భిన్నత్వంలో ఏకత్వం మన దేశ మౌలిక లక్షణం. దాని గురించి గొప్పగా చెప్పుకుంటాం. కాదు కూడదు భిన్నత్వం ఏమీ ఉండకూడదు .. అంతా ఏకత్వమే ఉండాలంటే మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఎందుకంటే మన దేశంలో కులాలు, మతాలు, భాషలు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో భిన్నత్వాల ఏకత్వం. అందరూ అందర్నీ గౌరవించాలి. ఒకరి మతాల్ని..మతాచారాల్ని.. అలవాట్లను.. కించపర్చకూడదు. కాదు.. అందరం ఒక్కలాగే ఉందామని ఒత్తిడి తెస్తే అది అది ప్రజల మధ్య విభజనకు కారణం అవుతుంది. కారణం ఏదైనా దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తేవాలన్నది తమ లక్ష్యమన్నట్లు.. వన్ నేషన్ – వన్ ఎజెండా అన్నట్లుగా పరిపాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ ఉమ్మడి పౌరస్మృతి మీద దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికలకు ముందు ఇదే హాట్ టాపిక్ కానుంది. ఇటీవల ప్రధాని మోదీ భోపాల్‌లో ఇదే అంశంపై మాట్లాడారు. వేర్వేరు చట్టాలతో దేశం నడిచేదెలా అని ఆవేశదన చెందారు. కానీ ఆయన మర్చిపోయిందేమిటంటే..70 ఏళ్లుగా దేశం అలాంటి చట్టాలతో సమస్యలు లేకుండానే కొనసాగుతోంది. అలా అని ఈ ఒకే దేశం.. ఒకే చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకించగలమా అంటే… దాని వల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పేవారున్నారు. కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ నేషన్ – వన్ లాపై పట్టుబడుతున్న వారి గత చరిత్రే. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుసుకుని ఈ అంశాన్ని హైలెట్ చేసుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని చేస్తున్న ప్రయత్నాల వల్లే అనేక అనుమానాలు బలపడుతున్నాయి.
ఆరెస్సెస్ ఒక్కో నినాదాన్ని అమలు చేస్తూ వస్తున్న ప్రధాని మోదీ
ఒకే దేశం – ఒకే చట్టం.. అనేది భారతీయ జనసంఘ్ నినాదం. దీన్ని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రతీ సారి పెడుతుంది. తొమ్మిదేళ్లుగా దీనిపై చర్చ పెడుతున్నారు కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక దేశంలో కొందరికి రెండు చట్టాలు ఎందుకు వర్తించాలన్నది బీజేపీ ప్రధాన వాదన. ఈ ఏడాది ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు, వచ్చే ఏడు సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ వాదనను మరోసారి తెరపైకి తెచ్చింది కేంద్రం. ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఉమ్మడి పౌర స్మృతిపై ప్రజల నుండి అభిప్రాయాలు కోరాలని లా కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఉమ్మడి పౌర స్మృతి ఈ దశలో అవసరం లేదని లేదా వాంఛనీయం కూడా కాదని స్పష్టంగా చెబుతూ 2018లో 21వ లా కమిషన్ ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. అయితే ఈ అభిప్రాయాలు ఇష్టం లేకనే నే మళ్లీ సొంత ఎజెండాతో కేంద్రం ఈ విషయాన్ని తెరపైకి తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో తమ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత పార్టీ అజెండాలోని అంశాల ను ఒక్కొక్కటీ అమలు చేసేందుకు ప్రయ త్నిస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ మందిరం నిర్మాణం చకచకా సాగిపోతోంది. దీనిని మత పరమైన, అంశంగా కాకుండా స్థల వివాదంగా కోర్టు పరిష్కరిం చింది. రామమందిరం స్థలానికి బదులుగా ముస్లింలు మసీదు కట్టుకునేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని హిందువులు ఇచ్చేట్టు పరిష్కారం కుదిరింది. అలాగే, తలాక్ సమస్యను స్త్రీ, పురుషుల మధ్య సమానత్వ భావన ప్రాతిపదికగా అప్పటికప్పుడు ముమ్మారు తలాక్ చెప్పే విధానాన్ని రద్దు చేశారు. ఈజిప్ట్ వంటి ముస్లిం దేశం ఎప్పుడో దశాబ్దాల కిందటే తలాక్ విధానాన్ని రద్దు చేసిందని బీజేపీ చెబుతూనే ఉంది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి సమస్యను పరిష్కరించేం దుకు బీజేపీ పావులు కదుపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నోటివెంట ఉమ్మడి పౌరస్మృతి మాట రావడం యాదృచ్ఛికం అనుకోవడానికి లేదు.
