అమూల్రు యజమానులెవ్వరూ లేరని రైతులే యజమానులని చెబుతూ సీఎం జగన్ ఆ సంస్థను ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా ఆ సంస్థను ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఓ జిల్లాలో పాల వెల్లువ అంటూ అమూల్‌కు పాలు పోయాలని ఓ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సంస్థకు పెద్ద ఎత్తు ప్రోత్సాహకాలతో పాటు .. కొన్ని వేల కోట్లు విలువైన ప్రభుత్వ ఆస్తులను ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతానికి ఇది కోర్టులో ఉంది. ప్రభుత్వం ఇస్తూంటే మేము ఎందుకు వద్దంటామన్నట్లుగా అమూల్ యాజమాన్యం తీరు ఉంది.
తమ అవసరాలకు మాత్రం తమ పెట్టుబడులు తెలంగాణలో పెట్టుకుంటున్నారు. బుధవారం కేటీఆర్‌ను కలిసిన అమూల్ సంస్థ ఓనర్లు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తెలంగాణలో కంపెనీ భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోనే తన తొలి డెయిరీ ప్లాంట్ ని ఏర్పాటును రూ. ఐదు వందల కోట్లతో అమూల్ ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో ఉన్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో రెండు దశల్లో మొత్తం ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు అమూల్ తెలిపింది. దక్షిణ భారతదేశంలోనే అమూల్ తన తొలి ప్లాంట్ ను ఐదు లక్షల లీటర్ల ప్రతిరోజు సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు, భవిష్యత్తులో దీన్ని పదిలక్షల లీటర్ల కు పెంచుకకునే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా బట్టర్ మిల్క్, పెరుగు, లస్సి, పన్నీర్, స్వీట్స్ వంటి ఉత్పత్తులను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు అమూల్ తన బేకరీ ప్రొడక్షన్ డివిజన్ ను తెలంగాణలో ఏర్పాటు చేసి బ్రెడ్, బిస్కెట్ మరియు ఇతర బేకరీ ప్రొడక్టులను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణ లో తాము ఏర్పాటు చేయనున్న ప్లాంట్ రానున్న 18 నుంచి 24 నెలలు లోపల తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని అమూల్ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం అమూల్ గురించి అంతగా కలవరిస్తున్నా అక్కడ ప్లాంట్ పెట్టాలన్న ఆలోచన కూడా యాజమాన్యం చేయలేదు.