‘ఆహా’ కంటెంట్ బిల్డింగ్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే వెబ్ సిరిస్ లు, సినిమాలు, డ్యాన్స్, సింగింగ్, కుకింగ్, టాక్ షోలు ప్రసారం చేసింది. ఇప్పుడు అనిల్ రావిపూడి స్పెషల్ ఎట్రాక్షన్ గా ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ అనే కామెడీ షోని మొదలుపెట్టారు. మొత్తం పది ఎపిసోడ్లు వుండే ఈ సిరిస్ లో తొలి ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. ఈ షో ని ఒక స్టాక్ మార్కెట్ స్టయిల్ లో డిజైన్ చేశారు. మొత్తం ఆరుగురు కమెడియన్లు వున్నారు. రాజు, అవినాష్, వేణు, హరి, భాస్కర్ జ్ఞానేశ్వర్, సద్దాం. ఈ ఆరుగురు చేసే కామెడీ ఆధారంగా ఆడియన్స్ కొనుగోలు వారికి వాల్యు కడుతుంటారు.
మొదటి ఎపిసోడ్ లో స్కూల్, కాలేజీ డేస్ పై స్టాండప్ స్టయిల్ కామెడీ చేశారు. అంతకుముందు’కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ చైర్మన్ గా అనిల్ రావిపూడి ఎంట్రీ నవ్వించింది. ఈ ఎపిసోడ్ లో సద్దాం చేసిన కామెడీ అనిల్ రావిపూడి కి నచ్చింది. జబర్దస్త్ లానే పెర్ఫార్మార్ అఫ్ ది డే అవార్డ్ వుంది. ఐతే దాన్ని “లాఫింగ్ స్టాక్ అఫ్ ది డే’ అని పిలిస్తున్నారు. ముక్కు అవినాష్ మొదటి ఎపిసోడ్ విజేతగా నిలిచాడు. ప్రస్తుతం అతని స్టాక్ వాల్యు ఎక్కువగా వుంది. పది ఎపిసోడ్లలో ఎవరిస స్టాక్ వాల్యు ఎక్కువగా వుంటుందో వాళ్ళే ఈ సిరిస్ విజేత.
మొదటి ఎపిసోడ్ లో కొన్ని నవ్వులు పండాయి. ఐతే రొటీన్ బీజీయంలు, కమెడియన్ల డ్యాన్సలు కొన్ని చోట్ల పాత కామెడీ షోలనే గుర్తుకు తెచ్చాయి. సుధీర్ ని స్త్రీలోలుడుగా చిత్రీకరించి చేసిన కామెడీ ఇప్పటికే మొహం మొత్తింది. ఇందులో అతడు హోస్ట్ గా ఉన్నపటికీ అతడిపై అవే పాత జోకులు, బీజీయంలు పేలడం మళ్ళీ జబర్దస్త్ నే గుర్తుకు తెస్తుంది. దీపిక పిల్లి మరో యాంకర్ గా కలర్ ఫుల్ గా కనిపించింది. అయితే కేవలం కలర్ కోసం కాకుండా హోస్ట్ లు కూడా స్ద్క్రిప్ట్ లో భాగమైతే ఇలాంటి షోలు మరింతగా రక్తికడతాయి. మొత్తానికి మొదటి ఎపిసోడ్ కాన్సెప్ట్ పరంగా తర్వాత ఎపిసోడ్లపై ఆసక్తిని పెంచగలిగింది.