అమూల్ సంస్థ తెలంగాణలో రూ. ఐదు వందల కోట్లతో ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకోవడం …తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే అమూల్ పేరును కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం అదే పనిగా ప్రచారం చేస్తోంది. ఓ రకంగా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. జగనన్న పాల వెల్లువ పేరుతో కార్యక్రమం ప్రారంభించి… పూర్తిగా “అమూల్‌కు పాలు పోసే” పథకాన్ని ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఇంతగా ప్రోత్సాహం పొందుతున్న అమూల్ ప్లాంట్‌ను మాత్రం తెలంగాణలో పెట్టాలని నిర్ణయించుకుంది. అందుకే ఎందుకింత దగా అని సగుటు ఆంధ్రుడికి అనిపిస్తోంది.
అమూల్‌కు పాలు పోసే పథకం ” జగనన్న పాల వెల్లువ”
రాజకీయ కారణాలలో.. రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలనే వ్యూహమో… లేకపోతే నిజంగానే ఏపీ రైతులకు మేలు చేయాలనుకున్నారో కానీ ఏపీ ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థను ఏపీకి ప్రత్యేకంగా ఆహ్వానించింది. గతంలో ఏపీలో అమూల్ పాలు మార్కెటింగ్ చేసుకునేది ., అంటే ఇతర రాష్ట్రాల్లో సేకరించిన పాలను ప్యాకెట్లుగా మార్చి ఏపీలో అమ్మేది. ఏపీలో పాల సేకరణ అనే ఆలోచన చేయలేదు. కానీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అమూల్ యాజమాన్యాన్ని అంగీకరిపంచేసి..ప్రభుత్వమే పథకం పెట్టి అమూల్‌కు పాలసేకరణ చేయిస్తామని హామీ ఇచ్చి… మరీ ఏపీలో సేకరణను ప్రారంభింపచేసింది. ఒక్కో జిల్లాలో రాష్ట్రం మొత్తం అమూల్‌కు పాలు పోసే జగనన్న పాల వెల్లువను ప్రారంభిస్తున్నారు. ఇటీవలే కృష్ణా జిల్లాలోనూ ప్రారంభమైంది.
అమూల్ తరపున ప్రోత్సాహకాలు ఇస్తున్న ప్రభుత్వం …!
సాధారణంగా పాల వెల్లువ పథకం కింద అమూల్‌కు పాలు పోస్తే అమూల్ ఏదైనా ప్రోత్సాహకాలు ప్రకటించాలి. .కానీ ప్రభుత్వం తాము ఇస్తామని చెబుతోంది. అంటే అమూల్‌కు పాలు పోస్తే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తానంటోంది. ఇలా ఎందుకు చేస్తున్నారంటే… అమూల్ అనేది కంపెనీ కాదు..సహకార సంస్థ అని వాదిస్తోంది. అది కంపనీనో.. .సహకారసంస్థో ఏదో ఒకటి కానీ.. ప్రజాధనాన్ని ప్రభుత్వం .. అమూల్ కోసం ఎందుకు కేటాయిస్తుందనేది టాప్ సీక్రెట్.
పాలసేకరణకు రూపాయి కూడా పెట్టుబడి పెట్టని అమూల్.. ప్రభుత్వ ఇస్తులు ఇచ్చేసిన జగన్ సర్కార్ !
పాల సేకరణ చేయాలంటే ఆషామాషీ కాదు. ప్రతి గ్రామంలో వ్యవస్థ ఉండాలి. చిల్లింగ్ ప్లాంట్లు ఉండాలి. టెస్టింగ్ సెంటర్లు ఉండాలి. అనేక మౌలిక వసతులు ఉండాలి. వీటికి కోట్లను పెట్టుబడిగా పెట్టాలి. కానీ అమూల్ ఏపీలో పాల సేకరణ ప్రారంభించడానికి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టలేదు. అన్నీ ప్రభుత్వమే సమకూర్చింది. జిల్లాల్లో ఉన్న మిల్క్ కోఆపరేటివ్ ఆస్తులను అమూల్‌కు నామమాత్రపు లీజుకు ధారాదత్తం చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని కోర్టు తప్పు పట్టింది. ప్రజా ధనాన్ని ఒక్క రూపాయి కూడా అమూల్ కోసం ఖర్చుపెట్టవద్దని ఆదేశించింది. ప్రభుత్వం ఈ ఆదేశాలు పాటిస్తుందా లేదా… అన్నది ఎవరైనా లెక్కలు చూస్తేనే తెలుస్తుంది.
అమూల్ కోసం వాలంటీర్ల దగ్గర్నుంచి వ్యవసాయ శాఖ అధికారుల వరకూ సేవలు !
అమూల్‌కు పాలు పోసేలా చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. అమూల్ ప్రతినిధుల న్నా ప్రభుత్వ ప్రతినిధులే ఎక్కువగా ఈ అంశంలో చొరవ చూపిస్తున్నారు. దీన్ని చొరవ అనడం కన్నా పెద్ద మాట ఏదైనా ఉంటే దాన్ని అనాలి. ఎందుకంటే అమూల్‌కు పాలు పోయకపోతే పథకాలు ఆపేస్తామన్న బెదిరింపులుకూడా అందులో ఉంటున్నాయి. ఇలా అమూల్ కోసం ప్రభుత్వ యంత్రాన్ని దుర్వినియోగం చేయడం కూడా జరుగుతోంది.
ఇంతా చేస్తే తెలంగాణలో పెట్టుబడులు !
ఏపీ ప్రభుత్వం అమూల్ కోసం ఇంత చేస్తూంటే.. ఆ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది. కనీసం ఏపీలో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన కూడా చేయలేదు. తెలంగాణ ఆ సంస్థకు ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. పాల సేకరణకు సాయం చేయలేదు. అమూల్ తరపున ప్రోత్రాహకాలుభరిచడం లేదు. తెలంగాణ డైరీ ఆస్తులు ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు తెలంగాణలో అమూల్‌కు పాలసేకరణ లేదు. ఇప్పుడు తెలంగాణలో పెట్టే ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించాలంటే అవి ఏపీలో సేకరించిన పాలతోనే అయి ఉండాలి. అంటే… ఏపీ ప్రజల కష్టంతో తెలంగాణలో అమూల్ ప్లాంట్ పెట్టబోతోందన్నమాట. ఇంతకు మించి బకరాలవడానికి ప్రత్యేకమైన ఉదాహరణ అక్కర్లేదమో ?