ఆంధ్రప్రదేశ్లో మహిళలు, ఆడపిల్లలపై ఏపీలో దాడులు పెరిగిపోతున్నాయి. పట్టపగల నడిరోడ్డుపై అమ్మాయిల్ని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం అంటూ పొగడ్తలు కురిపించి ఆ పేరుతో తయారైన శకటానికి మొదటి బహుమతి ప్రదానోత్సవం చేస్తున్న సమయంలోనే అక్కడికి ఓ ముఫ్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరులో ఓ యువకుడు… మరో యువతిని నడి రోడ్డుపై కత్తితో పొడుస్తున్నాయి. ఒక్కరంటే ఒక్కరు అడ్డుకోలేదు. పోలీసుల జాడే లేదు. స్థానికుల్లో చలనం లేదు. అలా ఆ యువతి ప్రాణం గాల్లో కలిసిపోయిది.
దిశ చట్టం ఎక్కడుంది..? ఆ చట్టం కింద ఎలా శిక్షిస్తారు..?
అంతా జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకూ అందరూ దిశ చట్టం ప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అసలు దిశా చట్టం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆ చట్టం ఇంత వరకూ ఆమోదం పొందలేదు. కేంద్రం వద్దనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. లేదు … కొన్ని అనుమానాలు క్లియర్ చేయమని రాష్ట్రానికే పంపామని కేంద్రం చెబుతోంది. ఈ చట్టం ఎవరి వద్ద ఉన్నా అధికారికంగా మాత్రం రాష్ట్రపతి సంతకం చేయలేదు. అందుకే ఆ చట్టం అమల్లోకి రాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి..?. ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ పాలకులు ఎందుకో దిశా చట్టం భజన చేస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు. లేని చట్టాన్ని ఉందన్నట్లుగా ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడల్లా చెబుతూ ఉంటారు. దీంతో ప్రజల్లో అయోమయం ఏర్పడే పరిస్థితి ఉంది.
ఎంత ప్రచారం చేసుకున్న నేరగాళ్లకు అంత ధైర్యం ఎలా వస్తోంది..?
గుంటూరులో ఇలా నడిరోడ్డుపై ప్రేమోన్మాదులు నడిరోడ్డుపై హత్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో శ్రీలక్ష్మి అనే యువతిని కాలేజీలోనే నరికి చంపిన ఉదంతాలు ఉన్నాయి. అప్పట్నుంచే కాదు.. అంతకు ముందు నుంచీ ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు వస్తున్నాయి. పోతున్నాయి. కానీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కఠినంగా ఉండే ప్రభుత్వాలు వచ్చినప్పుడు నేరగాళ్లలో కాస్తంత భయం ఉండేది కానీ కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు… పరస్థితి మరీ దారుణంగా మారిపోతోంది. నేరగాళ్లకు అసలు భయమనేదే లేకుండా పోతోంది
పోలీసులు పని పోలీసులు చేస్తున్నారా..?
సాక్షాత్తూ డీజీపీ ఈ ఘటనను రాజకీయంగా చూడవద్దని చెబుతూండటం ఏపీలోనే కనిపిస్తోది. రాజకీయ నేతలు రాజకీయం చేస్తారు. అది వారి పని. ఏం జరిగినా రాజకీయం చేస్తారా లేదా.. మరొకటి చేస్తారా అన్నది తరవాత సంగతి … అది పోలీసులకు అనవసరం . కానీ డీజీపీ ఆ అమ్మాయిని హత్య చేయడం కన్నా.. దాని మీద విపక్షాలు ప్రభుత్వంపై ఎక్కడ విమర్శలు చేస్తాయోనని ఆందోళన చెందడం ఎక్కువైపోయింది. పోలీసులు తమ విధులు మానేసి… డీజీపీ సహా అందరూ… ప్రభుత్వానికి ఊడిగం చేయడం వల్లనే పరిస్థితులు ఇలా దిగజారుతున్నాయనేది ప్రతి ఒక్కరి భావన. ఈ విషయంలో మహిళల రక్షణకు కావాల్సింది మభ్య పెట్టే దిశ కాదు.. సంకల్పం.