ప్రతి శుక్రవారం ఏదొ ఒక బొమ్మ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఆ మాటకు వస్తే ఒకటన్నమాటేమిటి? రెండు మూడు సినిమాలు కూడా వస్తుంటాయి. కొన్ని బొమ్మలు చూస్తే హమ్మ..అనిపిస్తుంది. మరి కొన్ని బొమ్మలు చూస్తే దిమ్మ దిరిగిపోతుంది. ఇంకొన్ని బొమ్మలు చూస్తే, ఇలా కాకుండా అలా చేసి వుంటే అని కూడా అనిపిస్తుంది. సాధారణంగా సమీక్షల్లో ఇలాంటివి అన్నీ ముచ్చటించుకోలేం. సమీక్షకు వున్న పరిథులు అలాంటివి. ఆ పరిథులు దాటి సినిమాను చూస్తే…అదే బొమ్మ బొరుసు.
*
మంచి సినిమా అయినంత మాత్రాన తప్పులు వుండకూడదని కాదు.
మంచి సినిమా అయినంత మాత్రాన చూసీ చూడనట్లు వదిలేయకూడదనీ కాదు.
భరత్ అనే నేను మంచి సినిమా. పెద్ద హీరోల సినిమాలు అంటే అయిదుపాటలు, మూడు ఫైట్లు అన్న కాన్సెప్ట్ కాకుండా, కాస్త ఏదైనా చెప్పే ప్రయత్నం చేయడం అన్నది మెచ్చుకోవాల్సిన సంగతి. ప్రేమిస్తే పోయేదేమీ లేదు తిరిగిప్రేమిస్తారు, పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చేయాల్సిందే, పర్యావరణం రక్షితో రక్షిత: ఇలా మూడు కాన్సెప్ట్ లు చూపించిన దర్శకుడు కొరటాల శివ ఈ సారి సమాజంలో ప్రతి ఒక్కరి భయమూ, బాధ్యత రెండూ వుండాలనే విషయం గుర్తు చేస్తూ తీసిన సినిమా భరత్ అనే నేను.
సాధారణంగా వాదనలు అన్నవి ఎవరి కన్వీనియెంట్ ను బట్టి వాళ్లు నిర్మించుకుంటారు. ఇది ఓ పెద్దల మాట. భరత్ అనే నేను కూడా అంతే. దర్శకుడు ఫీలయిన రెండు మూడు పాయింట్లను గట్టిగా చెప్పడానికి వీలుగా, ఆయన వాదన ఆయన తయారుచేసుకుని, కేవలం నాణానికి ఒకే వైపు చూపించే ప్రయత్నం భరత్ అనే నేను. తప్ప వేరు కాదు. ఇంత సైధ్దాంతిక పరమైన వాక్యం ఎందుకు అంటే, మామూలు కమర్షియల్ సినిమా అయితే డిస్షషన్ కు తావు లేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే భరత్ అనే నేను, దర్శకుడు తన వాదన తాను వినిపించేసి, అవతలి వాడి వాదనకు అవకాశం లేకుండా చేయడం లా వుంటుంది. కమ్యూనిస్ట్ భావాలు గల వ్యక్తి అని చెప్పుకునే దర్శకుడు కొరటాలశివ అసలు పెట్టుబడి దారుల ప్రస్తావనే లేకుండా రాజకీయ చిత్రం తీయడం విశేషం.
ట్రాపిక్ సమస్యను ప్రస్తావించారు. అసలు ట్రాఫిక్ సమస్యలో ఇంకా చాలా కోణాలు వున్నాయి. వంద అడుగుల రోడ్ లో వాహనాలు వెళ్లడానికి ఎంత ప్లేస్ వుంటోంది? మిగిలిన ప్లేస్ అంతా ఏమవుతోంది? పెట్టుబడిదారులైన వ్యాపారులు తమ తమ అవసరాల కోసం రోడ్లను ఎలా మింగేస్తున్నారో చెప్పకుండా, ఏదో బాధపడి రోడ్ల మీద వెళ్లేవాళ్లదే తప్పు అనడం భలే చిత్రం కదా? ఒక సమస్యను డిస్కస్ చేయాలి అనుకున్నపుడు పూర్తిగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే శిక్ష కఠినంగా వున్న కొద్దీ అవినీతి పెరుగుతుందున్నది వాస్తవం. ఫైన్ అయిదు వందలయితే అవినీతి విలువ వంద. అదే ఫైన్ పాతిక వేలు అయితే అవినీతి విలువ అయిదువేలు అవుతుంది. ఈ విషయం ఎందుకు టచ్ చేయలేదు దర్శకుడు.
ఈ దేశంలో అన్నింటి కన్నా పెద్ద సమస్య, అన్ని సమస్యలకు మూల కారణమైన సమస్య అవినీతే. ఆ విషయాన్ని అత్యంత కన్వీనియెంట్ గా మరచిపోయి, అస్సలు డిస్కస్ చేయడమే మానేసారు. అదే శంకర్ తీసిన ఒకే ఒక్కడులో చాలా సున్నితంగా ఆ విషయాన్ని కూడా ఎత్తి చూపించిన వైనం మనకు తెలిసిందే.
పెద్దాయిన అయిన రైతును పట్టుకుని, కాలంతో పాటు మారాలి. లేకుంటే మరచిపోతారు అనేలా హీరో స్పీచ్ ఇస్తాడు. ఎలా? ఏ విధంగా మారాలి? భారత దేశంలో ఆధునిక వ్యవసాయం చేస్తున్న రైతుల శాతం ఎంత? చిన్న కమతాల వారికి ఆధునిక సేద్యం ఏ విధంగా సాధ్యం? ప్రభుత్వం వ్యవసాయానికి కల్పిస్తున్న రాయతీలు పెద్ద కమతాల వారికి కలిసి వస్తున్నట్లుగా, చిన్న రైతులకు అందుతున్నాయా? ఇవన్నీ కన్వీనియెంట్ గా వదిలేసి, ఒకటి రెండు ఎమోషన్ సీన్లు, మూడు నాలుగు ఎమోషన్ డైలాగులు రాసేసి, మేధావి వర్గం ఆలోచించదగ్గ సినిమా తీసానని భుజాలు ఎగరేస్తే ఎలా?
దుర్గామహల్ ఫైట్ ఇంకా చిత్రాతి చిత్రం. సిఎమ్ సెక్యూరిటీ జనాలు ఏమంటారు? రౌడీలు మీకేదైనా హాని తలపెడితే, వాళ్లను తాము కాల్చేస్తాం అని కదా? రౌడీలకు మాత్రం తెలియదా? తాము సిఎమ్ ను చంపేస్తే, వెంటనే సెక్యూరిటీ గన్ మెన్ లు తమను కాల్చి ఎన్ కౌంటర్ చేస్తారని? మరి అలాంటపుడు ఈ ఫైట్ ఏమిటి? అస్సలు లాజిక్ లేకుండా?
ఇక సిఎమ్ పదవికి కథానాయకుడు రాజీనామా చేసిన సీన్ అయితే మరీనూ. అమ్మాయితో చెట్టాపట్టాలేసుకున్నాడని ఎవరో రాస్తే, వెంటనే భరత్ చేయాల్సిన పని ఏమిటి? నేరుగా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి, తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకోవడం. అంతే కానీ రాజీనామా చేయడం ఏమిటి? అంటే తను చేసింత తప్పు అని నైతికంగా ఒప్పుకున్నట్లా? అలా రాజీనామా చేసిన తరువాత అమ్మాయి ని వెదుక్కుంటూ వెళ్లడం ఏమిటో? మీడియాను అంతలా నిలదీయగలిగిన సిఎమ్, అదే మీడియా ముందు తాను, ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నామని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటామని చెప్పలేడా? సినిమాను తమకు అనుకూలమైన క్లయిమాక్స్ మలుపు తిప్పడం కోసం తప్ప, వేరు కాదు ఇదంతా.
