అంతా నేనే.. అన్నీ నేనే..సర్వం తానే.. ఇదీ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి. 2004 వరకూ స్థితప్రజ్ఞతనూ, అనుభవాన్నీ రంగరించి, రాష్ట్రాన్ని పాలించిన బాబును తదుపరి ఎన్నికలలో ఓటమి పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉంచింది. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనలు..వేసిన సెటైర్లు ఎవరూ మరిచిపోలేదు. 2014లో పవన్ కల్యాణ్ దయతో అధికారంలోకి వచ్చిన తరవాత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అండ చూసుకుని చెలరేగిపోవడం ప్రారంభించారు. నవ్యాంధ్ర అభివృద్ధికి ఆయన చేసిందేమైనా ఉందీ అంటే కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య సారవంతమైన 33 వేల ఎకరాల భూములను సేకరించడం. ఇదంతా రాజధాని నిర్మాణానికి అంటున్నారాయన. రాజధాని నిర్మాణానికే అయితే విదేశీ సంస్థలకు వాటిలో అధిక భాగాన్ని కట్టబెట్టడమెందుకనే విషయంపై ఆయన వద్ద సమాధానం లేదు. ఈస్టిండియా కంపెనీ వ్యాపారం పేరిట భారత్‌లోకి ప్రవేశించి, 200 సంవత్సరాల పాటు దోచుకున్న వైనం తెలుసుండి కూడా… ఇప్పుడు సింగపూర్‌కూ ఈ భూములలో భాగం ఇవ్వడం దేనికి సూచికో ఆయన తెలుసుకున్నట్లు లేదు. చంద్రబాబు చెబుతున్నట్లు నవ్యాంధ్ర 2050 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగినా దానిమీద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అదుపు ఉంటుందా అనేది సందేహమే. రాజధానిలో 49 శాతం భూమిపై హక్కులు పొందిన సింగపూర్ లేదా విదేశీ సంస్థలదే రాష్ట్రంపై కూడా ఆధిపత్యమవుతుంది. ఇది ఏపీ ప్రజల పాలిట శరాఘాతమే కాగలదు.
హైటెక్ సిటీ నేనే కట్టా.. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశా.. సత్య నాదెళ్ళకూ నేనే స్ఫూర్తి..హుద్‌హుద్ తరవాత విశాఖను నేనే అందంగా తీర్చిదిద్దా..అమరావతి నిర్మాణానికి నేనే చొరవచూపా.. పట్టిసీమ నేనే కట్టా.. పోలవరాన్నీ నేనే కడుతున్నా…నంటూ అంతే తానే అన్నట్లు మాట్లాడుతున్న చంద్రబాబుగారు అసలు ఆలోచిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఇదంతా ఓట్లు వేసి గెలిపించిన తరవాత ప్రజా ధనంతో చేసిన పనులని ఆయన మరిచిపోతున్నారు. ప్రజాధనాన్ని ప్రజాకర్షక విధానాలకు విచ్చలవిడిగా ఖర్చు చేయడం వృధా కాదా అనేది యోచించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ అట్టహాసాలు రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడతాయి. నెంబర్ వన్‌గా రాష్ట్రం నిలవచ్చు.. కానీ ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. నెంబర్ వన్ అనిపించుకోవడం తప్ప. ప్రభుత్వ అధినేతలు వారి చుట్టూ ఉండే వందిమాగధులు బాగుపడతారు తప్ప నిరుపేదకు మిగిలేది.. ప్రజాకర్షక పథకాల పేరుతో విదిల్చే సబ్సిడీలు మాత్రమే. చెట్టు కింద అసెంబ్లీ నిర్వహించుకుంటామన్న ఆసామీ ఏం చేశారు? లగ్జరీ హొటళ్ళలో ఏసీ గదులలో మీటింగులు.. టెలికాన్ఫరెన్సులు నిర్వహించుకుంటున్నారు. ఆయన కోసం మూడు చోట్ల క్యాంపు కార్యాలయాలు, అధునాతన సౌకర్యాలతో నివాసాలు ఏర్పరచుకున్నారు. ముఖ్యమంత్రి నిర్వహించే అధికారిక సమావేశాలలో స్నాక్స్‌కు ఖర్చెంతపెడుతున్నారో ఎప్పుడయినా ఆలోచించారా? రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం వాటిని త్యజించగలిగారా? ప్రజలకు కనీసం మంచినీరందదు.. సమావేశాల్లో మాత్రం మినరల్ వాటర్ తాగుతూ కనిపిస్తారు. ప్రజలు బయటకెళ్ళేటప్పుడు నీటికి అనవసరంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఇంటినుంచి సీసాలో మంచి నీరు తీసుకెడతారు. ఏనాడైనా అధికారంలో ఉన్నవారు ఈ విషయం ఆలోచించారా. అధికారిక సమావేశాల్లో మంచినీటి కోసం చేసే ఖర్చు ఎంతో తెలుసుకుంటే చాలు.. ప్రజా ధనాన్ని ఎలా దుబారా చేస్తున్నది తెలుస్తుంది.
తాజాగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. దేశంలో ఉన్న రాజకీయ నాయకులలో తానే సీనియర్‌నని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు 1980లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన అమితంగా ఇష్టపడే వెంకయ్య నాయుడు 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. మన రాష్ట్రం వరకూ తీసుకున్నా ఈ ఒక్క అంశమే ఆయన మాటల్లోని డొల్లతనాన్ని వెల్లడిస్తుంది. రాష్ట్రానికి సిఇఓగా మారి, చక్కటి పరిపాలన అందించిన చంద్రబాబు లాంటి విజ్ఞుడు మాట్లాడాల్సిన మాటలు ఇవి కావు. నేనే గొప్ప.. నేనే చేశాను.. అంతా నేనే అని చెప్పుకోవడం మాని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం మాని, ఆ పని చేసింది తానేనని చెప్పుకుంటే అందరూ హర్షిస్తారు. పన్నుల రూపంలో ప్రజలనుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న ధనాన్ని ప్రజాకర్షక పథకాలకూ..సొంత అవసరాలకూ.. రాజకీయ ప్రయోజనాలకూ వినియోగించడం మానాలి. అప్పుడే ఏ ప్రభుత్వాధినేత చెప్పిన విషయాలైనా నమ్మశక్యంగా ఉంటాయి.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి