మూడోతరం వచ్చేసరికి తెలుగుదేశం స్వరూప స్వభావాలు మౌలికంగానే మారిపోయాయి. ఎన్ టి ఆర్ హయాంలో అన్ని రాజకీయ పార్టీలనూ కూడగట్టుకుని సారధ్యం వహించడమే పార్టీ ఉనికి, మనుగడల్లో ప్రధానంగా కనిపించేది. ఎన్ టి ఆర్ మాదిరిగా జనాకర్షణ లేని చంద్రబాబు నాయుడు హయాంలో కన్విన్సింగ్, లాబీయింగ్ లద్వారా పార్టీ మాటే పైచేయిగా వుండేలా చూశారు. కార్యకర్తలతో తప్ప నేరుగా ప్రజలతో ఇంతవరకూ ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోని నారా లోకేష్ సిద్దాంతమైతే ”ఎనలైజ్”, ”హాండిల్”,”మేనేజ్”.
అశోక్ గజపతిరాజు, కెఇకృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు వంటి ఏకొద్దిమందో తప్ప ఎన్ టి ఆర్ నాటి నుంచీ పార్టీలో వున్న వారు ప్రస్తుతం పార్టీలో లేరు. ఆ కొద్దిమందీ ‘మార్పులను’ తమకు అంటించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులా గౌరవాన్ని నిలబెట్టు కుంటున్నారు. మిగిలినవారందరూ చంద్రబాబు విధేయులే! వారి విధేయతను లోకేష్ కి ఎక్స్టెండ్ చేయడానికి అభ్యంతరం లేనివారే!
పార్టీని నిరంతరాయంగా నడపడానికి కమిట్ మెంటు వున్న కార్యకర్తల కంటే డబ్బే ముఖ్యమని అధికారంలో లేని పదేళ్ళలో బాగా అర్ధం చేసుకున్న బాబు ”పార్టీ పోషకుల”కే పెద్దపీట వేశారు. ప్రజాజీవనంతో సంబంధాలు లేకపోయినా సుజనాచౌదరి,నారాయణ, గంటా శ్రీనివాసరావు వగైరా వగైరా నిరంతర ఆదాయవనరులు వున్నవారు ఇవాళ అధికార పదవుల్లో వుండటానికి అదే మూలం.
చినబాబు లోకేష్ కూడా పార్టీని నడపడానికి తండ్రి అనుభవాన్నే పాఠంగా స్వీకరించారు. పార్టీకోసం అవసరమైతే ఆర్ధిక వనరులు సమకూర్చే సామర్ధ్యమే వెంకటేష్ ను రాజ్యసభకు పంపించింది.
ఇప్పటి రాటకీయాల్లో డబ్బు ప్రాధాన్యతను ఎవరూ తోసిపుచ్చలేరన్నది వాస్తవమే! అయితే, రాజకీయ ప్రత్యర్ధులను ఎలా ఎదుర్కొంటారు అనే విషయంలో కూడా రాజకీయ ప్రక్రియ కంటే ”వారిని కలిపేసుకుందాం!”అనే మార్గాన్నే తెలుగుదేశం అమలు చేస్తోంది.
ఈ ఆలోచన ప్రకారం రాజకీయాల్లో ప్రత్యర్ధులే వుండరు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరులోని పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ని సందర్శించారు. మూడు గంటలపాటు వేర్వేరు విభాగాల నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.
రాజకీయంగా మనకి ఎదురు లేదు. జగన్ పార్టీని పట్టించుకోనవసరం లేదు. అయితే లెఫ్ట్ పార్టీల్లో, ముఖ్యంగా సిపిఎం కి అనుబంధంగా వున్న టీచర్ల యూనియన్లు, అంగన్ వాడీ వర్కర్ల యూనియన్లు టఫ్ గా వున్నాయి. ఎక్కడికక్కడ వాటిని ఎనలైజ్ చేసి వీలైనంతవరకూ కలిపేసుకోవడం మనక బలం అని ఆసమావేశాల్లో లోకేష్ సూచించారు.
”తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా!” అన్నది ఎన్ టి ఆర్ నినాదమైతే మూడోతరానికి వచ్చేసరికల్లా ” బలమున్నవారిని పార్టీలో కలిపేసుకుందాం రా!” అన్నట్టు మారిపోయింది.
మంచైనా, చెడైనా అతిపెద్ద కేడర్ వన్న తెలుగుదేశం పాటించే, అమలుచేసే విధానాల ప్రభావం ప్రజాజీవనం మీద గట్టిగా వుంటుంది. దీన్ని దృష్టిలో వుంచుకుని రాజకీయాల్లో నైతిక సాంస్కృతిక కాలుష్యాలు లేకుండా విధాన నిర్ణయాలు చేయవలసిన బాధ్యత తెలుగుదేశంతో సహా అన్ని పార్టీల మీదా వుంది!