ఆశ కొత్త జీవితానికి బీజం వేస్తుంది. అద్భుతమైన రేపటికి నాంది అవుతుంది. ఆశే మనిషి ఉఛ్వాస, నిశ్వాస. అదే.
దురాశ… ఉన్న జీవితాన్ని సర్వ నాశనం చేస్తుంది. అసలు రేపే లేకుండా చేస్తుంది.
అందుకే పెద్దలు `దురాశ దుఃఖానికి చేటు` అన్నారు. ఆ మాటని ఓ కథగా చెప్పే ప్రయత్నం `అనగనగా ఓ అతిథి`లో జరిగింది. `ఆహా` వేదికగా విడుదలైన ఓ వెబ్ మూవీ ఇది. మరి చెప్పాలనుకున్న పాయింట్ ని ఎంత బలంగా చెప్పారు? ఆ దురాశకు నాంది ఏది? అంతమేంది?
ఊరి చివరన ఉండే ఇల్లది. తల్లి మంత్రసాని. తండ్రి… తాగుబోతు. కూతురు పేరు.. మల్లి. మనసు నిండా ఏవో ఆశలు. ఏదీ తీరదు. పెళ్లీడొచ్చినా.. ఓ అయ్య చేతిలో పెట్టే పరిస్థితి లేదు. ఉన్న పొలం తాకట్టులో ఉంది. దానికి వడ్డీ పెరుగుతూ ఉంది. మరో వైపు షావుకారు… మల్లిపై కన్నేశాడు. అప్పు తీర్చలేని పక్షంలో.. మల్లిని పెళ్లి చేసుకోవాలన్నది ఆశ. ఇలాంటి ఇంటికి.. ఓ రోజు అనుకోకుండా ఓ అతిథి వస్తాడు. తన పేరు. శ్రీను. `ఈ రోజు ఆశ్రయం ఇవ్వండి` అంటూ ఆ ఇంట్లోవాళ్లని అర్థిస్తాడు. ముందు `వద్దు` అనుకున్నా.. ఆ తరవాత.. ఆ ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకుంటారు. `సాయింత్రానికి కోడి కూర వండి పెడతారా` అని నోరు తెరిచి అడుగుతాడు. ఇంట్లోవాళ్లు కూడా కోడి కూర చేయడానికి సన్నద్ధం అవుతారు. ఆ అతిథి దగ్గర బోలెడన్ని డబ్బులు, నగలు ఉన్నాయన్న సంగతి తెలుస్తుంది. అతిథిని చంపేస్తే.. ఆ సొత్తంతా తమ సొంతం అవుతుందన్న దురాశ పుడుతుంది. ఆ డబ్బుతో… తమ కష్టాలన్నీ తీర్చుకోవచ్చన్న విషపు ఆలోచన మొదలవుతుంది. కోడి కూర వండి, అందులో విషయం కలిపి.. అతిథిని శాశ్వతంగా సాగనంపాలని ఓ నిర్ణయానికి వస్తారు. ఆ తరవాత ఏం జరిగింది? అతిథిని చంపే ప్రయత్నంలో ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? అన్నదే మిగిలిన కథ.
కన్నడ నాటకం `కరాళ రాత్రి` ఆధారంగా అల్లుకున్న కథ ఇది. కథనంలో, పాత్రల స్వభావంలో, వాళ్లు మాట్లాడుకునే మాటల్లో నాటక ఛాయలు కనిపిస్తుంటాయి. మల్లి పాత్రని డిజైన్ చేసిన విధానం బాగుంది. మాటల్లో, చేతల్లో నిర్లక్ష్యం, ఓ నిరాశ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. కథలో అనవసరమైన పాత్రలేమీ ఉండకపోవడం నాటకంలోని విశిష్టత. సినిమావాళ్లు అదెందుకో పాటించరు. నాటకం నుంచి అల్లుకున్న కథ కాబట్టి, ఇక్కడ ఆ తప్పు కనిపించలేదు. అతిథిని చంపాలనుకోవడం దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. పతాక సన్నివేశాలు హృదయాన్ని పిండేస్తాయి. ముగింపులో వచ్చే మలుపు… ఈ కథకు మూలం. అయితే… దాన్ని కొంతమంది ప్రేక్షకులు ఊహించే అవకాశం ఉంది. కథ ప్రారంభంలో.. కొన్ని షాట్లు, మంత్రసాని పడే ఆవేదన చూసినప్పుడు.. ఆమెకు ఏదో ఓ గతం ఉందన్న విషయం అర్థం అవుతుంది. అదేమీ లేకుండా కథని నడిపితే.. ముగింపుని ఊహించే అవకాశమే ఉండేది కాదు. తాము చేసిన తప్పు.. ఆ కుటుంబానికి అర్థమయ్యాక.. వాళ్లు పడే మనోవేదన, తీసుకునే నిర్ణయమూ.. క్లైమాక్స్‌ని మరింత భావోద్వేగ భరితంగా మార్చేస్తాయి.
అత్యాస పనికిరాదు.. అని చెప్పే పాఠం లాంటిదే ఈ కథ. దానికి దృశ్య రూపం ఇచ్చారు. నాటక ఛాయలు అడుగుడుగునా కనిపిస్తాయి. కాకపోతే.. ఎమోషన్ని పండించగలిగాడు దర్శకుడు. `మాయా.. మాయా..`, `లాలిజో` పాటలు బాగున్నాయి. `లాలిజో` పాడిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఆ గొంతు కొత్తగా ఉంది. ఆర్.ఎక్స్ 100 లాంటి సినిమాల్లో హాట్ గా కనిపించింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలోనూ కాస్త బీ గ్రేడ్ పాత్రలా అనిపించినా… క్రమక్రమంగా.. ఆ పాత్రలో ఛాయలు బయట పడుతూ వస్తాయి. తన నిర్లక్ష్యపు చూపులు, బాడీ లాంగ్వేజ్ మల్లి పాత్రని కొత్త కోణంలో చూపించాయి. చైతన్య కృష్ణ తన అనుభవాన్నంతా రంగరించాడు. తల్లితండ్రుల పాత్రలో కనిపించిన నటీనటులు కూడా మెప్పించారు.
నేపథ్య సంగీతం, ఫొటోగ్రఫీ… ఇవన్నీ కథని నడిపించాయి. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా కాదు. వెబ్ ప్రేక్షకుల్ని లక్ష్యంగా తీసిందే. కాబట్టి నిడివి చాలా తక్కువ. థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇవ్వదు. ఓటీటీలో కాబట్టి… ఓసారి లక్షణంగా చూసేయొచ్చు.