తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూతపడడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిజానికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు వస్తుందన్న భయం, ఆందోళన అందరిలోనూ ఉంది. అది ఒక్కసారిగా నిజమయ్యేసరికి అవాక్కయ్యారు. నిజానికి నెల రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకోవాల్సివుంది. ఐపీఎల్ ప్రారంభంలోనే థియేటర్లు క్లోజ్ చేయాలని అనుకొన్నారు. కానీ… నిర్మాతలపై ఎక్కడో ఓ చోట నమ్మకం. వేసవి సీజన్‌ని వదులుకోవడం ఎందుకని, కచ్చితంగా ఏదో ఓ పెద్ద సినిమా వస్తుంది, మళ్లీ థియేటర్లు కళకళలాడతాయని యాజమాన్యాలు భావించాయి. కానీ అలా జరగలేదు. పైగా ఈ సీజన్‌ని చిత్రసీమ పూర్తిగా గాలికి వదిలేసింది. అందుకే థియేటర్ యజమానులు ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది.
ఈ విషయంలో నిర్మాతలదే తప్పంటూ నిందిస్తున్నారంతా. వేసవి సీజన్‌ని సరిగా క్యాష్ చేసుకోకపోవం ముమ్మాటికీ తప్పే. అయితే అందులో హీరోల వాటా కూడా లేకపోలేదు. `నా సినిమాని ఫలానా సీజన్లోనే విడుదల చేయాలి` అని హీరోలు ముందే నిర్మాతలకు అల్టిమేట్టం జారి చేస్తున్నారు. దిల్ రాజు లాంటి సీనియర్ నిర్మాతల గురించి కాదు కానీ, చిత్రసీమకు అప్పుడే వచ్చినవాళ్లూ, కొత్తగా అడుగులేస్తున్నవాళ్లూ హీరోల ఆజ్ఞల్ని పాటించాల్సిందే. లేదంటే నెక్ట్స్ సినిమా ఉండదు. సదరు సినిమాకు హీరో వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ రాదు. అందుకే నిర్మాతలూ రిస్క్ చేయరు.
హీరోలు కూడా వస్తే సంక్రాంతి, లేదంటే దసరా అంటూ లెక్కలేసుకొంటున్నారు. సంక్రాంతి పెద్ద సీజనే. అలాగని ఐదారు సినిమాలు రావాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలు వేసవికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఎలాంటి నష్టమూ ఉండదు. కానీ హీరోలంతా మొండిపట్టు పట్టుకొని కూర్చుంటారు. సంక్రాంతి తప్ప వేరే సీజన్లేనట్టు, అప్పుడే సినిమాల్ని విడుదల చేయాలనుకొంటారు. దాంతో… సంక్రాంతి పోటీ అయితే పెరుగుతోంది కానీ, మిగిలిన సీజన్లు డల్ అయిపోతున్నాయి. హీరోలు స్పీడుగా సినిమాలు చేయడం కూడా నేర్చుకోవాలి. పాన్ ఇండియా, క్రేజీ కాంబినేషన్లు అంటూ యేళ్ల తరబడి తమ ప్రాజెక్టుల్ని సాగ దీస్తున్నారు. దాంతో సరైన అవుట్ పుట్ లేక, థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెలుగు సినిమాల్లో ఉన్నంతమంది స్టార్ హీరోలు ఎక్కడా లేరు. వాళ్లంతా సవ్యంగా సినిమాలు చేస్తే, నెలకు కనీసం రెండు పెద్ద సినిమాలు రావాలి. కానీ అలా జరగడం లేదు. క్వాలిటీ చెక్ అవసరమే. కోట్లలో పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు దాని ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని కూడా అంచనా వేయాలి. అందుకోసం ఆచి తూచి సినిమాలు చేయాలి. అలాగని రెండేళ్లకు ఒక సినిమా అంటే ఎలా?
ఈనెల 31న ఏకంగా 5 సినిమాలొస్తున్నాయి. తలోవారం పంచుకొంటే.. థియేటర్లకు కాల్సినంత కంటెంట్ ఉంటుంది కదా. కానీ ఆ దిశగా ఆలోచించరు. రెండు సెలవులు కలిసొస్తే.. ఒకేసారి పది సినిమాలైనా విడుదల చేసేస్తారు. ఎంత లాంగ్ వీకెండ్ వచ్చినా, సినిమాని చూసే ప్రేక్షకులు మారరు కదా. సీనియర్ సినీ గోయర్స్ సంఖ్య ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. వాళ్లు మాత్రం వారానికి ఎన్ని సినిమాలు చూస్తారు? ఇలాంటి లెక్కలు హీరోలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. డేట్ల మాయలో పడిపోయి, మిగిలిన వారాలు బాక్సాఫీసుని ఖాళీగా ఉంచుకొంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.