ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది. దీనికికారణం ఆయన పిటిషన్ వేయడం మాత్రమే కాదు.. తన వాదనను అత్యంత బలంగా వినిపిస్తూ.. పిటిషన్లోని అంశాలను పొందుపర్చడం కూడా. బెయిల్ షరతులను పక్కాగా ఉల్లంఘిస్తున్నారన్న విషయాన్ని రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో సాక్ష్యాధారాలతో సహా వివరించారు. ఇది ఇప్పుడు న్యాయనిపుణుల్లో చర్చకు కారణం అవుతోంది. పిటిషన్ విచారణకు వస్తే.. సీబీఐ ఎలాంటి వాదనలు వినిపిస్తుంది..? కోర్టు ఏ నిర్ణయం ప్రకటించే చాన్స్ ఉందనేది ఆ చర్చల సారాంశం.
సాక్ష్యులను ప్రభావితం చేయకూడదనేది మొట్టమొదటగా ఎవరికైనా బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టులు పెట్టే షరతు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అదే షరతు ప్రధానంగా ఉంది. కానీ ఆయన తన కేసుల్లో సాక్షులుగా ఉన్న వారందరికీ ఏదో విధంగా ప్రయోజనం కల్పిస్తూనే ఉన్నారు. సహనిందితులుగా ఉన్న వారికి పదవులు.. ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఇవన్నీ మొదటి నుంచి చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. ఎవరైనా కోర్టుల్లో పిటిషన్లు వేస్తే.. జగన్కు ఇబ్బందులు తలెత్తుతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమయింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. శ్రీలక్ష్మి అనే ఐఏఎస్ అధికారిని క్యాడర్ మార్పించి మరీ ఏపీకి తీసుకొచ్చి.. చీఫ్ సెక్రటరీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నారని చెబుతున్నారు. అప్పటి అక్రమాస్తుల కేసులో ఉన్న అయోధ్యరామిరెడ్డి అనే కాంట్రాక్టర్ దగ్గర్నుంచి ఆదిత్యనాథ్ దాస్ అనే అధికారి వరకూ అందరూ పదవులు… ఇతర ప్రయోజనాలు పొందారు. ఇవన్నీ బెయిల్ షరతుల ఉల్లంఘనేననన్న అభిప్రాయాన్ని ఎప్పటి నుంచే న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
రఘురామకృష్ణరాజు .. తాను వేసిన పిటిషన్లో… ఇతర కీలకమైన అంశాలను కూడా వివరించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వివిధ కారణాలు చెబుతూ… కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని.. అధికారాన్ని ఉపయోగించి… అందరి నోళ్లు నొక్కేలా వ్యవహరిస్తున్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఇలా ఇతర అంశాలను చొప్పించారు. ఇది బెయిల్ షరతుల ఉల్లంఘన కాదు కానీ.. బెయిల్పై ఉన్న ఓ నేరస్తుడు.. తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని.. న్యాయవ్యవస్థ భావించడానికి ఉపయోగపడుతుంది. ఈ కోణంలో రఘురామకృష్ణరాజు.. చాలా ప్లాన్డ్గానే పిటిషన్ వేశారన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వ్యక్తమవుతోంది.
పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత సీబీఐ స్పందన అత్యంత కీలకం. సీబీఐ.. అవి బెయిల్ షరుతుల ఉల్లంఘన కాదు అని చెబితే.. సీబీఐ కోర్టు కూడా ఏమీ చేయలేదు. సరే అంటుంది. కానీ సీబీఐ మాత్రం.. జగన్ బెయిల్ రద్దు చేయాలని పట్టుబడితే మాత్రం… సీఎం జగన్కు ఇబ్బందికరమే. అయితే అది జరుగుతుందా.. అనేది ఇప్పుడు ఆసక్తికరం. సీబీఐ ఇప్పుడు స్వతంత్రంగా పని చేయడం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఆ ప్రకారం చూస్తే… సీబీఐకి పై స్థాయి నుంచి వచ్చే సూచనలను బట్టే… వాదనలు ఉంటాయి. అంతిమంగా రఘురామకృష్ణరాజు పిటిషన్లోని అంశాలను సీబీఐ ఏకీభవిస్తే… ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు.