చదవేస్తే ఉన్న మతి పోయిందంటారు. ఇప్పుడు దేశ ప్రజల పరిస్థితి అలాగే ఉంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అసలేం జరుగుతుందో అంచనా వేయలేకపోతున్నారు. కళ్ల ముందు జరుగుతున్న దాన్ని… కులం, మతం, ప్రాంతం, అధికారం,జాతీయవాదం ఇలా అభౌతిక అంశాలతో చూసుకుని ఒకరినొకరు కించ పర్చుకుంటున్నారు. తుపాకీ ఎవరి చేతుల్లో ఉంటే వారి వాదం కరెక్ట్…! అలాగే అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారి చెప్పిందే వేదం..!. చేతుల్లో తుపాకీ ఉన్న వాళ్లనయినా… అధికారం అపరిమితంగా అనుభవిస్తున్న వారికైనా ఎదురు చెప్తే ఏమవుతుంది..? వారి నిర్ణయాలను ప్రశ్నిస్తే ఏమవుతుంది..? . అల్ల కల్లోలం అవుతుంది.. బతుకు బుగ్గి అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్ని ఎదిరించడానికి గతంలో ప్రజలు గుండెలు చూపిస్తూ ముందుకు ఉరికేవారు. కానీ ఇప్పుడు భయంతో కలుగుల్లో దాక్కుంటున్నారు. కళ్ల ముందు ఎంత అన్యాయం జరుగుతున్నా…మాకెందుకులే అనే మానసిక స్థితికి చేరిపోయారు.
భయమే ఆయుధంగా బండి లాగుతున్న అధికారం..!
ఢిల్లీ పాలకులు ప్రతిపక్ష నేతల్ని, రాష్ట్ర ప్రభుత్వాల్ని భయపెట్టి నోరు తెరవకుండా చేస్తున్నారు. రాష్ట్ర పాలకులు అదే సూత్రంతో రాష్ట్ర ప్రతిపక్ష నేతల నోరు నొక్కేస్తున్నారు. కింది స్థాయి అధికార , పార్టీ యంత్రాంగం ఆ బాధ్యతను ప్రజల విషయంలో తీసుకుంది. అతిమంగా ఇప్పుడు దేశంలో ఎవరూ నోరు ఎత్తడం లేదు. నోరెత్తి పోరాడుతున్న వారికి మద్దతు ఇవ్వడం లేదు. అందరూ ఓ రకమైన భయంతో బతుకుతున్నారు. స్వేచ్చగా బతికే ఏమవుతుందోనని భయం.. భయంగా బతుకుతున్నారు. వాక్ స్వాతంత్రం అన్నది అధికారంలో ఉన్న వారికి మాత్రమే అన్నట్లుగా మారిపోయింది. అన్యాయాలపై పోరాడటం అంటే కొరివితో తలగోక్కోవడం అన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. ఎలాగోలా బతకడం నేర్చుకోవడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇప్పుడు దేశంలో ఏం జరుగుతున్నా.. చివరికి పక్కనే పిడుగు పడినా ప్రజలు ఎవరూ లెక్క చేయడం లేదు. తల వంచుకుని తమ దారిన తాము పోతున్నారు. దాని కోసం వారి కారణాలు వారు వెదుక్కుంటున్నారు. తమకేమీ సంబంధం లేదని సర్ది చెప్పుకుంటున్నారు.
ఢిల్లీ రైతుల పోరాటం సిక్కుల కోసమేనా..!?
దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతుందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఎంత పెద్ద ఉద్యమం జరుగుతుందో దేశంలోని మీడియా చూపించడం లేదు. కానీ ఢిల్లీ శివార్లలో కొన్ని లక్షల మంది ఉన్నారు. వారికి రాత్రి లేదు.. పగలు లేదు. ఎండ లేదు చలి లేదు. వారు అక్కడే ఉన్నారు. దొరికిందేదో తింటున్నారు. రోడ్ల మీదే పడుకుంటున్నారు. వారు ఎంత పెద్ద ఎత్తున ఉన్నారో ఏ మీడియా చూపించలేదు. వారు ఎందుకు పోరాడుతున్నారో కూడా విశ్లేషించడం లేదు. దేశ ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. అదేదో సిక్కు రైతుల బాధ అన్నట్లుగా ఉండిపోతున్నారు. వారు పోరాడుతోంది వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా. అవి దేశం మొత్తం అమల్లోకి వస్తాయి. మిగతా ప్రాంతాల్లోని రైతులు ఎందుకు రోడ్ల మీదకు రావడంలేదు. తమ కోసం పోరాడుతున్న రైతులు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు…?. దీన్నే కారణంగా చూపి.. సిక్కు రైతులది .. కేవలం ఆందోళన మాత్రమేనని… వ్యవసాయ చట్టాలకు అందరి ఆమోదం ఉందని ప్రచారం చేస్తున్నారు. కానీ నిజం ఆ చట్టాలపై రైతులందరిలోనూ ఆందోళన ఉంది. కానీ బయటకు రావడానికి భయపడుతున్నారు. అది ప్రభుత్వాల మీద భయం. బయటకు వస్తే ఇప్పటికే సాగును నిర్వీర్యం చేసి .. ఇస్తున్న అరకొర సాయం కూడా ఆపేస్తారేమోనన్న భయం. పోలీసు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతారేమోనన్న భయం. అందుకే ఎవరూ బయటకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితిని పాలకులు కల్పించారు. ఎవరైనా రైతుల పోరాటానికి మద్దతు తెలిపితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో… కొన్ని ట్వీట్లపై జరుగుతున్న రాజకీయం కళ్ల ముందు కనిపించేలా చేస్తోంది.
