కేంద్రస్థాయి రాజకీయాలను స్థూలంగా పరిశీలించినప్పుడు… మోడీ వెర్సస్ యాంటీ మోడీ అన్నట్లుగా చీలిపోయి ఉన్నాయని మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తూ ఉన్నా, ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట్ల ఆయనను వేలుపెట్టనివ్వకపోయినా, ఇతర పార్టీలు కేంద్ర విధానాల మీద నిప్పులు కురిపిస్తూ ఉన్నా.. వీటన్నింటికీ ‘యాంటి మోడీ’ ఎజెండా ఒక్కటే కారణం. అదే ఎజెండా ప్రాతిపదికగా.. ఇప్పుడు దేశంలోని పార్టీలు, రాజకీయ శక్తులన్నీ మోడీకి వ్యతిరేకంగా ఏకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
భాజపా వ్యతిరేక పార్టీలు అన్నీ కలిసి జాతీయ స్థాయిలో మహా కూటమిగా ఏర్పాటు కావాలంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన ప్రతిపాదనకు ఇప్పుడు పార్టీల వద్ద ఆదరణ పెరుగుతున్నదనే చెప్పాలి. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి దీనికి మద్దతు ఇస్తున్నారు. పేదల అనుకూల విధానాలతో కూటమి ఏర్పడేట్లయితే దీనికి మద్దతు ఇస్తాం అంటూ ఆయన సెలవిస్తున్నారు.
పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ కూటమి పట్ల సానుకూలంగా స్పందించడం గురించి ఆయన సలహా ఇస్తున్నారు. ఆర్థిక విధానాలపై కాంగ్రెస్ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదంటున్నారు. అంటే.. పేదల అనుకూల విధానాలతో కాంగ్రెస్ ఉంటే గనుక.. వారిని కూడా మహా కూటమిలో కలుపుకుని ముందుకు సాగవచ్చుననేది సురవరం వాదనగా ఉన్నట్లుంది. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు అవకాశవాదానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల సమయానికి ఏ కూటమి బలంగా ఉంటే.. ఆ కూటమిలో చోటు కోసం ప్రయత్నించి, ఆ తర్వాత తిష్ట వేసుకుని.. అతిపెద్ద జాతీయ పార్టీగా తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తారనేది అందరికీ తెలిసిన సంగతే. నితీశ్ ప్రతిపాదన ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. మోడీ వ్యతిరేక మహా కూటమి ఏర్పడే దిశగా ప్రధానమైన ముందడుగు ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు