కర్ణాటకలో అతి పెద్ద సహకర డెయిరీ నందిని. కర్ణాటకలో అత్యదిక మంది రైతులు పాడి ద్వారా ఆర్థిక స్వావలంబనను ఈ నందిని డెయిరీ ద్వారా సాధించారు. ఇప్పుడు ఈ నందిని డెయిరీని అమూల్‌లో విలీనం చేయాలన్న ప్రయత్నాన్ని కేంద్రం చేస్తోంది. ఇటీవల అమిత్ షా నోటి వెంట ఈ మాటలు వచ్చాయి. ఆయన కేంద్రంలో హోంమంత్రిత్వ శాఖతో పాటు సహకార శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇప్పుడు అది వివాదం అయి కూర్చుకుంది. గుజరాతీలు కన్నడిగుల్ని దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు వరుసగా మండి పడుతున్నారు.
కర్ణాటకకు చెందిన విజయా బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారని.. కర్ణాటకలో ఉన్న పోర్టులన్నీ అదానీకి కట్టబెట్టారని ఇప్పుడు రైతుల్ని కూడా గుజరాత్ కు చెందిన అమూల్ కు కట్టబెడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం సెంటిమెంట్ గా మారడంతో అక్కడ అమూల్ ఉత్పత్తుల్ని కొనకూడదని కట్టుబాటు తీసుకుంటున్నారు. ప్రైవేటు హోటల్స్ అసోసియేషన్ నందిని మిల్క్ మాత్రమే కొంటామని ప్రకటించాయి. ఈ వివాదం రాజకీయ దుమారం రేగుతోంది. అమూల్ గుజరాత్ లో సహకార సంస్థగా ప్రారంభమైనా.. అది ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తూ కార్పొరేట్ సంస్థలా మారుతోంది. దీంతో కన్నడిగులు ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఎన్నికలకు ముందు ఇదో పెద్ద సెంటిమెంట్ అస్త్రం అయిపోయింది. నిజానికి అమూల్ ను విస్తరించడానికి తెర వెనుక ప్రయత్నాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. ఏపీలో అయితే ఏ సమస్యా లేకుండా ప్రభుత్వమే ప్రజాధనాన్ని ఇచ్చి మరీ వ్యాపారం చేసుకునేందుకు ప్రోత్సహిస్తోంది . ఇందు కోసం సహకార డెయిరీల్ని నిర్వీర్యం చేస్తోంది. సంగం డెయిరీని కూడా దాదాపుగా స్వాధీనం చేసుకుంది. కోర్టులు అడ్డు పడ్డాయి బట్టి ఆగిపోయింది. ఇదంతా అమూల్ కోసమే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఏపీలో జనం మాత్రం పట్టించుకోలేదు. కానీ కర్ణాటకలో మాత్రం అలా కాదు . తిరగబడుతున్నారు. తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు.