ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 11న మొదటి విడత ఎన్నికలు మొదలవుతాయని, ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని, మే 23వ తేదీకంతా ఫలితాలు వచ్చేస్తాయని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. అయితే సరిగ్గా నెల రోజుల లోపలే ఎన్నికలు మొదలు కానుండడంతో, ఇదివరకే ఎస్టాబ్లిష్ అయిన పార్టీలతో పోలిస్తే, ఈ ఎన్నికల్లో తొలిసారిగా తన పడుతున్న జనసేన పార్టీకి ఇది శరాఘాతంలా తగిలింది అని విశ్లేషకులు అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
అధికార పార్టీకి సాధారణంగా నాయకుల కొరత ఉండదు. మేనిఫెస్టో తదితర అంశాల్లో కూడా అధికారపార్టీకి కొంత సానుకూలత ఉంటుంది. తాము ఇప్పటి వరకు ఏం చేశామో చెబుతూ, ఇంకా ఏం హామీలు మిగిలి పోయాయో వివరిస్తూ, వాటిని తదుపరి ప్రభుత్వంలో లో పూర్తి చేస్తామని చెబుతూ, అధికార పార్టీలు వారి మేనిఫెస్టో తయారు చేసుకుంటాయి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అలాగే తమ పార్టీ టికెట్ మీద గెలిచిన నాయకులతోపాటు గతంలో వైఎస్ఆర్సిపి నుండి చేర్చుకున్న నాయకులు కూడా పార్టీలో సంసిద్ధంగా ఉండటం తో, అధికార పార్టీకి ఎన్నికలు అనుకున్నదాని కంటే ముందుగానే జరుగుతున్నప్పటికీ పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
ఇక వైయస్సార్సీపి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తి చేసి, నాయకులను పార్టీలో చేర్చుకుంటూ గత నెల రోజులుగా బిజీగా ఉన్నారు. నవరత్నాల పేరిట మేనిఫెస్టో కూడా గతంలో ఎప్పుడో విడుదల చేసి ఉన్నారు. దీంతో తన వైపు నుండి ఎన్నికలకు దాదాపుగా సిద్ధంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. అభ్యర్థుల విషయంలో కొంత కసరత్తు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా, అభ్యర్థుల కొరత అయితే ఈ పార్టీకి కనిపించడం లేదు.
ఎటొచ్చీ అనుకున్న దానికంటే ముందుగా ఎన్నికలు జరగడం శరాఘాతంలా తగిలింది జనసేనకే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించినప్పటికీ, చాలా నియోజకవర్గాల్లో ఇంకా ఆ పార్టీకి నాయకులు లేరు. ఓట్లు వేయడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నప్పటికీ, చాలా చోట్ల వారికి ఆ పార్టీ నాయకులు ఎవరో తెలియడం లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు నాయకులను ప్రకటించినా జనసేన ను విస్తృతంగా అనుసరించే అభిమానులకు ఆ విషయం చేరడం పెద్ద సందేహం కాదు కానీ, తటస్థులకు, రాజకీయాల మీద మరీ ఎక్కువ శ్రద్ధ చూపించని వారికి ఆ నాయకుల వివరాలు చేరడం కచ్చితంగా సమస్య అవుతుంది.
అదే విధంగా మేనిఫెస్టో విషయంలో కూడా జనసేన పార్టీ ఇంకా వెనుకబడే ఉంది. 2018 ఆగస్టులోనే మేనిఫెస్టో ప్రకటిస్తానని గత ఏడాది మార్చి 14న పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ, ఆ తర్వాత కేవలం కొన్ని హామీలను మాత్రమే ప్రకటించి, పూర్తిస్థాయి మేనిఫెస్టోను ఎన్నికల ముందు విడుదల చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. మరి మేనిఫెస్టో ఎంత వరకు సిద్ధం అయిపోయింది అన్నది తెలియడం లేదు. మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ప్రకటిస్తాడేమో అన్నది వేచి చూడాలి.
అలాగే, జనసేన అధిపతి పాత తరం నాయకులను కాకుండా కొత్త తరం నాయకులను పరిచయం చేస్తానని ప్రకటిస్తున్నారు. ఏదో ఒక పార్టీ నుండి నాయకులను లాక్కొని పోటీ చేయాలంటే ఈ సమయం సరిపోతుందేమో కానీ, తాను అనుకున్నట్టుగా కొత్త తరం నాయకులను తయారు చేయడానికి, ఫిరాయింపు దారులు కాకుండా కొత్త నాయకులను ప్రోత్సహించడానికి ఈ సమయం ఖచ్చితంగా సరిపోదు. మరి ఈ సమస్యనును జనసేనాని ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.
మొత్తానికి రాబోయే నెల రోజులు రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఇటు నుండి అటు జంపింగ్‌లు, అటు నుండి ఇటు ఫిరాయింపులు, ఆరోపణలు, ప్రచారాలతో నెల రోజుల పాటు హోరెత్తి పోనుంది. మరో 15 రోజుల్లో నామినేషన్లు కూడా వేయాల్సి ఉంది. మరి జనసేనాని ఈ సమస్యను ఏవిధంగా ఎదుర్కొంటాడు అనేది ఆయన రాజకీయ పరిణితి ని సూచిస్తుంది.