మంత్రివర్గ సమావేశమే పెట్టలేని వారు.. టెన్త్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని.. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్… ఏపీ సర్కార్ పై సెటైర్లు వేశారు. కరోనాను కట్టడి చేయడంతో విఫలమైన ఏపీ సర్కార్.. లేనిపోని భేషజాలకు పోయి.. విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని మండి పడుతున్నారు. టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుంటే… టెన్త్ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం కరెక్ట్ కాదని ఆయనంటున్నారు. కరోనాకు భయపడి మంత్రులెవరూ బయటకు రావడంలేదు… విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఎలా వెళ్తారని పరశ్నించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు, పరీక్షలు రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌గా ఆయన వినిపించారు.
దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి దిశగా వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ రోజూ.. రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. మెట్రో సిటీలు ఉన్న రాష్ట్రాల స్థాయిలో… కరోనా కేసులు నమోదవుతున్నాయి. పల్లెలకూ వైరస్ సోకుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాలు చాలా వరకూ పరీక్షలు రద్దు చేశాయి. కానీ ఏపీ సర్కార్ మాత్రం… వచ్చే నెల రెండో వారంలో నిర్వహించాలని షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇంకా నెల రోజుల సమయం ఉంది కాబట్టి.. ఆ లోపు కరోనా కంట్రోల్ లోకి వస్తుందని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ.. పరిస్థితి అలా లేదని.. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు నిరూపిస్తున్నాయంటున్నారు.
టెన్త్ పరీక్షలను నిర్వహిస్తే.. అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని.. విద్యారంగ నిపుణులు కూడా చెబుతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ..విద్యార్థులతో పరీక్షలు నిర్వహించడానికి.. ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. అందర్నీ గుమికూడకుండా..చేయడం మాత్రం అసాధ్యం అంటున్నారు. పైగా.. అనేక ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కంటెన్మైంట్ జోన్లలో ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది.