ఆచార్య ఫలితం తేడా రావడం.. చిత్ర వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది. చిరంజీవి సినిమా అంటే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. దానికి టాక్ తో సంబంధం లేదు. దానికి తోడు రామ్ చరణ్ జత కలిశాడు. కొరటాలకు ఫ్లాపే లేదు. అలాంటప్పుడు ఓపెనింగ్స్ ఎలా ఉండాలి? అసలు ఫస్ట్ డే.. ఫస్ట్ షోకే.. జనాల్లో ఊపులేదు. టాక్ తెలిశాక.. రెండో రోజు చప్పబడిపోయింది. చిరు సినిమా విడుదలైన రెండో రోజు థియేటర్లో జనాలు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చిరుకే ఇలాగుంటే, మిగిలిన హీరోల మాటేమిటన్నది పెద్ద ప్రశ్న.
సినిమాలు చూసే మూడ్ జనాలకు లేదు.. అనడానికి వీల్లేదు. పుష్ప, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ చూసింది వాళ్లే కదా..? ఆ సినిమాలకు రికార్డు వసూళ్లు ఇచ్చింది ఈ జనాలేగా..? కరోనా అంటూ సాకులు చెప్పడానికి కూడా వీల్లేదు. జనాలు సినిమాలకు వెళ్లడానికి రెడీనే. కాకపోతే.. ఏ సినిమా చూడాలి? ఏది చూడకూడదు? అనేదానిపై వాళ్లకు క్లారిటీ ఉంది. ఎంత పెద్ద స్టార్ అయినా.. బజ్ ఉంటేనే సినిమాకు వెళ్లేది. సినిమా బాగుందని తెలిస్తేనే… చూసేది. లేదంటే లైటే. దానికి మరోబలమైన కారణం.. ఓటీటీ.
ఎంత పెద్ద సినిమా అయినా సరే, నెల రోజుల్లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లోకి వచ్చేస్తోంది. దాని కోసం థియేటర్లకు వెళ్లడం ఎందుకు? అంతేనా.. టికెట్ రేట్లు అమాంతం పెరిగాయి. హైదరాబాద్ లో ఓ మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే దాదాపుగా ఒక్కో కుటుంబానికి రెండు వేలకు పైనే అవుతోంది. అలాంటప్పుడు థియేటర్లకు ఎందుకు వెళ్తారు? ఎవరి కోసం వెళ్తారు? ఆచార్య అనే కాదు… ఆర్.ఆర్.ఆర్, పుష్ప, కేజీఎఫ్… వీటికి నెగిటీవ్ టాక్ వచ్చినా.. పరిస్థితి ఇలానే ఉంటుంది.
చిరంజీవి సినిమాకే ఇలా ఉంటే.. వెంకటేష్, రవితేజ, నాని, అఖిల్… వీళ్ల పరిస్థితేంటి? ఈ వేసవిలో వీళ్లందరి సినిమాలూ వస్తున్నాయి. ఆయా సినిమాలకు బజ్క్రియేట్ చేయకపోతే.. `ఈ సినిమా చూడాల్సిందే` అనే ఫీలింగ్ తీసుకురాకపోతే.. ఏ సినిమాకైనా ఆచార్య లాంటి ఫలితమే వస్తుంది. ఈ విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి.