ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా హై ప్రోఫైల్ ప్రమాదం జరిగితే ముందుగా… భారీగా నష్ట పరిహారం ప్రకటించడానికి ఉత్సాహపడుతోంది. ముందూ వెనుక ఆలోచించకుండా.. ఎంత మంది చనిపోయారో తెలియకుండానే.. ఆ ప్రమాద వార్త హైలెట్ అవుతూండగానే పరిహారం ప్రకటిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ఇవ్వగా… స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలోమృతి చెందిన వారికి.. రూ. 50 లక్షలు ప్రకటించేశారు. నిజానికి ఆ రెండూ వంద శాతం ప్రైవేటువి. తప్పిదాలు కూడా వాళ్లవే. కానీ ప్రజల సొమ్ము మాత్రం పరిహారంగా పంపిణీ అవుతోంది.
స్వర్ణ హోటల్, రమేష్ ఆస్పత్రి యాజమాన్యాలకు అండగా నిలిచారా..?
స్టార్ హోటల్ నడుపుతున్న స్వర్ణా హోటల్ యాజమాన్యం కానీ.. దాన్ని లీజుకు తీసుకున్న రమేష్ ఆస్పత్రి కానీ కనీస నిబంధనలు పాటించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క ద్వారం మాత్రమే ఉండటం.. ఫైర్ సేఫ్టీ సహా ఏ ఒక్క నిబంధనల పాటించలేదని తీరిగ్గా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తక్షణం స్పందించి.. వారిపై చర్యలు తీసుకోవాలి. బాధితులకు ఏమైనా పరిహారం ఇప్పించాలంటే.. అది వారి వద్ద నుంచే ఇప్పించాలి. వారిని చట్ట ప్రకారం శిక్షించాలి. కానీ ప్రభుత్వం మాత్రం.. అనూహ్యంగా స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ప్రజాధనం పరిహారంగా ప్రకటించేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ ఘటన జరిగితే.. ఖచ్చితంగా సాయం చేయాల్సిందే. కానీ ఇక్కడ జరిగింది వేరు. ప్రభుత్వం.. సరైన ప్రమాణాలు పాటించని వాటికి అనుమతులు ఇచ్చేసిన విషయం బయటకు వస్తుందో.. మరో కారణమో కానీ.. ఆ విషయం మరుగున పర్చడానికి చేసినట్లుగా… భూరి నష్టపరిహారం ప్రకటన చేసేశారు.
సంస్థలు ప్రైవేటువి.. తప్పులూ వాళ్లవే.. మరి ప్రజల సొమ్ముకెందుకు టెండర్..?
ఎల్జీ పాలిమర్స్ అయినా… స్వర్ణ ప్యాలెస్ అయినా.. రెండూ ప్రైవేటువే. ప్రభుత్వం ప్రమాణాలు లేకపోయినా అనుమతులు ఇచ్చి తప్పు చేసింది. ప్రభుత్వంలో ఉన్న వారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల .. వారు తాము నిబంధనలేమీ పాటించాల్సిన అవసరం లేదని అనుకున్నారు. ఆ ఫలితమే… ఇప్పుడు ప్రమాదాలు. అంటే సంస్థలు వారివే.. తప్పులూ వారివే. కానీ ఇక్కడ ప్రజాధనానికి మాత్రం టెండర్ పడుతోంది. తప్పు చేసిన వారిని శిక్షించడం… నష్టపోయిన వారికి వారి నుంచే నష్టపరిహారం ఇప్పించడం… జరగాల్సిన చోట… ప్రభుత్వం ప్రజా ధనాన్ని పరిహారంగా ఇచ్చేస్తోంది. అక్కడే తేడా వస్తోంది.
ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించి ఉంటే ఈ సమస్యలు వచ్చేవా..?
స్వర్ణా ప్యాలెస్ యజమానికి . . ముఖ్యమంత్రి సహాయనిధికి.. తోటి వ్యాపారులతో కలిసి రూ. కోటి విరాళం ఇచ్చి ఫోటో దిగారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో ఇంకా డీప్ సంబంధాలున్నాయని.. టీడీపీ ఆరోపిస్తూ ఉంటుంది. వ్యాపారం ఇతర అవసరాల వల్ల.. ప్రభుత్వంలో ఉన్న వారితో .. సన్నిహితంగా ఉంటూ.. ఇలాంటి వారంతా నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ఫలితంగా.. ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం.. ప్రభుత్వ పెద్దలు.. చట్టాలను చట్టాలుగానే అమలు చేస్తే… ఇప్పుడు ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు కదా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ఏపీ సర్కార్.. వీటన్నింటినీ వినిపించుకునే అవకాశం లేదు. ప్రమాద స్థాయిని బట్టి ప్రజాధనం పరిహారాన్ని ప్రకటించేసి.. కవర్ చేయాలనుకుంటోంది.