సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళేది మీడియా. కంటెంట్ బావుంటే జనం ఆటోమేటిక్ గా చూస్తారని సాధారణంగా చెబుతుంటారు. అయితే ‘బావుంది’ అనే మాటని జనాల్లోకి తీసుకెళ్లడానికైనా మీడియానే కావాలి. మరి ఇంతటి కీలక పాత్ర పోషించే మీడియా సమయానికి సినీ రూపకర్తలు తగిన విలువ ఇస్తున్నారా? ఈ మాట సినీ జర్నలిస్ట్ ని అడిగితే ‘నో’ అనే సమాధానమే దాదాపుగా వస్తుంది.
సెలబ్రిటీలు మీడియా మీట్లకు చెప్పిన సమయానికి రారనే మాట ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వుంది. పది గంటలకు ఇంటర్వ్యూ చెప్పి.. మధ్యాహ్నం రెండు గంటలకు గానీ మొదలుకానీ సందర్భాలు అనేకం. ఈ నాలుగు గంటల మీడియా సమయం వృధా పోయినట్టే. ఈవెంట్ల వ్యవహారం ఇంకా తమాషాగా వుంటుంది. సాయంత్రం ఆరు గంటలకని చెప్పి ఎనిమిది, తొమ్మిదింటికి మొదలుపెడతారు. ఇక ఆ వేడుక ముగింపు అక్కడికి వచ్చిన గెస్టుల సంఖ్యమీద ఆధారపడి వుంది. ఈవెంట్ కి వచ్చిన అందరూ మైక్ టైసన్లు అయిపోతారు. ఒకవేళ పెద్ద హీరో సినిమా అయితే ఈవెంట్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి డేట్ మారిపోతుంది.
అయితే సమయాన్ని ఇంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్నప్పటికీ మీడియ సహనంతోనే వుంటుంది. ప్రతి సందర్భాన్ని, ఈవెంట్ ని కవర్ చేసి సినిమాకి తగిన ప్రచారం కల్పించడానికి ప్రయత్నిస్తుంది. అయితే రానురాను మీడియా సమయం పట్ల లెక్క నేనితనం మరింతగా కనిపిస్తుంది. అలాగే మీడియాతో ప్రవర్తించే తీరులోనూ అనుచితం ధ్వనిస్తుంది. ఈమధ్య కాలంలో యాంకర్ సుమ చేసిన కామెంట్స్ ఎంత వివాదమయ్యాయో తెలిసిందే. ఆ వివాదం తర్వాత సద్దుమణిగినప్పటికీ మీడియా విషయంలో సుమ ప్రవర్తించిన తీరు ముమ్మాటికీ అక్షేపణీయం.
మొన్నటికి మొన్న బిగ్ బాస్ ఫేం సోహెల్ తన సినిమా ఈవెంట్ లో చాలా ఆసువుగా ఓ కామెంట్ వదిలేశాడు. ‘మీడియా సమయం దాటిపోతుంది. త్వరగా ముగిద్దాం’ అని యాంకర్ అంటే.. ‘’పర్లేదు డిన్నర్ ఏర్పాటు చేశాం’’అని బదులు చెప్పాడు. ఆ ఈవెంట్ లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతినిధులు లేరేమో. ఆ కామెంట్ సరిగ్గా రిజిస్టర్ చేయలేదు. నిజానికి ఇది కూడా హద్దు దాటి చేసిన కామెంట్. మీడియాకి డిన్నర్ ఏర్పాటు చేస్తే చాలనే లెక్కలేనితనం ఆ మాటలో వుంది.
ఇంకొన్ని ఈవెంట్లు అయితే మరీ వింతగా విసుగు తెప్పించేలా జరుగుతాయి. ఉదాహరణకు.. తాజాగా జరిగిన హను-మాన్ కృతజ్ఞత సభ. ఈ ఈవెంట్ లో అండర్ లైన్ చేసుకొని చెప్పే ఒక విషయం వుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ వేదికపై దాదాపు 52 రెండు నిమిషాలు స్పీచ్ దంచికొట్టాడు. సుత్తివేలు స్టయిల్ లో చెప్పాలంటే.. అదొక ప్రోలాంగ్ హ్యామరింగ్. బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఒక దర్శకుడు తన సినిమా గురించి ఇంత సమయం నొక్కి వక్కాణించి వుండడు. ఈ సుదీర్ఘ ప్రవచనానికి మీడియా ప్రతినిధులు త్రివిక్రమ్ స్టయిల్లో.. అలా జేబులో చేయిపెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి. నిజానికి ఈ రేంజ్ లో మీడియా సమయాన్ని తినేయడం అవసరమా? అంటే ఖచ్చితంగా లేదు. కృతజ్ఞత సభలో అందరికీ థాంక్స్ చెప్పాలి అందులో తప్పులేదు. కానీ ఆ సినిమాలో పనిచేసిన అందరికీ గురించి ఆ వేదికపై స్టొరీలు చెప్పకూడదు. ఏం చెప్పినా వింటారులే అనే అలుసుతనం నుంచి వచ్చే వైఖరి ఇది.
నిజానికి ఇలాంటి లెక్కలేనితనానికి విసిగిపోయే చాలా మంది మీడియా ప్రతినిధులు ఈవెంట్స్ కి వెళ్ళడం మానేశారు. ఏ పెద్ద హీరో ఈవెంట్ వుంటే తప్పితే ప్రింట్, టీవీ, వెబ్ నుంచి ప్రముఖ ప్రతినిధులు కలసికట్టుగా హాజరైన సందర్భాలు వుండవు. ప్రెస్ నోట్, వీడియో కంటెంట్ పీఆర్వో నుంచి ఎలాగూ వస్తుంది. దీని కోసం ఈవెంట్లు వరకూ వెళ్లి సుధీర్గ ప్రవచనాల బారిన పడటం ఎందుకని చాలామంది లైట్ తీసుకుంటారు. ఇక చిన్న సినిమాల ప్రెస్ మీట్లకైతే యూట్యూబ్ ఛానల్ యాంకర్లని, కోఅర్దినేటర్లనే జర్నలిస్ట్ లుగా చెలామణి చేయించేస్తుంటారు పీఆర్వోలు. మరి ఈ పరిస్థితి ఎందుకంటే మీడియా సమయాన్ని దారుణంగా తినేయడమే దీనికి కారణం.
నిజానికి ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. మీడియాని, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. మీడియా అనేది వారధిలా పని చేస్తుంది. మీడియా సమయానికి విలువ ఇచ్చి దాని ద్వారా అవసరమైన మంచి విషయాన్ని కమ్యునికేట్ చేయాలి. సినిమా కంటెంట్ ఏమిటి, ప్రేక్షకులకు ఎందుకు చూడాలి ఇలాంటి ముఖ్యమైన అంశాలని జనాల్లోకి తీసుకెళ్లడం ద్రుష్టి పెట్టాలి. అంతేకానీ ఒక ఈవెంట్ ని నాలుగేసి గంటలు పాటు నిర్వహించి, మీడియా టైంని లాక్ చేసి, పాడిందే పాడరా అనే ప్రవచనాల క్యాసెట్టు వేయడంలో సినిమాకి వచ్చిన లాభం ఏమీ లేదనే సంగతి గుర్తుంచుకోవాలి.