భూములు అమ్మితే ఎకరానికి పది కోట్లు వస్తుందని ప్రభుత్వం ఆశ పడుతోంది. వందల ఎకరాలు వేలం వేసి వేల కోట్లు సంపాదించాలనుకుంటోంది. అదే సమయంలో అమరావతిలో కట్టిన భవనాలను లీజుకు ఇచ్చి వందల కోట్ల ఆదాయం కళ్ల జూడాలనుకుంటోంది. ఒక్క టవర్ను అద్దెకిచ్చి ఏటా రూ. పది కోట్ల వరకూ ఆదాయం అంచనా వేసుకుంటోంది. అమరావతిలో ప్రభుత్వానికి ఇప్పుడు కళ్ల ముందు కాసులే కనిపిస్తున్నాయి.
అమరావతి విలువ చాలా ఎక్కువనుకుంటున్న జగన్ సర్కార్ !
ఎకరం రూ. పది కోట్లు అంటే అన్న విషయం కాదు. హైదరాబాద్ శివారులో ఆ మాత్రం రేటు ఉంటుంది. ఏపీలో ఎక్కడైనా ఎకరం రూ. పది కోట్లు ఉండే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం మాత్రం అమరావతిలో రూ. పది కోట్లకు ఎకరం అమ్మాలనుకుంటోంది. ఇటీవల నవులూరులో లేఅవుట్ ప్రభుత్వం వేసి అమ్మకానికి పెట్టింది. భారీగా ధరలను నిర్ణయించింది. దాంతో ఎవరూ ముందుకు రాలేదు. అవన్నీ చిన్న చిన్న నివాస ప్లాట్లు. అయితే కొంత మంది కొనుగోలు చేశారు. అయినా ప్రభుత్వం అమరావతి చాలా ఎక్కువగా భావించి ముందుకెళ్తోంది. పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయని ఊహించుకుంటోంది.
నిర్వీర్యం చేస్తనే ఈ ధరలు – అదే కట్టి ఉంటే?
మూడేళ్లలో అమరావతి నిర్వీర్యం అయిపోయింది. అసలు పనులు చేయకపోవడం వేరు. అమరావతిని పెకిలించేప్రయత్నం చేయడం వేరు . ప్రభుత్వం అదే చేసింది. మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారు. ప్రభుత్వం అమరావతిని గుర్తించే అవకాశం లేకపోవడంతో ఎవరూ పెట్టుబడులు పెట్టలేదు. పెట్టడానికి వచ్చినా ప్రభుత్వం రానివ్వలేదు. ఈ కారణంగా అమరావతి విలువ దారుణంగా పడిపోయింది. దీంతో అందరూ నష్టపోయారు. అక్కడ పనులు జరుగుతూ ఉంటే.. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వేల కోట్ల ఆదాయం వచ్చేది సంపద పెరిగేది. కానీ ప్రభుత్వ తీరు వల్ల ఆదంతా రాష్ట్రం.. రాష్ట్ర ప్రజలు కోల్పోయారు.
వైసీపీ సర్కార్ తీరు వల్ల ప్రజలకు రూ. పది లక్షల కోట్ల నష్టం !
అమరావతిని ఆపకుండా కనీసం కట్టకపోయినా.. అమరావతే రాజధానిగా ఉంటుందన్న ఓ నమ్మకాన్ని ప్రజలకు కలిగించి ఉంటే… ఇప్పటికి రాష్ట్ర భవిష్యత్ ఉజ్వలంగా ఉండేది. ప్రభుత్వానికి.. ప్రజలకు కనీసం రూ. పది లక్షల కోట్ల సంపద అంది ఉండేది. ఈ విషయాన్ని వైసీపీకి చెందిన ప్రఖ్యాతి గాంచిన ఆడిటర్ విజయసాయిరెడ్డే గతంలో ప్రకటించారు. ప్రణాళిక ప్రకారం అమరావతిని అభివృద్ధి చేస్తే..రూ. పది లక్షల కోట్లు వస్తాయని.. అవి పోతాయనే చంద్రబాబు యాగీ చేస్తున్నారని గతంలో ఆరోపించారు. అయితే ఆ మొత్తం చంద్రబాబుకు వస్తాయని వారు ప్రచారం చేశారు.. నిజంగా అమరావతి అభిృవృద్ది చెందితే.. వచ్చేది ప్రభుత్వానికే. అంటే ప్రజలకే.
అదే అమరావతి పీక నొక్కకపోయి ఉంటే !?
రూ. పది లక్షల కోట్లు అంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… అత్యంత భాగ్యవంతమైన రాష్ట్రాల్లో ఒకటిగా మారిపోతుంది. ఆదాయం ప్రకారం చూసుకుంటే.. పదేళ్ల రాష్ట్ర ఆదాయం. రూ. పది లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ సంపద అభివృద్ధి చెందితే.. రూ. లక్ష కోట్ల పెట్టుబడి.. అసలు లెక్కే కాదు. ఈ విషయం వ్యాపారాల్లో రాటుదేలిపోయిన విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లకు తెలియక కాదు. సంక్షేమ పథకాలకు డబ్బుల లోటు ఉండేది కాదు. ఇంకా ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి ఉండేవారు. అయితేఅమరావతి తరలిస్తే ఎంత నష్టమో.. వైసీపీనేతలకు.. ప్రభుత్వ పెద్దలకు తెలియనిది కాదు. అయినప్పటికీ.. సొంత రాష్ట్ర ప్రయోజనాలను.. నిర్వీర్యం చేయడానికి… రూ. పది లక్షల కోట్ల సంపదను.. హారతి కర్పూరం చేయడానికి వారు సిద్ధమయ్యారు. కానీ ఇప్పుడు వారిని నిర్వీర్యం అయిపోయిన అమరావతే ఆదుకోవాల్సి వస్తోంది.