దేశంలో ఇప్పుడు కొన్ని అంశాల్లో అందరికీ ఒకే చట్టం లేదు – ముఖ్యంగా వివాహ చట్టాలు !
ఒకే దేశం – ఒకే చట్టం ఉండాలని చెప్పేదే యూనిఫామ్ సివిల్ కోడ్. అదేమిటి మనదేశంలో అందరికీ ఒకే చట్టం అమలు కాదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ కావడం లేదనేది అసలు నిజం. దేశంలో ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన చట్టాలున్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు అమలవుతున్నాయి. ట్రిపుల్ తలాక్ వంటి వివాదాలు ఈ కారణంగానే వస్తున్నాయి. మతపరమైన అచారాలు, సంప్రదాయాలకు అతీతంగా భారత భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడం ఉమ్మడి పౌరస్మృతి లక్ష్యం. ఈ దేశంలో పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, పిల్లలను దత్తత తీసుకోవడం, జీవనభృతి లాంటి విషయాలకు సంబంధించి.. చట్టాలు అందరికీ ఒకేలా లేవు. పౌరులు ఆచరించే మతం, విశ్వాసాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి.. చట్టం ఒక్కోలా ఉంది. అయితే.. మతంతో సంబంధం లేకుండా, లింగ భేదాల్లేకుండా.. భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడమే.. యూనిఫాం సివిల్ కోడ్. మత చట్టాలను రద్దు చేసి.. ఉమ్మడి పౌరస్మృతి ద్వారా అందరికీ అన్ని అంశాల్లో వర్తించే చట్టాలను తీసుకు రావాలని కేంద్రం భావిస్తోంది. అంటే.. ఇక్కడ మతాల వారీగా ఎవరికి వాళ్లుగా అమలు చేసుకునే చట్టాలు చెల్లవు. ఉమ్మడి పౌరస్మృతి అంటే పెళ్లి, దత్తత, వారసత్వ హక్కుల్లో ఏకరూపత. దేశవాసులందరికీ ఒకే రాజ్యాంగం వర్తిస్తుంది కనక ఏ మతం వారికైనా ఒకే వివాహ చట్టం ఉండేట్టు చూడడానికి ఉన్న ఉపకరణమే ఉమ్మడి వివాహ చట్టం. ఇందులో వివాదాలకు తావు లేదు. కానీ ఏ చట్టమైనా వైవిధ్యభరితమైన భారత సంస్కృతిని దెబ్బ తీసేలా ఉండకూడదన్న భావనతోనే ఉమ్మడి పౌరస్మృతి వివాదాలకు దారి తీస్తుందనుకుని ఈ ఏడు దశాబ్దాలుగా అలాంటి చట్టం తీసుకు రాలేదు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు మనం అనుసరించవలసిన ఆదేశాలను నిర్దేశిస్తాయే తప్ప అందులో పేర్కొన్న ప్రతి అంశాన్ని చట్ట రూపంలోకి తీసుకు రావాలని చెప్పవు. ఒక వేళ అలా చెప్పవలసిన అవసరమే ఉంటే రాజ్యాంగం రూపొందించే సమయంలోనే ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగంలో భాగమై ఉండేది. ఆదర్శాలను అమలు చేయడానికి అనువైన వాతావరణం ఉండాలి. మత ప్రాతిపదికనగానీ మరో రకంగా కానీ ఏ వర్గం మీదా కసి తీర్చుకునే ఉద్దేశం ఉండకూడదు.
కాలానుగుణంగా మార్పులు చేస్తూ వస్తున్న ప్రభుత్వాలు – మహిళలకు ఆస్తి హక్కు కూడా !
