ఒకసారి ఓ రాజుకు తన రాజ్యంలో ఎంత మంది గుడ్డివాళ్లున్నాల్లో తెలుసుకోవాలని అనిపించింది. ముఖ్యులందర్నీ పిలిచి.. అడిగాడు. కానీ ఎవరి దగ్గరా లెక్కల్లేవు. దీంతో అందరూ వెళ్లి .. రాజ్యంలో ఒక్కో చోట కూర్చుని… గుడ్డివాళ్లను కనిపెట్టి వివరాలు రాసుకుని రావాలని ఆదేశించాడు. రాజుగారి ఆదేశం కాబట్టి.. ఒక్కరూ మాట్లాడకుండా అదే పని చేశారు. అందరూ గుడ్డివాళ్లను కనిపెడుతున్నారో లేదో పర్యవేక్షణ చేసేందుకు రాజు కూడా… వెళ్లి పరిశీలించాడు. ఓ చోట.. తన అనుంగు అనుచరుడు చెప్పులు కుడుతూ కనిపించాడు. వెళ్లి ఏం చేస్తున్నావ్ అని అడిగాడు రాజు. గుడ్డివాళ్లను కనిపెడుతున్నాను రాజుగారు… ఆ వివరాలు సహాయకుడు రాస్తున్నాడు అని చెబుతాడు. సరే అని రాజు వెళ్లిపోతాడు. తర్వాతి రోజు సభలో… అందరూ.. గుడ్డివాళ్ల జాబితాను ప్రకటిస్తారు. అందులో రాజు పేరు కూడా ఉంది. దీంతో ఉలిక్కిపడటం ఆయనవంతయింది. అదేమిటి నేను గుడ్డివాడినా ఆని ఆశ్చర్యపోయాడు. ఆవేశపడ్డాడు. కానీ.. రాజును గుడ్డివారి జాబితాలో చేర్చిన వ్యక్తి చాలా నిమ్మళంగా సమాధానం ఇచ్చాడు…” రాజు గారు నన్ను మన్నించాలి. కొందరు పుట్టుకతో గుడ్డివారయితే, మరి కొందరు చూపు ఉండి కూడా గుడ్డివారే. నిన్న నేను చేస్తున్న పని స్పష్టంగా కనబడుతోంది అయినా ‘ఏం చేస్తున్నారని’? కొందరు నన్ను ప్రశ్నించారు. చివరకు ప్రభువులవారు కూడా. మరి ఇలాంటి వారు గుడ్డివారే కదా !” అన్నాడు. దాంతో రాజుకు విషయం అర్థమయింది. కళ్లుండి చూడలేకపోతున్నానని అర్థం చేసుకున్నారు. కానీ అప్పటికీ ఆ రాజుకు విషయం అర్థం కాక.. తనను గుడ్డివారి జాబితాలో చేర్చిన వ్యక్తిని తీసుకెళ్లి చెరసాలలో పడేయండి అని ఆదేశిస్తే ఏమయ్యేది..?. ఏముంది మళ్లీ.. తల తిక్క నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. తీసుకున్న ఒక్క నిర్ణయాన్నీ అమలు చేయలేని నిస్సహాయత… అర్థం లేని పట్టుదల.. నిర్ణయాల్లో మూర్ఖత్వంతో ఎదురుదెబ్బలే తింటున్నారు. మూడు రాజధానులు..రంగులు…ఇంగ్లిష్ మీడియం.. పరీక్షలు వంటి వాటిల్లోనే కాదు.. తనపై ఉన్న కేసులు ఎత్తేసుకునే విషయంలోనూ రాజు ఆలోచనకు పోలేదు.. అవేశం మాత్రమే ఉపయోగించారు.
కళ్లున్నా చూడలేని పాలనలో ఎన్నెన్ని వింతలో..!
