కృష్ణా పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. ఈ పుష్కరాలంటే అధ్యాత్మిక భావన రావడం సంగతేమో కానీ.. ఆస్తికులను, నాస్తికులను కలవరపెట్టే అంశాలు మాత్రం కొన్ని ఉన్నాయి. ప్రధానంగా గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాట.. ఏకంగా 29 మంది మరణం అంత సులభంగా మరవలేని అంశం. ఆ సంఘటనకు తప్పు ఎవరిది అనేది పక్కనపెడితే.. పుణ్యం కోసం పుష్కర స్నానం చేయాలనుకునే వారు గత ఏడాది జరిగిన ఆ సంఘటనను మరవకపోవడం మంచిది. దాన్నే గుర్తుంచుకుని బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు కానీ… ఆ సంఘటన ను గుర్తుంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే మంచిది.
అందులో ముఖ్యమైనదవి.. తొలి రోజే పుష్కర స్నానం చేయాలనే ఉబలాటాన్ని తగ్గించుకోవడం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు పన్నెండు రోజుల పాటు కొనసాగుతాయి కాబట్టి.. ఈ రోజుల్లో ఎప్పుడు పుష్కర స్నానం చేసినా ఒకటే పుణ్యం దక్కుతుంది. తొలి రోజు అయితే నీళ్లు తేటగా ఉంటాయి.. తొలి రోజు స్నానం చేస్తే ఎక్కువ పుణ్యం దక్కుతుంది.. అనే ప్రచారాలను పట్టించుకోకపోవడం మంచిది. ఇక రెండో అంశం.. వీఐపీలకు, ప్రధాన ఘాట్ లకు దూరంగా ఉండటం. ప్రధానంగా వీఐపీల తాకిడి తొలి రోజు ఉంటుంది. కాబట్టి.. ఆ రోజు పుష్కర స్నానం చేయాలన్న ఆరాటాన్ని తగ్గించేసుకుని.. ప్రోగ్రామ్ ను మిగతా రోజుల్లోకి మార్చుకోవడం మంచిది.
అలాగే.. ప్రధాన ఘాట్ లోనే స్నానం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణా నది ఎక్కడెక్కడ పారుతూ ఉంటే.. అక్కడంతా పుష్కర ప్రభావం ఉన్నట్టే. కాబట్టి.. ఆ నది ఏయే తీరాలను తాకుతుంతో పరిశీలించి.. ఎక్కడైతే తక్కువ జనతాకిడి ఉంటుందో అక్కడ పుష్కర స్నానం చేయడం అన్ని రకాలుగానూ శ్రేయస్కరం. భక్తి మంచిదే కానీ.. మూఢభక్తి సరి కాదు. దాన్ని పెంపొందిస్తున్నది ప్రవచనకారులైనా వారి మాటలకు కూడా విలువనివ్వసరం లేదు. ఇవన్నీ గోదావరి పుష్కరాలు నేర్పుతున్న పాఠాలే. వీటిని గుర్తుంచుకొంటే.. చేదు అనుభవాలు కాకుండా.. పుష్కర పుణ్యం మాత్రమే మిగులుతుంది.