మన దేశం అనేక మతాల, భాషల, సంస్కృతుల, ఆచారాల సమాహారం. ఇవి తరతరాలుగా ఆయా వర్గాలు అనుసరిస్తూ వస్తున్నవే. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా .. వాళ్లలో వాళ్లకు అనేక భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. హిందువుల్లోనూ.. భిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వాళ్లున్నారు. ముస్లింలలోనూ.. షరియా చట్టాలను పాటించని వాళ్లున్నారు. క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలను రూపొందించుకున్నాయి. క్యాథలిక్స్, ఇతర మతస్థులకు భిన్నమైన నియమాలున్నాయి. హిందువుల్లో.. కొడుకులతో సమానంగా కూతుళ్లకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ.. దీనికంటే ముందే ఐదు రాష్ట్రాలు.. మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి. ఉమ్మడి పౌరస్మృతిని కేవలం ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం జరిగింది. కానీ హిందువులు, క్రైస్తవులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెబుతూంటారు. అయితే బీజేపీ విధానాల ప్రకారం.. ముస్లింల షరియా చట్టాలకు కౌంటర్‌గానే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తున్నారనే అభిప్రాయాలుండటంతో హిందువులు పెద్దగా పట్టించుకోవడం లేదు. షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేదే వాళ్ల వాదన. ఇందుకు.. ఇస్లాం మతంలో భార్యలకు విడాకులిచ్చే ట్రిపుల్ తలాక్‌ని ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. 2019లో ట్రిపుల్ తలాక్‌ని నేరంగా మారుస్తూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ అంశంపై స్పందించే వర్గాలు కూడా ముస్లింల వైపు నుంచి ఉండటమే అసలు సమస్య అనుకోవచ్చు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఉ యూనిఫాం సివిల్ కోడ్ గురించి పంజాబ్‌లో సిక్కులకు చెప్పాలని ప్రధాని మోదీకి సవాల్ చేసారు.
యూనిఫాం సివిల్ కోడ్ నినాదం ఇప్పటిది కాదు.. కానీ !
ఉమ్మడి పౌరస్మృతి డిమాండ్ బీజేపీ తెచ్చింది కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్- 44 కూడా ఇదే చెబుతోంది. దేశ పౌరులకు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది. దేశ సమైక్యత కోసం యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని.. సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. అయితే.. తీవ్రమైన పరిణామాలకు దారితీసే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడం కంటే.. లింగ అసమానతలను తొలగించేందుకు.. పౌర స్మృతులను సవరణ చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఈ సమస్య చాలా క్లిష్టమైనదే.అయితే ఇలా ఉమ్మడి పౌరస్మృతి కొన్ని విషయాల్లో సాధ్యమా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యావత్ దేశానికి ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడమన్నది నిజంగా చాలా ఉన్నతమైన లక్ష్యమేనని అందరూ అంగీకరిస్తారు. కానీ ముస్లిం పర్సనల్ లా కి సంబంధించిన అన్ని అంశాలకు కలిపి ఒక్కదాన్నే తీసుకురావడంపైనే ఎక్కువ మంది అభ్యంతరం. ఏ మతాన్ని దెబ్బతీయకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉమ్మడి పౌర స్మృతిని ఆమోదించవచ్చన్నది ఎక్కువ మంది అబిప్రాయం.
ఓట్ల రాజకీయాలకు వాడుకుంటే దేశానికి నష్టం చేసినట్లే !
కారణం ఏదైనా యూనిఫాం సివిల్ కోడ్ అంశంపై దేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలోచనలో లోతును గుర్తిస్తే.. ఇందులో చాలా వరకూ మంచి ఉంది అని అనిపిస్తుంది. కానీ ఈ ఆలోచన చేస్తున్న వారి విధానాలు మాత్రమే అనుమానాలు రెకెత్తిస్తున్నాయి. మరెవరి జోలికి పోకుండా కేవలం ముస్లింలకు మాత్రమే ఈ యూనిఫాం సివిల్ కోడ్ వర్తింప చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే బీజేపీ కేవలం ముస్లింలను టార్గెట్ చేసుకుని అన్నీ చేస్తుందని నమ్ముతున్నారు. నిజానికి ఈ యూనిఫాం సివిల్ కోడ్‌పై వ్యతిరేకత.. .. ఇతర వర్గాల్లోనూ ఉంది. సిక్కులు , హిందూ యునైటెడ్ ఫ్యామిలీ.. హెచ్ యూఎఫ్.. వంటి కింద ఉన్న వారు అసలు అంగీకరించారు. కానీ కేంద్రం మాత్రం ముందుకెళ్తోంది. అందరికీ యూనిఫాం సివిల్ కోడ్ ను ఆమోదయోగ్యంగా అమల్లోకి తీసుకు వస్తే పర్వాలేదు … కానీ రాజకీయాల కోసం ఏదేదో చేస్తే మాత్రం దీర్ఘ కాలలో దేశానికి చేటు చేసినట్లవుతుంది. దీన్నిపాలకులు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.