ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధికారం చేపట్టిన కొత్తలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లపై సెటైర్లు వేసేవారు. శాలువాలు, జ్ఞాపికలు కప్పి రావడానికే ఢిల్లీ వెళ్తారని విమర్శించేవారు. ఆయన మాటలకు వైసీపీ సభ్యులంతా బిగ్గరగా నవ్వుతూ చప్పట్లు కొట్టేవారు. అయితే.. ఇప్పుడు బుగ్గనకు అంత కంటే దారుణమైన పరిస్థితి ఏర్పడింది. నెలలో రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లడం… ఏ కేంద్రమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే ఆయనను కలవడం… శాలువాలు కప్పి.. జ్ఞాపికలు అందించి.. తిరుపతి ప్రసాదాన్ని చేతిలో పెట్టి ఫోటోలు దిగడం కామన్ అయిపోయింది. మరోసారి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. పలువురు మంత్రుల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చినట్లుగా… వెళ్తున్నట్లుగా అక్కడి మీడియాకు.. ఇక్కడి మీడియాకు తెలియనివ్వడం లేదు. ఆయన ఏదైనా కేంద్రమంత్రి ఆఫీసు నుంచి బయటకు వచ్చినప్పుడు మీడియా కంట బడితే… అరె.. బుగ్గన ఢిల్లీకి వచ్చారే అని జర్నలిస్టులు తెలుసుకోవాల్సి వస్తోంది. ఒక వేళ.. అలాంటి పరిస్థితి లేకపోతే.. ఆయన కలిసిన కేంద్రమంత్రులు ట్వీట్ ద్వారా తెలుస్తుంది. బుగ్గన తాజాగా ఢిల్లీకి వెళ్లినట్లుగా… కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ ద్వారానే తెలిసింది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి .. మర్యాదపూర్వకంగా కలిశారని కిషన్ రెడ్డి ట్వీట్ చేయడంతోనే ఆయన ఢిల్లీలో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీ నెలా.. ఆయన ఢిల్లీకి రావడం.. .. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. అప్పులకు అనుమతుల కోసం కేంద్రమంత్రులకు అదే పనిగా విజ్ఞప్తులు చేయడం కామన్ అయిపోయింది. మొదట్లో మీడియాకు సమాచారం ఇచ్చేవారు. మరీ నామోషీ అనుకున్నారేమో కానీ ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.
మధ్యతరగతి జీవికి.. పదో తేదీ నుంచే నెలాఖరు ప్రారంభమవుతుందని చెప్పుకుంటాం. ఏపీ ప్రభుత్వానికి… అయితే.. ఇంకా ముందుగానే నెలాఖరు ప్రారంభమవుతుంది. సామాజిక పెన్షన్లు, జీతాలు, వడ్డీలు, రుణ చెల్లింపులు వంటి వాటి కోసం.. నెలకు రూ. పది వేల కోట్ల వరకూ ఒకటో తేదీకి సిద్ధం చేసుకోవాలి. ఈ మొత్తాన్ని పోగు చేసుకునేందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. అక్కడ నిధుల ప్రవాహం ఏమీ ఉండదు కానీ.. ఇప్పటికే పరిమితికి మించి పోయిన అప్పుల నిబంధనలను కాస్త తగ్గించి.. మరింత అప్పు చేసుకునే వెసులుబాటు కల్పించుకునేలా ఆయన లాబీయింగ్ చేసుకుంటున్నారు. సాధారణంగా ఆర్బీఐ … బాండ్ల వేలం ద్వారా తీసుకునే రుణమొత్తాన్ని… డిసెంబర్ వరకూ కొంత .. ఆ తర్వాత కొంత తీసుకునేలా సర్దుబాటు చేస్తుంది. డిసెంబర్ వరకూ చేయాల్సిన అప్పును ఏపీ సర్కార్ ఇప్పుడు చేసేసింది. అందుకే.. ఆ తర్వాత తీసుకోవాల్సిన అప్పును కూడా ఇప్పుడే తీసుకుంటామని.. అనుమతి ఇవ్వాలని ఢిల్లీలో బుగ్గన ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే బుగ్గనకు.. విషయ పరిజ్ఞానం ఉన్న మంత్రిగా పేరు ఉంది.కానీ ఆయనను ప్రభుత్వ వ్యహారాల్లో ఎక్కడా ఉపయోగించుకోవడంలేదు. చివరికి ఆర్థికశాఖ నిర్ణయాల్లోనూ ఆయన పాత్ర ఉండదు. కానీ.. అప్పుల కోసం మాత్రం ఆయనను వైసీపీ పెద్దలు గరిష్ట స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు.