ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులను పిండుకునే ప్రయత్నాల్లో ఉంది. ఉచితంగా వచ్చే ఇసుకను ఖరీదు చేయడం దగ్గర్నుంచి బస్ చార్జీలు, పెట్రో ధరలు లాంటి వాటినీ వదల్లేదు. దీనకంతటికి కారణం… ప్రభుత్వం వద్ద చిల్లర ఖర్చులకూ డబ్బుల్లేని పరిస్థితి. ఈ విషయం 9 నెలల … ప్రభుత్వ రాబడి, ఖర్చుల వ్యవహారాలతో తేలిపోయింది. ఖర్చుకు, ఆదాయానికి… పొంతన లేకుండా పోవడం వల్ల.. ఈ ఏడాది లోటు బడ్జెట్.. రూ. 40వేల కోట్లకు చేరింది. ఈ లోటు రూ. 40వేల కోట్లుకుపైగా అప్పులు చేసినప్పటికీ.. వచ్చి పడింది. అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
9నెలల్లో అంచనాల్లో సగం మాత్రమే ఆదాయం..!
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… రూ. 2,14,558 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో తమ ప్రభుత్వం ఆదాయం రూ. 1,78,697 కోట్లు సాధిస్తుందని ప్రకటించారు. తీరా చూస్తే.. తొమ్మిది నెలల్లో వచ్చిన ఆదాయం రూ. 72,322 కోట్లు మాత్రమే. ఈ లెక్కన చూస్తే.. మరో మూడు నెలల్లో.. పాతిక వేల కోట్లు రావడం కూడా కష్టమే. అంటే.. ఆదాయం లక్ష కోట్ల లోపే ఉంటుంది. దాదాపుగా 40 శాతం బడ్జెట్ అంచాల కన్నా తక్కువ అవుతుంది. ఆదాయం ఇంత ఘోరంగా పడిపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమని చెప్పొచ్చు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి పనులు నిలిచివేతతో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయి. ఫలితంగా ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పడిపోయింది. రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ టాక్సుల్లో సగానికి సగం తేడాకనిపిస్తోంది.
ఖర్చు కూడా సగమే..! పథకాలకు డబ్బులివ్వట్లేదు..!
బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కువ కేటాయించారు. రూ. 2,14,558 కోట్ల కేటాయింపుల్లో 70 శాతం సంక్షేమ పథకాలకే. కానీ తొమ్మిదినెలల్లో ఖర్చు పెట్టింది రూ. 1,07,535 కోట్లు. అంటే సగం మాత్రమే. పథకాల్లో భారీగా కోత పెట్టినట్లుగా.. స్పష్టమవుతోంది. బడుగు, బలహీనవర్గాలకు..కార్పొరేషన్లకు..అభివృద్ధి పనులకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. గత ఏడాది 2018 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.1,18,565 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే పదకొండు వేల కోట్లు ఎక్కువే ఖర్చు పెట్టారు. ఈ సర్కార్ పనితీరు అత్యంత దారుణంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది.
9 నెలల్లో రూ. 40వేల కోట్ల అప్పులు..!
పదమూడు శాతం వడ్డీ అయినా పర్వాలేదు.. పది వేల కోట్లివ్వండి.. కుదిరితే.. ఇరవై వేల కోట్లివ్వండి.. అటూ ప్రభుత్వం ఆర్థిక సంస్థల వద్ద బేరం చేస్తోంది. ప్రభుత్వం తీరు చూసి.. ఎల్ఐసి వంటి సంస్థలు ఎందుకైనా మంచిదని దూరంగా ఉంటున్నాయి. అయినా అందు బాటులో ఉన్న వనరులన్నింటినీ తాకట్టు పెట్టేసి ప్రభుత్వం రూ. 40వేల కోట్ల అప్పును ఈ తొమ్మిది నెలల్లో తీసుకు వచ్చింది. పూర్తి ఏడాదికి రూ. 35,260 కోట్లకు మించి అప్పు తీసుకుంటామని బడ్జెట్లో చెప్పారు. మరి 9 నెలలకే తెచ్చిన అప్పులు రూ. 40వేల కోట్లు దాటిపోయాయి.
పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటంతో….ప్రభుత్వ చిల్లల ఖర్చులకూ డబ్బుల్లేక.. ప్రజలపై పన్నుల భారం పెంచుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా… ప్రభుత్వం లాయర్‌కు ఐదు కోట్లు.. బీసీసీ లాంటి కన్సల్టెన్సీలకు రూ. ఆరు కోట్లు… సలహాదారులు.. ఇతురలకు.. కోట్లకు కోట్లు కుమ్మరిస్తూనే ఉంది.