కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కాలేజీ కుర్రాడిలా మారారు. లాల్చీ పైజమాకు టాటా చెప్పి ప్యాంట్, టీషర్టులో అచ్చం యూనివర్సిటీ విద్యార్థి గెటప్ లోకి మారారు. బెంగళూరు లోని మౌంట్ కార్మెల్ విద్యార్థులతో ప్రత్యేక భేటీ కోసం రాహుల్ ఈ స్పెషల్ గెటప్ ను సెటప్ చేసుకున్నారు. రాహుల్ మొదట మీటింగ్ హాలులోని విద్యార్థులతో ముచ్చటించారు. షేక్ హ్యాండిస్తూ ఉల్లాసంగా గడిపారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగానే ఆయనతో ఇంటరాక్ట్ అయ్యారు.
రాహుల్ వేదికమీదికి వెళ్లిన తర్వాత, తమకు దిశానిర్దేశం చేస్తారేమో అని విద్యార్థులు ఎదురు చూశారు. యువతకు స్ఫూర్తిదాయకమైన విషయాలను చెప్పడం కంటే, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయించారు. ప్రభుత్వానికి ఒక విజన్ లేదని విమర్శించారు. ప్రభుత్వ పథకాలన్నీ ఫెయిలంటూ దుయ్యబట్టారు. అదే ఫ్లోలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై విమర్శలు గుప్పించి ఇరుకున పడ్డారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమం విఫలమైందని రాహుల్ అనగానే నో… అంటూ విద్యార్థులు పెద్దపెట్టున నిరసన తెలిపారు. దీంతో రాహుల్ షాకయ్యారు. ఆయనకు ఏమీ అర్థం కాలేదు. వాళ్లు మీ అభిప్రాయంతో విభేదిస్తున్నట్టున్నారని కాలేజి ప్రతినిధి చెప్పగానే ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని భావిస్తున్నారా అని రాహుల్ అడిగారు. ఎస్…. అంటూ ముక్తకంఠంతో విద్యార్థులు స్పందించారు. దీంతో రాహుల్ షాకయ్యారు. స్వచ్ఛ భారత్ ఫెయిలైంది ఎస్… అనగానే విద్యార్థులు నో అని అరిచారు. చివరకు రాహుల్ గాంధీ టాపిక్ మార్చి ప్రసంగాన్ని కొనసాగించారు.
సూట్ బూట్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు మంచి చేస్తే అభ్యంతరం ఏమిటని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు జవాబుగా ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. మంచి చేసినప్పుడు ప్రధాని ఏ తరహా దుస్తులు వేసుకుంటే అభ్యంతరం ఏమిటనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. ప్రతిపక్షం గత 17 నెలలుగా నిర్మాణాత్మకంగా పనిచేయడం లేదని ఓ విద్యార్థిని ప్రశ్నించింది. పార్లమెంటును స్తంభింపచేయడం సబబేనా అన్న ప్రశ్నకు, రాహుల్ గాంధీ ఉపన్యాసం తప్ప, సరైన జవాబు ఇవ్వలేకపోయారు.
మొత్తం మీద ఆయన గెటప్ క్లిక్ అయింది. సూట్ బూట్ సర్కార్ అని విమర్శించే రాహుల్, టీ షర్టు గెటప్ లోకి మారారు. కానీ, ఆయన నాయకుడిగా ఇంకా పరిణతి చెందాలని, బాగా హోం వర్క్ చేయాలని చాలా మంది విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాహుల్ ప్రసంగం తర్వాత పలు వార్తచానల్స్ ప్రతినిధులు విద్యార్థులను ఇంటర్ వ్యూ చేసినప్పుడు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.