రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడంలో ఏపీ ప్రభుత్వ పెద్దల స్టైలే వేరు. ఆక్రమించారని గోడ పగలగొట్టేసి… అసలు ఆ సంస్థ మొత్తం అక్రమం..మూసేయండి అని లేఖలు రాయడం లాంటి పనులే కాదు.. వ్యాపారాలను దెబ్బతీయడంలోనూ వారికి వారే సాటి. ఈ విషయంలో మరోసారి నిరూపితమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాలవ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఏపీ సర్కార్.. గుజరాత్ నుంచి అమూల్ సంస్థను తీసుకొచ్చింది. ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది. రైతు భరోసా కేంద్రాల కేంద్రంగా… పాల రైతులందర్నీ.. ఇక నుంచి అమూల్‌కే పాలు పోయాలని ఒత్తిడి చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక మిషన్ అన్నట్లుగా అధికారులు హడావుడి పడుతున్నారు.
ఈ నెల ఇరవై ఐదు నుంచి తొలి విడతగా మూడు జిల్లాల్లో అమూల్ పాల సేకరణ ప్రారంభిస్తోంది.అయితే ఇది అమూల్ చేయడం లేదు. ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా చేసి .., అమూల్‌కు అప్పగిస్తుంది. ఇందు కోసం ఇప్పటికే జిల్లాకో ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు జిల్లాస్థాయి కమిటీలు వేసింది. ఓ ఇతర రాష్ట్ర డెయిరీ కోసం.. ఏపీ సర్కార్ ఎందుకు ఇంత ఆరాటపడుతుందో చాలా మందికి సులువుగానే అర్థమవుతోంది. ప్రభుత్వం ముందుగా పాల సేకరణ జరుపుతున్న మూడు జిల్లాలు రాయలసీమలోనివే. హెరిటేజ్ అత్యధికంగా అక్కడే పాల సేకరణ జరుపుతుంది. ఇప్పుడు హెరిటేజ్‌కు పాలు పోసే రైతులందర్నీ.. కట్టడి చేసి.. వారిని అమూల్ వైపు తరలించడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాడి రైతుకు లీటరుకు రూ.4 బోనస్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చింది. కానీ వాటి గురించి ఇంత వరకూ ఎలాంటి మాటలు మాట్లడటం లేదు.
అయితే.. గతంలో మార్గదర్శిని టార్గెట్ చేసి.. చిట్ ఫండ్ సంస్థలు మొత్తాన్ని ఇబ్బంది పెట్టినట్లుగానే ఇప్పుడు హెరిటేజ్‌ను టార్గెట్ చేసి.. అన్ని రకాల ప్రైవేటు డెయిరీల పునాదులను ప్రభుత్వం పెకిలించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహకార డెయిరీలు కూడా సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.ప్రైవేటు డెయిరీలన్నీ పది రోజులకోసారి చెల్లింపులు చేస్తాయి. అలాగే.. దాణాతో పాటు.. పశువులకు వైద్య సాయం.. పశువుల ఎంపిక వంటి సాయం అందిస్తాయి. ఇప్పుడు అమూల్ తరపున ఎలాంటి సాయం అందుతుందో… వారు చెప్పడం లేదు.
అమూల్ కోసం ప్రభుత్వం ఎంతగా ఆత్రపడుతోందంటే.. చివరికి ఆసంస్థ పాలసేకరణ చేసుకునే కేంద్రాలను కూడా తానే నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఉపాధి హామీ నిధులను అమూల్ పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణానికి ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం మినీ గోకులం పేరుతో పేద రైతులకు పశువుల షెడ్లు నిర్మించుకునే అవకాశం కల్పించింది. రాజకీయాల కోసం… ప్రైవేటు, సహకార డెయిరీ రంగం మొత్తాన్ని ప్రభుత్వం గుంపగుత్తగా ఒకరి చేతుల్లోకి నెట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.