బిగ్ బాస్ అనేది తెలుగు ప్రేక్షకులకు, ఇక్కడి వాతావరణానికీ, పద్ధతులకూ నప్పుతుందా? అనే అనుమానాల్ని ఎన్టీఆర్ పటాపంచలు చేసేశాడు. తన వాక్చాతుర్యంతో, ఇమేజ్‌తో ఈ కార్యక్రమానికి వన్నె తీసుకొచ్చాడు. బిగ్ బాస్ మెల్లమెల్లగా … స్లో పాయిజన్ రూపంలోకి ఎక్కేసింది. ప్రతీ రోజూ బిగ్ బాస్ గురించిన రచ్చే. అలా సీజన్ 1 సూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు సీజన్ 2 మొదలైంది. తొలి సీజన్ తో వచ్చిన అంచనాలు, జరిగిన కాంట్రవర్సీల వల్ల కావొచ్చు సీజన్ 2పై కూడా ఆశలు పెరిగాయి. ‘ఏమైనా జరగొచ్చు’ అని నాని.. ఊరిస్తూ ఉడికిస్తూ… మసాలా దట్టించే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్‌తో పోలిస్తే.. నాని స్టార్ డమ్‌లో తక్కువ కావొచ్చు. కానీ పాపులారిటీలో మాత్రం కాదు. కాబట్టి… హోస్ట్ పరంగా పెద్దగా వంకలు పెట్టాల్సిన పని లేకుండా పోయింది. మరి బిగ్ బాస్ 2కి సరైన `ఓపెనింగ్ వచ్చిందా?`
బిగ్ బాస్ 2 తొలి ఎపిసోడ్ దాదాపు రెండు గంటల పాటు సాగింది. 16 మంది కంటెస్టెంట్లను పరిచయం చేయడం, వాళ్లని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపడం పూర్తయింది. ఇక నుంచి అసలు ఆట మొదలవుతుంది. కాకపోతే… ఇప్పుడు అందరిదీ ఒక్కటే డౌటు. తొలి సీజన్‌లా ఈ సీజన్ వర్కవుట్ అవుతుందా? అంతలా రక్తి కట్టించే స్థాయి ఉందా? అనేదే అసలైన డౌటానుమానం. నానినే తీసుకోండి. బిగ్ బాస్ హోస్‌లోకి వెళ్లి హౌస్ చూపించడం వరకూ నాని బాగానే ఓన్ చేసుకున్నాడు. తన సినిమాలోని డైలాగులు గుర్తు చేస్తూ.. ఈజ్ చూపించాడు. అయితే అదంతా సింగిల్ టేక్ కాదు. షూటింగ్‌లానే.. కట్, ఓకే…లా జరిగి ఉండొచ్చు. స్టేజీపై నిలబడి కంటెస్టెంట్లని పరిచయం చేయడం, వాళ్లతో మాట్లాడడం, వాళ్లని బిగ్ బాస్ హోస్‌లోకి పంపడం వరకూ చూస్తే… నాని ఇంకా నేర్చుకోవాల్సింది, మెరుగవ్వాల్సింది చాలా ఉందనిపిస్తోంది.
ఇక కంటెస్టెంట్ విషయానికొస్తే.. ‘అబ్బ… వీళ్లొచ్చారా’ అని అదిరిపోవడానికీ, ఆశ్చర్యపోవడానికీ ఏం లేదు. ముమైత్ ఖాన్, ధన్ రాజ్, శివ బాలాజీ ఇలా పాపులర్ ఫిగర్లు కనిపించారు. అయితే బిగ్ బాస్ 2లో తేజస్వినిని మినహాయిస్తే… ఎగ్జయిటింగ్ ఫేసులు కనిపించలేదు. పైగా ఈసారి ముగ్గురు అన్ సెలబ్రెటీల్ని ‘సామాన్యుల’ కోటాలో తీసుకున్నారు. వాళ్ల వల్ల.. షోకి అదనంగా వచ్చే గ్లామర్ ఏమీ లేదు. తనీష్, గీతా మాధురిల పేర్లు ముందు నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి వాళ్ల విషయంలో ఎలాంటి షాకులూ లేవు. అమిత్ తివారీ, బాబు గోగినేని, శ్యామల, కౌశల్ రెడ్డి… వీళ్ల గురించి ప్రత్యేకంగా బిగ్ బాస్ షోలకు ఎడిక్ట్ అయ్యే ఛాన్సుల్లేవు. తొలి ఎపిసోడే కాబట్టి… ఇంకా అసలు డ్రామా మొదలవ్వలేదు కాబట్టి.. ఇప్పటికే ఈ షో గురించి ఓ నిర్ణయానికి రాలేం.కాకపోతే… బిగ్ బాస్ 1తో పోలిస్తే… బిగ్ బాస్ 2కి కిక్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. తేజస్విని, గీతామాధురి, తనీష్ లాంటి వాళ్లు కాస్త లీడ్ తీసుకొని, కాంట్రవర్సీలు చేస్తే తప్ప… బిగ్ బాస్ 2కి కళ రాదు. ‘ఏమైనా జరగొచ్చు’, ‘ఈసారి కాస్త మసాలా ఎక్కువ’ అంటూ నాని ఇస్తున్న హింట్లని బట్టి చూస్తే… మున్ముందు గేమ్ ప్లాన్ ఛేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఆట ఎంత రంజుగా ఉంటుందో చూడాలి.