానికి పార్లమెంటులో ప్రధాని మోడీ కొంత సర్దుబాటు ధోరణిలో మాట్లాడారు. అమీర్ ఖాన్‌ను సినిమా రాజకీయ రంగాలలోనూ ఇతరత్రా కూడా ఎందరో బలపర్చారు. వారిలో ఒకరైన షారుఖ్‌ఖాన్ తన సినిమా దిల్వాలే విడుదల సమయంలో శివసేన ఆటంకాలు కల్పించడం వల్ల ఆయన ఒక విచారం వ్యక్తం చేస్తూ తన వ్యాఖ్యలు సరిగ్గా ప్రసారం కాలేదని వివరణ ఇచ్చారు. ఆ చిత్రం కూడా బాగా విజయవంతమైంది. పోటీగా బాజీరావ్ మస్తానీ లేకపోతే అత్యధిక వసూళ్లు దానివే అయివుండేవి. అంటే ఈ మతతత్వ రాజకీయ దాడులు అభిమానులను సినిమా ప్రియులను ఆపలేవని అర్థమైంది. అయితే కేంద్ర నిజానికి ఇలాటి తరుణంలో పాత వ్యాఖ్యలపై వివాదం తిరగదోడవలసిన అవసరమే లేదు. ప్రభుత్వ ప్రకటన చిత్రాలనుంచి అమీర్‌ఖాన్ తప్పించడం చర్చను మళ్లీ ముందుకు తెచ్చింది. అమీర్ వరకూ ఆ మార్పును స్వాగతించాడు. ఇలాటి సమయంలో బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ముందు మీ భార్యకు దేశభక్తి నేర్పండి అన్న రీతిలో మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక భర్త తన భార్యకు ఏం నేర్పాలో చెప్పడం సంప్రదాయవాదులెవరూ అంగీకరించరు. కనుకనే స్త్రీలను కుటుంబ విలువలను గౌరవిస్తామని చెప్పే ఆరెస్సెస్ శిబిరం నుంచి వచ్చిన రాం మాధవ్నుంచి ఆ మాటలు రావడం మరింత విడ్డూరం అనిపిస్తుంది. అమీర్ మొదటి ప్రకటనలోనే తను ఆమెతో ఏకీభవించలేదని చెప్పేశాడు. అయినా సరే ఇంతకాలం తర్వాత ఈ సమస్యను మళ్లీ పైకి తేవడంలో రాజకీయ ఉద్ధేశాలున్నాయి. ఈ ఏడాది జరిగే కేరళ పశ్చిమ బెంగాల్ ఎన్నికలలోనూ తర్వాత యుపిలోనూ మరోసారి హిందూత్వ రాజకీయాలను తారస్థాయికి తీసుకెళ్లాలని బిజెపి భావిస్తున్నది. గతంలో వివాదాలపై కాస్త సన్నాయినొక్కులు నొక్కేవారు. కాని ఇప్పుడు మాధవ్ మాటలను కేంద్ర మంత్రి షా నవాజ్‌ఖాన్ వెనువెంటనే సమర్థించడం గమనించదగింది. మరో వైపున రామమందిర నిర్మాణానికి రాళ్లు చేరుస్తున్నారు. సుబ్రహ్మణ్యస్వామి వంటివారు అదేపనిగా ఆ సమస్యను ముందుకు తెస్తున్నారు. ముందు ముందు మరింతగా ఇలాటి వివాద గ్రస్త వ్యాఖ్యలు చర్యలు చూడవలసి వుంటుంది. వాస్తవానికి గుజరాత్‌తో సహా తము పాలించే చాలా రాష్ట్రాలలో స్థానిక ఎన్నికలలో బిజెపి దెబ్బతిన్నది. అయితే ఇది హిందూత్వ రాజకీయాల కారణంగా గాక వాటిని గట్టిగా అమలు చేయకపోవడం వల్ల కలిగిన ఓటమి అని ఆరెస్సెస్ మార్గదర్శకులు భావిస్తున్నారు. ఇక రాజకీయంగా హిందూత్వ వ్యూహాలు తప్ప మరో తరహా ఎత్తుగడలు ఎలా ఆశిస్తాం?