ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పూర్తిగా ఆర్థిక పరంగా నిర్వీర్యం అయిపోయినట్లుగా కనిపిస్తోంది. గత మూడు నెలలుగా ప్రభుత్వం నొక్కాల్సిన పథకాల బటన్లన్నీ పెండింగ్ లో ఉండిపోతున్నాయి. అయినా జీతాలు ఆలస్యం అవుతున్నాయి. నిధులు లేకపోవడమా.. లేకపోతే ఎన్నికలకు ముందు ఒకే సారి అకౌంట్లలో జమ చేసి ఓటర్లకు గిలిగింతలు పెట్టే వ్యూహం అమలు చేస్తున్నారా అన్నది తేలాల్సిఉంది.
పెండింగ్ లో ఉన్న క్యాలెండర్ పటన్లు
సెప్టెంబర్ 2023 – చేయూత
అక్టోబర్ 2023 వసతి దీవెన
నవంబర్ 2023 – సున్నావడ్డీ – పంట రుణాలు, విద్యాదీవెన
డిసెంబర్ 2023 – చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జగన్ రెడ్డి గతంలో విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం గత నాలుగు నెలల్లో ఈ పథకాలకు బటన్లు నొక్కాలి. కానీ వాటిని పెండింగ్ లో పెట్టుకున్నారు. ఐదు, పది కోట్లు నిధులు విడుదల చేసే లా నేస్తం, విదేశీ విద్యాదీవెనక, కల్యాణ మస్తు వంటి పథకాలకు బటన్లు నొక్కారు. వాటి లబ్ది దారులు రెండు అంకెల సంఖ్యలోనే ఉంటారు. అత్యధిక లబ్దిదారులు ఉండే పథకాల బటన్లు మాత్రం ఆపేస్తున్నారు.
విద్యాదీవెన ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కష్టాలు
ఫీజు రీఎంబర్స్ మెంట్ ఫథకాన్ని జగన్ రెడ్డి నాలుగు ముక్కలు చేశారు. నాలుగు విడతల్లో ఇస్తామని చెప్పారు. నాలుగు సార్లు పేపర్లలో ప్రకటనలు.. నాలుగు సార్లు ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు జిల్లాల్లో బహిరంగసభలు ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేశారు. అయితే ఇది కూడా చేయలేకపోతున్నారు. ఈ ఏడాది ఫీజు రీఎంబర్స్ మెంట్ ఒక్క సారి మాత్రమే విడుదల చేశారు. విద్యాసంవత్సరంలో ముగింపుకు వస్తున్నా ఇంకా రెండు విడతలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని బటన్ ఎప్పుడు నొక్కుతారో తెలియదు.
చేయూత కోసం మూడు నెలలుగా ఎదురు చూపులు
జగన్ రెడ్డి తన పథకాల్లో కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టే పథకాల్లో అమ్మఒడి తర్వాత చేయూత మాత్రమే. ఎప్పుడో అక్టోబర్ లో ఇవ్వాల్సిన చేయూత పథకం నిధులకు ఇంత వరకూ బటన్ నొక్కలేదు. ఎన్నికలకు ముందు నొక్కుదామని ఆపారో లేకపోతే.. డబ్బుల్లేవో తెలియదు కానీ.. జగన్ రెడ్డి దగ్గర అప్పులు తెచ్చే మ్యాటర్ కూడా అయిపోియందని అందుకే ఏమీ నొక్కలేకపోతున్నారని ప్రజలుకూడా అనుకునే పరిస్థితి వచ్చింది. సున్నావడ్డీ, పంట రుణాల సంగతి దిక్కే లేదు.
లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే పైసా సాయం లేదు !
తుపానుల వల్ల లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే పైసా సాయం చేయలేదు. జనవరిలో ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని కోతలు కోశారు. ఎంత ఇస్తారన్నది తెలియదు. ఎకరానికి ఇంత అని పరిహారం ప్రకటించలేదు. గతంలో ప్రకృతి విపత్తుల వల్ల జరిగిపోయిన నష్టానికి ఇచ్చిన పరిహారం.. నాలుగైదు వందల రూపాయల్లోనే ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అది కూడా ఇస్తారో లేదో తెలియదు. జనవరి నుంచి కొత్త అప్పులు తీసుకోవాలంటే.. కేంద్రం అనుమతి తీసుకోవాలి. ఎంత అనుమతి ఇచ్చిందనేది తేలాల్సి ఉంది.