ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అందులో ఒకరు అరెస్టయిన అచ్చెన్నాయుడు కాగా.. మరొకరు నిన్నామొన్నటి వరకూ పార్టీ మారుతారని విస్తృతంగా ప్రచారం జరిగిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఆయన ఓటు వేయడానికి రాకపోవడానికి కారణంగా… సెల్ఫ్ క్వారంటైన్‌ను చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం.. వ్యాపార అవసరాల కోసం.. తెలంగాణ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిశానని…అందుకే వైద్యుల సలహా మేరకు క్వారంటైన్లో ఉన్నానని అందుకే.. ఓటు వేయడానికి రావడం లేదని.. మన్నించాలని చంద్రబాబుకు లేఖ పంపారు.
అయితే.. టీడీపీ ఎమ్మెల్యే సెల్ఫ్ క్వారంటైన్ కథ చెప్పారు కానీ.. ఇతర రాష్ట్రాల్లో నేరుగా కరోనా పాజిటివ్ వచ్చినప్పటికి తమ ఓటు బాధ్యతను మర్చిపోలేదు. మధ్యప్రదేశ్‌లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన ఓటు అత్యంత కీలకందా. దాంతో ఐసోలేషన్‌లో ఉన్న ఆయన పూర్తి పీపీఈ కిట్‌ను ధరించి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన అలా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం.. దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. ఆయన రావడం.. కరెక్టా.. కాదా అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం 173 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్టీని ధిక్కరించిన ముగ్గురు టీడీపీ సభ్యులు కూడా ఓటు వేశారు. ఎవరికి ఓటు వేశారన్నది ఎన్నికల ఫలితాలతోనే తేలుతుంది. ముగ్గురిలో ఇద్దరు ఓటు వేసిన తర్వాత.. టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు. మద్దాలి గిరి, వల్లభనేని వంశీ చంద్రబాబుకు వయసయిపోయిందని…పక్కన ఉండేవారిని పక్కన పెట్టాలని సలహాలిచ్చారు. జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పొగడ్తల వర్షం కురిపించారు.