బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ జై సింహా అని కన్ ఫర్మ్ చేసారు. బహుశా, సింహా అనే పదం బాలకృష్ణ కి కలిసివచ్చిందని ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అసలే సెంటిమెంట్స్ రాజ్యమేలే సినిమా ఇండస్ట్రీ లో ఈ నిర్ణయం పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించలేదు. కానీ నిజంగానే కాస్త పరికించి చూస్తే, ఈ సింహాలు, పులులూ అనే పదాలు టటిల్లో ఉండటం, బాల కృష్ణ కి , నందమూరి హీరోలకి కలిసి వచ్చింది కానీ ఎందుకో చిరంజీవికి అస్సలు కలిసి రాలేదు.
చిరంజీవి సినిమాల్లో చూస్తే సింహం అన్న పేరు- డైరెక్ట్ గా గానీ, ఇన్ డైరెక్ట్ గా గానీ, ఇంకోరకంగా కానీ ప్రస్తావించిన ప్రతీసారీ దెబ్బే తగిలింది. ఆఖరికి కొదమ సింహం లాంటి మంచి సినిమాకి కూడా ఈ దెబ్బ తప్పలేదు. ఉదాహరణకి సింహపురి సింహం (ఫ్లాప్), కొదమసింహం ( యవరేజ్), మృగరాజు (డిజాస్టర్). సింహాలొక్కటే కాదు, పులులు కూడా అంతే …పులి (చిరంజీవి సినిమా పాతది), పులి బెబ్బులి (ఫ్లాప్). చిరంజీవి తో పాటు పవన్ కళ్యాణ్ కి “కొమరం పులి” కూడా అలాంటి ఫలితాన్నే ఇచ్చింది. కాస్త లో కాస్త నయం ఏంటంటే, చిరుత సినిమా రాం చరణ్ కి ఓ మోస్తరు హిట్టవడం.
ఇక ఇటు నందమూరి సినిమాలకి వస్తే, చిత్రంగా సింహాలూ, పులులూ తెగ కలిసి వచ్చాయి. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లక్షీ నరసింహ, సింహా లాంటి సినిమాలు సూపర్ హిట్టయాయి. అంతకు ముందు తీసిన బొబ్బిలి సింహం కూడా హిట్టే. అలాగే సీనియర్ NTR తీసిన కొండవీటి సింహం, బెబ్బులి పులి కూడా హిట్టే. ఈ లిస్టంతటిలో పంటి కింద రాయి ఏదంటే – సీమ సింహం సినిమా. బాలకృష్ణ తీసిన ఆ సినిమా సెంటిమెంట్ ని దాటి మరీ ఫ్లాపయ్యింది.
ఇంకొక చిన్న సెంటిమెంట్ “జై సింహ” విషయం లో ఏంటంటే – గతం లో జయసింహ అనే పేరు తో తీసిన NTR సినిమా పెద్ద హిట్. అయితే ఇప్పుడు ఆ పేరు లో “జయ” ని రిపీట్ చేయకుండా “జై” అని పెట్టారు – మరి ఇది “జై” లవకుశ తాలూకు సెంటిమెంట్ ఎఫెక్ట్ ఏమో మరి తెలీదు.