ఇక విభిన్నమైన కథ అనుకుంటే ముగింపు వేళ, మళ్లీ తండ్రికి విషమిచ్చి చంపాడు విలన్ అని చూపించడం అంటే రెగ్యులర్ ఫార్మాట్ కు మళ్లిపోయినట్లేగా. అసలు ఆ పాయింట్ లేకపోతే సినిమాకు వచ్చిన నష్టం ఏమిటి? ఈ పాయింట్ పెట్టడం ద్వారా కొత్త అనుమానాలకు తావిచ్చాడు దర్శకుడు.
తన ఈడు వాడు, రాజకీయాలు తెలిసిన వాడు అయిన తన నేస్తమే తన మాట వినలేదు, చంపాల్సి వచ్చింది అన్నపుడు, చిన్నవాడు, విదేశాల్లో చదివిన వాడు, పైగా అదే తండ్రి నిజాయతీ రక్తం పంచుకు పుట్టిన వాడు, తన మాట వింటాడని ఎలా అనుకున్నాడు ప్రతినాయకుడు? అన్న అనుమానం కలుగుతుంది. అసలు పార్టీలో రెండు వర్గాలను సముదాయించలేక, ఎవర్నో ముఖ్యమంత్రిని చేసి, చేతులు దులుపుకునే వాడు పార్టీని మొత్తం ఎలా నడిపిస్తాడు? అని ఎలా అనుకోవాలి?
ఇక స్వయం పరిపాలన. ఈ స్వయం పరిపాలనకు చెప్పిన కారణం భలే జోక్ గా వుంది. రాజధాని దూరంలో వుంది కాబట్టి, స్వయం పరిపాలన ఇవ్వాలట. పాలనా వికేంద్రీకరణ గురించి దర్శకుడికి తెలియదని అనుకోవాలా? 300 కు పైగా సమితులు వుంటే పాలన సరిగ్గా సాగదనేగా, ఎన్టీఆర్ వాటిని వెయ్యికి పైగా మండలాలుగా మార్చి, ప్రజలకు ఎమ్మార్వోలను, ఎండీవోలను దగ్గరగా తీసుకెళ్లింది. రాష్ట్రం, ప్రాంతం, జిల్లా, డివిజన్, మండలం, పంచాయతీ ఇలా ఎక్కడిక్కడ పాలనకు ఏర్పాట్లు వున్నాయన్న సంగతి మరిచిపోతే ఎలా? రాజకీయ, అధికార వ్యవస్థలు రెండు సమాంతరంగా మనకు వున్నాయి. చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మారో, పంచాయతీ అధికారి ఇలా పాలనా వ్యవస్థ వుంది. ఇప్పటికీ గ్రామసభలు వున్నాయి. పంచాయతీలకు ఇన్ని కిలోమీటర్ల రోడ్లు అని ఇస్తే, వాళ్లే ఏ వీధిలో కావాలంటే ఆ వీధిలో వేసుకుంటున్నారు. ఇది స్వయం పరిపాలన కాదా?
ఇలా భరత్ అనే నేను కథ ఆద్యంతం అతుకుల బొంత..డొల్ల. కేవలం కొన్ని పాయింట్లు, కొంత ఎమోషన్ కలిసి, కాస్త మంచి సంభాషణలు రాసి, స్టేజ్ మీద మెజీషియన్ మ్యాజిక్ చేసినట్లు, దర్శకుడు కొరటాల శివ మ్యాజిక్ చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాడు తప్ప, సిద్దాంతానికి, వాదనలకు నిలిచే కథ, కథనాలు అయితే కావు. కేవలం దర్శకుడు ఆవేశంగా ఫీలయిన కొన్ని అంశాలను తన దైన శైలిలో పరిష్కరించే ప్రయత్నం తప్ప, లోతుకు వెళ్లి ఆలోచించిన వ్యవహారం కాదు.