వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జగన్ నివాళులు అర్పించారు. అనంతరం గుంటూరులో వైకాపా నిర్వహిస్తున్న ప్లీనరీకి వచ్చారు. ప్లీనరీని ప్రారంభించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు సర్కారు తీరుపై విమర్శలు చేశారు. చంద్రబాబు పాలన ఎప్పుడెప్పుడు పోవాలీ అని ఇవాళ్ల ఆంధ్రా ప్రజానీకమంతా కోరుకుంటున్నారని జగన్ అన్నారు. ఇంతటి దుర్మార్గపు పాలన, ఇంతటి అన్యాయమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేని రాష్ట్ర ప్రజానీకమంతా అనుకుంటోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల మధ్య వైకాపా ప్లీనరీ జరుపుకుంటోందనీ, రాబోయే రోజుల్లో పార్టీ దశా దిశను నిర్దేశించుకుందామని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి జగన్ చెప్పారు. ఇంతవరకూ చేసిన పోరాటాలను జ్ఞాపకం చేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఎలా పోరాటం చేయాలో అనేది కూడా చర్చించుకుందామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ ఏం చేస్తుంది అనే దగ్గరి నుంచీ, మనం అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతాం అనేది కూడా మనమంతా ఏకమై చర్చించుకునేందుకు ఈ ప్లీనరీలో కలుసుకున్నామని కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు.
అంతా బాగానే ఉందిగానీ… ఇప్పుడు కూడా ‘అధికారం అధికారం’ అనే మాటే జగన్ నోట మళ్లీ వినిపిస్తోంది! భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రావడానికి ఏం చేయ్యాలో చర్చిద్దాం అని జగన్ అనవడం వరకూ బాగానే ఉంది. కానీ, వచ్చాక ఏం చెయ్యాలనేదానిపై కూడా ఈ రెండ్రోజుల పాటు చర్చించబోతున్నట్టు చెప్పడం మరోసారి చర్చనీయం! ఈ మధ్య జగన్ ప్రసంగాల్లో కామన్ ఈ అధికారం అనే మాట ఉంటూనే ఉంది. ఏ సమస్యను ఎడ్రస్ చేసినా.. తాను అధికారంలోకి వచ్చాకనే పరిష్కారం అన్నట్టుగానే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ప్లీనరీ ప్రారంభోపన్యాసం కూడా దీంతోనే మొదలుపెట్టారు.
గడచిన మూడేళ్లలో ప్రతిపక్ష పార్టీగా వైకాపా సాధించిన విజయాల గురించి ముందుగా ప్రస్థావించి ఉంటే బాగుండేది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వైకాపా పోరాడి విజయం సాధించిన సందర్భాలను చెప్పి ఉంటే కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నిండేది. ప్రారంభోపన్యాసంలో వైకాపా ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులపై చర్చించి ఉంటే సందర్భోచితంగా ఉండేది. కానీ, రావడం రావడమే.. చంద్రబాబు పాలన అంతం చేయడం కోసం జనాలు ఎదురుచూస్తున్నారంటూ జగన్ మొదలుపెట్టేశారు. తొలిరోజు పార్టీ నేతల ప్రసంగాల్లో చంద్రబాబుపై విమర్శలే ఎక్కువగా వినిపించాయి. తరువాత రోజులు కూడా ఇదే ధోరణి కొనసాగిస్తారా.. సంస్థాగతంగా పార్టీలో జరగాల్సిన మార్పులకూ అనుసరించాల్సిన వ్యూహాలకు ప్రాధాన్యత ఇస్తారో లేదో వేచి చూద్దాం.