” కొన్ని పనులు ఆవేశంతో, కొన్ని ఆలోచనతో చేయాలి..” ఏ పని ఆవేశంతో చేయాలి? ఏ పని ఆలోచనతో చేయాలి? అనేది తెలుసుకున్నవాడే రాజకీయాల్లో అడుగు ముందుకేయగలుగుతాడు. లేకపోతే ఎదురు దెబ్బలు తిని తిని చివరికి కిందపడినా నేనే గొప్ప అని స్వకుచమర్దనం చేయించుకుని సంతోషపడాలి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ విషయంలో ఇది కళ్ల ముందే కనిపిస్తోంది. కాకపోతే… అన్ని పనులూ ఆవేశంతో చేస్తున్నారు. కనీస ఆలోచన ఉండటం లేదు. పదుల సంఖ్యలో సలహాదారులు.. అంతకు మించి వ్యవస్థల్లో ఉన్నత స్థానాలకు వెళ్లి .. ఢక్కామొక్కీలు తిన్న వారు ప్రభుత్వంలో ఏ మూల చూసినా .. రూ. లక్షలు ప్రతిఫలంగా అందుకుంటూ కనిపిస్తున్నా.. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆవేశమే కనిపిస్తోంది. ఆలోచననేది అసలు కనిపించడంలేదు. రాజకీయాల్లో ఆవేశం ఎక్కువైతే .. జరిగేతే సెల్ఫ్ యాక్సిడెంట్లే. ఏపీ సర్కార్‌కు ఇంత వరకూ అది అర్థం కావం లేదు.
నిర్ణయాలను అమలు చేయలేకపోతున్నదెందుకో సమీక్ష చేసుకుంటున్నారా..?
టెన్త్ ,ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఎట్టకేలకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు..?. తప్పని సరి అయిన పరిస్థితుల్లో తీసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాలు.. అమల్లోని లోపాలన్నీ ఎత్తి చూపి… ప్రజలకు మొత్తం వ్యవహారం అర్థమయ్యేలా చేసిన తర్వాత.. తప్పనిసరిగా తీసుకున్నారు. కానీ అసలు ప్రభుత్వం ఇక్కడి వరకూ తెచ్చకోవాల్సిన పరిస్థితి ఉందా..? అంటే.. ఆవేశంతో కాకుండా ఆలోచనతో వ్యవహరించే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే… తప్పు జరిగిపోయిందని అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే… పరీక్షలు అనేది రాజకీయం కాదు… విద్యార్థుల భవిష్యత్.. ప్రాణాలు. ఈ విషయంలో విపక్షాలు ఏవో అంటున్నాయని.. వారు డిమాండ్ చేశారని.. మరొకటని.. ఖచ్చితంగా పరీక్షలు పెట్టేయాలన్న ఆవేశానికి రావడమే తప్పు. తర్వాత అయినా పరిస్థితులకు తగ్గట్లుగా ఆలోచించి.. తీగ తెగే పరిస్థితి వచ్చినప్పుడయినా… వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గి… ఎప్పుడు వెనక్కితగ్గాలో కూడా తెలుసని … నిరూపిస్తే బాగుండేది. కానీ సుప్రీంకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేదాకా తగ్గేది లేదని మొండి పట్టుదలకు పోయి… చివరికి కాడి దించేయకతప్పలేదు. ఇప్పటికే ప్రజలందరిలో ప్రభుత్వం తీరుపై ఓ రకమైన అభిప్రాయం ఏర్పడింది. కాస్త ఆవేశం తగ్గించుకుని …తల పైకెత్తి.. దేశంలో ఏం జరుగుతుందో.. చూస్తే పరిస్థితి ఇక్కడ వరకూ వచ్చేది కాదు. తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నా.. సమస్య వచ్చేది కాదు. కానీ ప్రభుత్వం మాది.. నిర్ణయం మాది.. అనుభవించాల్సింది ప్రజలు… అన్నట్లుగా చెలరేగిపోవడంతోనే సమస్య వచ్చింది. చివరికి నిర్ణయం వెనక్కి తీసుకోక తప్పలేదు. అంటే.. వ్రతం చెడింది..పరువూ దక్కలేదన్నమాట.
అన్నింటిలోనూ వ్రతం చెడింది.. పరువూ పోయింది..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెండేళ్ల నిర్ణయాలను పరిశీలిస్తే… ఆవేశంతో తీసుకునే నిర్ణయాలే తప్ప.. వాటిని అమలు చేయగలమా..? లేదా అన్న ఆలోచన ఏ కోశానా కనిపించడం లేదు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలేవీ న్యాయసమీక్షకు కూడా నిలబడటం లేదు. మూడు రాజధానులు మాత్రమే కాదు.. చివరికి మన్సాస్ ట్రస్ట్ వంటి వాటికి అఘమేఘాలపై తీసుకు వచ్చి కుర్చీపై కూర్చోబెట్టిన సంచైత వంటి వారి పదవుల్ని కూడా ఈ ఆవేశం కాపాడటం లేదు. మూడు రాజధానుల అంశాన్ని ఆలోచనతో చేసి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. ఇంతలా పరిస్థితి దిగజారి ఉండేది కాదు. కానీ.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. తనకు ఎదురే లేదనుకునే పరిస్థితి.. అహంకారంతో తీసుకున్న నిర్ణయం … దాని అమలు అదే అధికార మదం చూపించడంతోనే సమస్య వచ్చింది. ఇప్పటి వరకూ ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. న్యాయవివాదంలో ఇరుక్కుపోయింది. ఎప్పటికప్పుడు.. అడ్డదారుల్లో వెళ్లిపోదామని ప్రయత్నించడమే తప్ప.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. రాజమార్గంలో చేయాల్సిన పనిని… చేయలేకపోతోంది. చిన్నా చితకా నిర్ణయాలు కొంత మందిపై ప్రభావం చూపిస్తాయి… కానీ హోల్‌సేల్‌గా రాష్ట్రం మొత్తంపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు… ఆవేశంతో మాత్రమే కాదు.. ఆలోచనతోనూ వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ.. ఏపీ సర్కార్ తీసుకుంటున్న కీలక నిర్ణయాల్లో ఆవేశం ఎక్కువై.. ఆలోచన లేకపోగా.. అహంకారం కూడా జత కలుస్తోంది. ఫలితంగా… తమ నిర్ణయాలను తామే అమలు చేసుకోలేనంత నిస్సహాయ ప్రభుత్వంగా మిగిలిపోతోంది.
కారణాు చెప్పి ఎదురుదాడి రాజకీయం కాదు.. చేతకానితనం..!
ఒక్క అమరావతి మాత్రమే కాదు.. అసలు ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని అమలు చేయగలిగిందని ఆలోచిస్తే.. విశ్లేషిస్తే.. పరిశీలిస్తే… ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయలేకపోయిందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. పంచాయతీ భవనాలపై రంగుల దగ్గర్నుంచి ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉంచుతానని బరితెగింపు వరకు ప్రభుత్వం ఒక్క నిర్ణయం అయినా అమలు చేయగలిగిందా..?. లేనే లేదు. మొండిగా ముందుకెళ్లి.. తాము ఇష్టం వచ్చిటన్లుగా చేస్తామని ఆవేసపడి… బోర్లా పడింది. ఏ నిర్ణయానికీ… రాజ్యాంగ ఆమోదం రాలేదు. చివరికి నియామకాల విషయంలోనూ… తమ పంతాన్ని నెగ్గించుకోలేకపోయింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్నుపదవి నుంచితొలగించి పరువు పోగొట్టుకుంది. సంచైత పదవిని కూడా రాజ్యాంగబద్ధంగా ఇవ్వలేక నవ్వుల పాలయింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రభుత్వం తాము చేయాలనుకున్న ఒక్క పనిని సక్రమంగా చేయలేకపోయింది. నిజంగా.. ఇవన్నీ చేయలేని పనులా..?అంటే.. కాదని ఎవరైనా అంటారు. ప్రభుత్వం తరపున నిజంగా ప్రజలకు మేలు చేసేలా ఓ కార్యక్రమం చేయాలనుకుంటే… దానికి వంద మార్గాలుంటాయి. కావాల్సిందే ఆలోచనే. కానీ ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అసలు దానినే వాడం లేదు. అందుకే అన్నీ ఎదురు దెబ్బలు… ప్రభుత్వం ఏమీ చేయలేదు.. ఏమీ చేతకాదనే విమర్శలు.
ప్రజలు రోడ్డెక్కుతున్నారు..గమనించారా..? ఇవే డేంజర్ బెల్స్
ప్రభుత్వంలో ఉన్నవారు తాము చేయగలిగింది.. చేయాలనుకున్నది చేయాలి. చేయలేకుండా చేయకుండా అడ్డుకున్నారు అని చెప్పుకోవడం గొప్ప వ్యూహాత్మక రాజకీయం అని అనుకుంటారేమో కానీ అది చేతకానితనంగా ప్రజల్లో ముద్రపడిపోతోంది. అధికారంలో ఉండి..ఇతరులు అడ్డుకుంటే చేయలేకపోయారని అనుకుంటారు. ఓటమి చెందిన ప్రతీ సారి ఇలాంటి ఆరోపణలు.. రాజకీయంగానే బాగుంటాయి.. కానీ ఆత్మ పరిశీలన అనేది ఒక్క సారి చేయించుకుంటే .. చేసుకుంటే తప్పెక్కడ జరుగుతుందో అర్థమైపోతుంది. కానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో అదే జరగడం లేదు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు.. పంతం నెగ్గాలనే ఆలోచనకు వస్తున్నారు. ఫలితంగా.. ఎదురుదెబ్బలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఇప్పుడు… ఏపీలో ప్రజలు గళమెత్తడం ప్రారంభించారు. ఉద్యోగ క్యాలెండర్ చూసి నిరుద్యోగులు గళమెత్తారు. రేపు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే.. రైతులు తిరగబడతారు. ఆస్తి పన్ను పెంచితే… పట్టణ వాసులు దండెత్తుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒక్కటంటే.. ఒక్కటి మంచి శుకనం ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఇప్పుడు ఈ సమస్యను యుక్తితో పరిష్కరించుకోవాలి. ఆవేశంతో కాదు. ఆవేశంతో అడుగు వేస్తే ఆలోచన కూడా వెనక్కు పోతుంది.. ఇప్పుడు అదే ప్రభుత్వానికి మైనస్.
పాలకులు కళ్లున్న కబోధులు కాకూడదు..!
ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం గుడ్డిగా.. మొండిగా ముందుకెళ్లింది. తిరుగులేని బలం ఉంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరన్నంత గుడ్డిగా ముందుకెళ్లింది. కానీ ఏ రాజ్యాంగం అయితే అధికారం ఇచ్చిందో ఆ రాజ్యాంగమే కొన్ని పరిమితులు కూడా పెట్టింది. అధికారం అందిందని.. అందర్నీ చంపేస్తానంటే సాధ్యం కాదు… అధికారం అందిందంటే.. అన్నీ అమ్మేస్తానంటే సాధ్యం కాదు.. అధికారం అందిందని… తానే సర్వాధికారిని అనుకోవడం… గుడ్డితనమే. రెండేళ్ల కాలంలో ఆ గుడ్డితనమే ఇంకా కనిపిస్తోంది. ముందుగా చెప్పుకున్నట్లుగా కన్నులు తెరిపించే తీర్పులు న్యాయస్థానాల్లో ప్రతీసారి వస్తున్నయి. కానీ ఎప్పటికప్పుడు కన్నులు తెరుచుకోకపోగా.. గుడ్డిగానే ఉంటానని.. గుడ్డి నిర్ణయాలు తీసుకుంటూ పోతున్నారు. అందుకే… ఇంకా పాలన గాడిన పడటం లేదు.