అన్యాయం జరిగినా నోరెత్తలేనంత నిస్సహాయత..!
రైతుల ఆక్రందనలు సంగతి సరే.. సొంత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నా.. ఎవరైనా స్పందించారా..?. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. కేంద్ర బడ్జెట్ అంటే రాష్ట్రాలకే ఖర్చు పెట్టాలి. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలి. కానీ ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదు. కానీ ఒక్కరంటే ఒక్క పాలకుడు.. ఒక్క ప్రతిపక్ష నేత అయినా గొంతెత్తారా..? ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంతో పెట్టుకుంటే మంచిది కాదని భావించిన తెలుగు రాష్ట్రాలు కేంద్రంతో రాజీపడ్డాయి. కేంద్రంతో సఖ్యతగా మెలుగుతున్నందున బడ్జెట్లో తమకు కాస్తోకూస్తో మంచే జరుగుతుందని భావించారు కాని ఊహించని రీతిలో మోదీ సర్కారు హ్యాండ్ ఇచ్చింది. మరి తమకు రావాల్సిన వాటి కోసం తెలుగు రాష్ట్రాలు కేంద్రంతో పోట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే.. పోట్లాడితే ఏమవుతుందో ఇప్పటికే కళ్ల ముందు కనిపిస్తోంది. అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. అందుకే పోరాడటం మర్చిపోయి… ప్రశాంతంగా బతికేద్దామనుకుంటున్నారు.
పన్నులు బాదేస్తున్నా ప్రజల్లో కదలిక ఏది..?
ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నా… పన్నులు బాదేస్తున్నా ప్రజల్లో కదలిక రావడం లేదు. ఏం చేసినా సరే భరిస్తామన్నట్లుగా వారి తీరు మారిపోయింది. అందుకే పెట్రోల్, డీజిల్పై రోజుకు పావలా వంతున పెంచుకుంటూ పోతున్నా .. స్పందన లేదు. లాక్ డౌన్ తరవాత పెట్రోల్ రేటు పదిహేను రూపాయలు పెరిగినా ప్రజలు ఎవరూ… పట్టించుకోవడం లేదు. ఎదురు తిరిగితే… ఎక్కడ ఉన్నది కూడా ఊడిపోతుందన్న భయమే దీనికి కారణం. అంటే ఓ రకమైన జడత్వం ప్రజల్లో ఆవరించి పోయింది. ఎలాగోలా బతికేయడమే మంచిదన్న భావనకు వచ్చేశారు. ఫలితంగా ఉద్యమాల గడ్డల మీద జనం కూడా ఇప్పుడు తలొంచుకుని వెళ్లిపోతున్నారు. ప్రభుత్వాల నిర్ణయాలను ప్రశ్నించలేనంత నిస్సహాయ స్థితికి వెళ్లిపోతున్నారు. ఎవరు అధికారం ఉంటే వారు చెప్పేది కరెక్ట్ అన్న భావనకు వచ్చేసి… బతికేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇప్పుడు అన్యాయాలపై పోరాటాల్లేవు. అక్రమాలపై ఉద్యమాల్లేవు.
ప్రభుత్వాలకు తాత్కాలిక లాభం.. దేశానికి నష్టం…!
ప్రజల్ని నిర్వీర్యం చేస్తున్న పాపం ప్రభుత్వాలదే. తాము చేస్తున్నదే కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఎంత కైనా తెగిస్తున్నారు. తమ నిర్ణయాలను తప్పు పడితే.. సహించలేకపోతున్నారు. భిన్నాభిప్రాయం వినిపిస్తే ఎంతకైనా తెగిస్తున్నారు. కానీ దాని వల్ల దేశానికి ఎంత నష్టం జరుగుతుందో ఊహించలేకపోతున్నారు. ప్రజల్లో పోరాడే శక్తి సన్నగిల్లిపోతోంది. బానిస మనస్థత్వంతో బతకడానికి అలవాటు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ప్రభుత్వాలకు తాత్కాలికంగా లాభం చేయవచ్చు కానీ.. దీర్ఘ కాలంలో దేశానికి నష్టం చేకూరుతుంది. చైతన్యవంతమైన సమాజం ఉన్నప్పుడే.. ప్రజలు ముందుకెళ్లగలుగుతారు. అన్యాయాలపై ప్రశ్నించే ధైర్యం ప్రజల్లో ఉన్నప్పుడే.. ఎవరైనా అన్యాయం చేయడానికి భయపడతారు. అలాంటి పరిస్థితి లేకపోతే… ఎవరు అధికారంలో ఉంటే వారితే రాజ్యం.. వీర భోజ్యం అవుతుంది. ఇప్పటికే అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చదువు లేనప్పుడే చైతన్యం ఎక్కువ..!
ఒకప్పుడు దేశంలో అభ్యుదయభావాలు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో దేశంలో అక్షరాస్యత శాతం తక్కువ. కుల రక్కసిపై పోరాటాలు సాగాయి. మూఢ నమ్మకాలపై యుద్ధాలు ప్రకటించారు. అన్యాయాలకు ఎదురొడ్డి నిలబడ్డారు. సమాజం కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది.కానీ… అప్పట్లో ఉన్న అభ్యుదయ భావాలేమీలేవు. ప్రతీ దానికి మాకేం సంబంధం అనుకునే పరిస్థితి వచ్చింది. ఏం జరిగినా అది మన కులం.. మన మతం.. మన ప్రాంతం అంటూ… విభజనకు గురవుతున్నారు. ఫలితంగా విభజించు పాలించు అనే సూత్రం పాటిస్తున్న రాజకీయ నేతల చేతుల్లో పావులవుతున్నారు. ఈ విషయం ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే మళ్లీ దేశానికి మంచిరోజులొస్తాయి.