దేశంలో అత్యధిక రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 82 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అంతా పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటాన్ని గొప్పగా చెబుతున్నారు. కానీ పోలింగ్ పర్సంటేజీ తగ్గడానికి ఇదే కారణం అని ఎందుకు అనుకోవడం లేదో నిపుణులకు అర్థం కావడం లేదు. ఒక్క ఓటర్ మూడు గంటలు క్యూలైన్ లో నిలబడి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంటే… ఓ పది శాతం మంది అయినా … వివిధ కారణాలతో ఓటు వేయడానికి వెనక్కి తగ్గుతారు. ఇదే జరిగింది.
ఒక్కో పోలింగ్ బూత్‌లో పన్నెండు వందల మంది ఓటర్లను కేటాయిస్తున్నారు. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు రెండు ఓట్లు వేయాల్సి వస్తుంది. ఈ కారణంగా పోలింగ్ ఆఫీసర్ల పని కూడా పెరుగుతుంది. ఓట్లు వేసే సమయం కూడా పెరుగుతుంది. అందు వల్ల ఒక్క పోలింగ్ బూత్ లో పన్నెండు వందల ఓట్లు పడాలంటే… ఎన్ని గంటలు పడుతుందో లెక్క లేకుండా పోతోంది. ఫలితంగా ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.
పోలింగ్ సిబ్బంది ఎవరైనా మందకొడిగా ఉన్నారంటే.. ఇక పోలింగ్ ఎంత సేపటికి ముగుస్తుందో అంచనా వేయడం కష్టం. పోలింగ్ బూత్‌కు ఐదారు వందల మంది ఓటర్లకే పరిమితం చేస్తే.. పెద్ద పెద్ద క్యూలు తగ్గిపోతాయి. ఓటర్లు సులువుగా వచ్చి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా ఆలోచించడం లేదు. అర్థరాత్రి వరకూ పోలింగ్ జరిగితే అదో గొప్ప అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఈ క్యూల వల్ల తగ్గిపోయిన పోలింగ్ శాతం.. ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ తప్పులు దిద్దుకుంటే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది.