స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో గెలవలేరని ఓ సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉంది. కానీ ఆ సెంటిమెంట్ ను పోచారం శ్రీనివాసరెడ్డి బ్రేక్ చేశారు. ఆయన గెలిచారు కానీ ఆయన పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు అందరి చూపు.. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైపు పడింది. ఆయన గెలుస్తారా.. ? ఆముదాల వలసలో ఆయన పరిస్థితి ఎలా ఉంది ?
స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్న ఎవరూ గెలిచిన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ.. విభజన ఆంధ్రప్రదేశ్‌లో కానీ లేవు. అందుకే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాంకు టెన్షన్ ప్రారంభమయింది. స్పీకర్ గా రాజీనామా చేసి మంత్రి పదవి తీసుకోవాలనుకున్న ఆయనకు జగన్ చాన్సివ్వలేదు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి చాన్సివ్వాలన్న ఆలోచన మానుకుని.. మళ్లీ గెలిచి… ఎలాగైనా మంత్రి పదవి పొందాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ ఆయన ఆశలు ఈ సారి అంత సులువుగా నెరవేరేలా కనిపించడం లేదు. ప్రజల్లో అసంతృప్తి బహిరంగంగా కనిపిస్తోంది. అంతేనా సొంత పార్టీలోనూ ఆయనకు వ్యతిరేకంగా బలమైన వర్గాలు పని చేస్తున్నాయి.
తమ్మినేని సీతారాంకు వైసీపీ అధినేత జగన్ టిక్కెట్ ప్రకటించగానే.. ఆముదాల వలసలో కీలక నేతలు ఆ పార్టీ గుడ్ బై చెప్పారు.
వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవికి సువ్వారి గాంధీ కుటుంబం గుడ్‌బై చెప్పింది. ఇంకా కీలక నేతలు రాజీనామా చేయనప్పటికీ ఆయనకు సహకరించే పరిస్థితి లేదు. అముదాల వలస మండలంలో కీలకంగా ఉండే కోట గోవిందరావు బ్రదర్స్ తమ్మినేనికి సహకిరంచేది లేదంటున్నారు. ఆముదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో కూడా ద్వితీయ శ్రేణి నేతలు తమ్మినేని వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని హైకమాండ్‌కు చెప్పారు కానీ ప్రయోజనం లేకపోయింది. ఓ దశలో కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ తమ్మినేని విధేయత డోస్ పెంచి సీటు కాపాడుకున్నారు.
అయితే సీటు కాపాడుకున్నంత ఈజీగా గెలుపు దక్కించుకోవడం కష్టమే. స్వయంగా తన బావమరిది అయిన కూన రవికుమార్ టీడీపీ తరపున గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆయన తమ్మినేనిపై ఓ సారి గెలిచారు. స్పీకర్ గా అధికారం వచ్చిన తర్వత ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను కేసులు పాలు చేసి వేధింపులకు గురి చేయడం కూడా ప్రజల్లో సీతారాంపై వ్యతిరేకత తెచ్చి పెట్టింది. కూన రవికుమార్‌కు సానుభూతి తెచ్చింది. కూన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ సీతారాంపై కానీ.. వైసీపీ నేతలపై కానీ ఎలాంటి వేధింపులకు పాల్పడ లేదు. కానీ గత ఐదేళ్లు నియోజకవర్గంలో వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక ఇసుక దోపిడి ఆరోపణలు లెక్కలేనన్ని ఉన్నాయి.
భారీ మెజార్టీలు ఎప్పుడూ రాని ఈ నియోజకవర్గంలో ఈ సారి కూడా పోటీ గట్టిగానే ఉంటోంది. కానీ స్పీకర్ తమ్మినేనికి మాత్రం పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు.