హిట్లు, సూపర్ హిట్లు, సూపర్ డూపర్ హిట్లూ, బ్లాక్ బ్లస్టర్ హిట్లూ, ఇండ్రస్ట్రీ హిట్లూ.. ఇలా చాలా పేర్లు, చాలా సులువుగా వాడేస్తుంటాం. ఓ సినిమా హిట్లా… ఇండ్రస్ట్రీ హిట్టా? అనేది నిర్ణయించేది వసూళ్లే. కానీ.. ట్రెండ్ సెట్టర్, క్లాసిక్ లాంటి పదాలు వేరు. ఆ స్థాయికి చేరాలంటే ఉండాల్సిన అర్హతలు వేరు. ఖైది ఓ ట్రెండ్ సెట్టర్.. శివ ఓ ట్రెండ్ సెట్టర్.. తెలుగు సినిమా రూపు రేఖల్ని సమూలంగా మార్చేసిన సినిమాలవి. ఆ సినిమాలు ఎవరికి చేరువ అయ్యాయి? ఎవరు చూశారు? అనేది పక్కన పెడితే.. సినిమా తీయడంలో కొత్త పాఠాలు నేర్పాయి. మాయాబజార్, మిస్సమ్మ, మల్లేశ్వరి… ఇవన్నీ క్లాసిక్స్! ఓసారి చూసి పక్కన పెట్టేయలేం. మళ్లీ మళ్లీ చూస్తుండిపోతాం. అందులో ఏదో తెలియని అద్భుతం దాగుంటుంది. దాన్ని పట్టడం, అనుకరించడం అసాధ్యం. ట్రెండ్ సెట్టర్ అలా కాదు. అప్పటి వరకూ వచ్చిన కథల్ని, పాత్రీకరణనీ, సంభాషణల్నీ సమూలంగా మార్చేస్తాయి. కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి.
ఇటీవల విడుదలైన అర్జున్ రెడ్డిని కొంతమంది క్లాసిక్‌గా, ఇంకొంతమంది ట్రెండ్ సెట్టర్‌గా అభివర్ణిస్తున్నారు. క్లాసిక్కి కావల్సిన లక్షణాలు ఈ సినిమాలో లేవు. ట్రెండ్ సెట్టర్ అనిపించుకోదగిన అర్హత మాత్రం అర్జున్ రెడ్డికి ఉంది. సినిమా తీయడంలో ఉన్న రూల్స్‌ని బ్రేక్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. మరీ ముఖ్యంగా కథానాయకుడి పాత్ర చిత్రణ షాక్‌కి గురి చేస్తుంది. ఇంత బోల్డ్ క్యారెక్టర్ తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకూ చూళ్లేదు. అర్జున్ రెడ్డి పాత్రని రాసుకోవడం వెనుక దర్శకుడికంటూ కొన్ని ఉద్దేశ్యాలు, లక్ష్యాలు కనిపిస్తాయి.
సాధారణంగా మన సినిమాల్లో హీరో అంటే మంచి, మానవత్వం, కట్టుబాట్లు, ప్రేమ.. వీటికి లొంగినట్టు చూపిస్తారు. మంచితనంలోంచి హీరోయిజం పుట్టిస్తారన్నమాట. అది సర్వజనీనమైన సూత్రం. అర్జున్ రెడ్డిలో ఆ లక్షణాలేం కనిపించవు. మంచోడా అంటే చెప్పలేం, చెడ్డోడా అంటే అదీ చెప్పలేం. పక్కింటి ఆంటీ వంక ఆబగా చూడడం, ఫ్యాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవడం, మిత్రుడికి పెళ్లి కుదిరితే… జెలసీ ఫీలవ్వడం, ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించి, మరో అమ్మాయితో సెక్స్ చేయాలనుకోవడం ఇవన్నీ నెగిటీవ్ లక్షణాలు. అయితే మరోవైపు అర్జున్ రెడ్డి వ్యక్తిత్వం మాత్రం ఉదాత్తంగా కనిపిస్తుంటుంది. అమ్మాయిల్ని చులకనగా మాట్లాడితే నచ్చదు. ఫ్రెండ్షిప్కి విలువ ఇస్తాడు. ప్రేమించిన అమ్మాయి మరొకరితో కడుపు చేయించుకొందని తెలిసినా.. ”ఆ బిడ్డకు నేనే తండ్రి అని చెప్పు” అంటాడు. ఇవన్నీ హీరోయిటిక్ లక్షణాలే. తను ఇష్టపడే డాక్టర్ వృత్తి దూరం అవుతుందని తెలిసినా.. అబద్దం చెప్పడానికి, మోసం చేయడానికి ఒప్పుకోడు. అంత ఆస్తి ఉన్నా.. రోడ్డు పక్కన ఓ ముష్టివాడిలా పడుకోవడానికి సిద్ధపడతాడు. ఇవన్నీ… అర్జున్ రెడ్డి అనే పాత్రలో భిన్న కోణాలకు దర్పణాలుగా నిలిచిన సన్నివేశాలు. ప్రేమ వేరు, వ్యక్తిత్వం వేరు, కోపాలు వేరు, వ్యసనాలు వేరు, సెక్స్ వేరు.. ఇవన్నీ చలం సిద్దాంతాలు. వాటిని అచ్చంగా తన కథానాయకుడి పాత్రకు
అన్వయించాడు దర్శకుడు.
క్యారెక్టర్ బేస్డ్ హీరోయిజం సృష్టించడానికి అర్జున్ రెడ్డి ఓ దోవ చూపించింది. అర్జున్ రెడ్డి సినిమాలో బూతులున్నాయా? సెక్స్ ఉందా? లిప్లాక్కులున్నాయా? అనే విషయాల్ని పూర్తిగా పక్కన పెట్టి.. అర్జున్ రెడ్డి కోణంలోంచి ఈ సినిమాని చూస్తే కచ్చితంగా ఇదో ట్రెండ్ సెట్టర్‌గా కనిపిస్తుంది. భవిష్యత్తులో చాలామంది హీరోలు, చాలా కథలు అర్జున్ రెడ్డి ముసుగులో రాబోతున్నాయి.. మనం చూస్తాం కూడా! శివ ప్రభావం పదేళ్ల వరకూ గట్టిగా కనిపించింది. ఆ తరవాత ప్రతీ సినిమాలోనూ, ప్రతీ హీరోలోనూ శివ కనిపించాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి కూడా అంతే!